భారంగా బతుకు బండి
- బరువుగా సగటు ఉద్యోగి జీవనం
- పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నాన్చుడు ధోరణి
రెవెన్యూ శాఖలో రామకష్ణ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రూ.24 వేలు జీతం. ఇద్దరు సంతానం. ఒకరు పదవ తరగతి, మరొకరు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. చూసేవారికి ఈయన జీతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కుటుంబ ఖర్చుల వరకే సరిపోతోందని ఆయనకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం దుబారా ఖర్చులకు వెళ్లినా అప్పు చేయాల్సిందే. ఇదీ సగటు ఉద్యోగి పరిస్థితి.
అనంతపురం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగం అంటే మంచి జీతం.. విలాసవంత జీవితం అని అందరూ అనుకుంటారు. అయితే అందరి జీవితాలూ అలా సాఫీగా లేవు. సగటు ఉద్యోగులు బతుకుబండిని భారంగా నెట్టుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, రవాణా, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా వేతనాలు పెరగడం లేదు. దీంతో సంపాదనకు - కుటుంబ అవసరాలకు మధ్య అంతరం పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నచిన్న సరదాలు, కోరికలు కూడా పెద్ద భారంగా పరిణమిస్తున్నాయి. పండుగలు, శుభకార్యాలకు బడ్జెట్ పెరిగిపోతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సగటు వేతనం రూ.10వేల నుంచి రూ.30వేల మధ్య తీసుకుంటున్న ఉద్యోగులు నెలసరి బడ్జెట్ సంపాదనకు మించుతోంది. జిల్లా వ్యాప్తంగా సగటు వేతన జీవులు దాదాపు 50వేల మంది దాకా ఉంటారు. వీరంతా పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు మేరకు వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది.
మా కష్టాలు మాకే తెలుసు
నాకు రూ.33 వేల వేతనం వస్తుంది. అమ్మ, భార్య, ఇద్దరు పిల్లలు. ఇంటి బాడుగ రూ.6వేలు. మిగిలిన డబ్బుతో ఎంతో పొదుపుగా సంసారం నెట్టుకొస్తున్నాను. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో మాకే తెలుసు. పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చదివించలేకపోతున్నా. పండుగలు వచ్చాయంటే అదో అదనపు ఖర్చు.
– మంజూనాథ్, సీనియర్ అడిటర్, ఆడిట్ శాఖ
భారంగా నెట్టుకొస్తున్నాను
అన్ని కటింగ్‌లు పోనూ చేతికి రూ.21 వేల వేతనం వస్తుంది. ఇద్దరు సంతానం. అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, అమ్మాయి డిగ్రీ చేస్తోంది. వారి చదువులకు, ఇంటి ఖర్చులకు వస్తున్న వేతనం సరిపోతోంది. ఇక ఇంటి ఖర్చులకూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. పిల్లల కోసం పొదుపు చేసేందుకు కూడా జీతం డబ్బులు మిగలడం లేదు.
– ఫకృద్ధీన్, ప్రచార సహాయకుడు, సమాచార శాఖ, అనంతపురం
ఖర్చులకు సరిపోవడం లేదు
నాకు రూ.10 వేలు వేతనం వస్తుంది. ఈ కొద్ది జీతం సరిపోవడం లేదు. ఇంటి బాడుగ రూ.2,500. కనీస అవసరాలకు ఆ మొత్తం సరిపోతోంది. ఎంతో గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ఏమాత్రం దుబారాకు వెళ్లినా కష్టాలు కొనితెచ్చుకోవడమే అన్నట్లుగా ఉంది. పండుగలు, శుభకార్యాలు ఉంటే ఆ నెల మరీకష్టంగా ఉంటోంది.
– రాఘవేంద్ర, సెక్యూరిటీ గార్డ్, అనంతపురం
కుటుంబపోషణ భారంగా
నాకు నెలసరి రూ.10 వేలు వేతనం వస్తుంది. కుటుంబపోషణ భారంగా నెట్టుకొస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు బీటెక్, మరొకరు డిగ్రీ చదువుతున్నారు. వస్తున్న వేతనం ఏ మాత్రం సరిపోదు. ఇంటి బాడుగ, ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాలాంటి చిరుద్యోగులకు వేతనం పెంచితే కొంతైనా బాగుటుంది.
– మల్లికార్జున, కాంట్రాక్టు ఉద్యోగి, నగరపాలక సంస్థ.