మిగిలింది ఇక ఎనిమిది రోజులే...
న్యూఢిల్లీ: 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఇక 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొన్ని భద్రతా కారణాల రీత్యా 2005కు ముందు ఉన్నఈ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు గతంలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఆయా నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు వీలుగా 13 నెలల గడువు విధించింది. అయితే జనవరి 1 ముగిసిన ఈ గడువున జూన్ 30 వరకు పొడిగించారు. ఈ నెలాఖరు లోపు తమ సమీప బ్రాంచీల్లో మార్చుకోవాలని సూచించింది. ఎవరి దగ్గరైనా అలాంటి నోట్లు ఉంటే దేశవ్యాప్తంగా ఉండే ఏ ప్రభుత్వం బ్యాంకులోనైనా సమర్పించి, దానికి సమానమైన నోట్లను పొందవచ్చని తెలిపింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇక సదరు నోట్లు చెల్లవని స్పష్టం చేసింది.
కాగా విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీ నోట్లను నిరోధించేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిబంధన ప్రవేశపెట్టింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను సునాయాసంగా గుర్తించవచ్చునని పేర్కొంది. వాటి వెనుకవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉండదని, ఇక ముందు ముద్రించే నోట్లకు కింద సంవత్సరం ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.