pre-budget talks
-
PRE-BUDGET 2023: గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రోత్సాహమివ్వండి
న్యూఢిల్లీ: ఫండ్స్ ద్వారా పసిడిలో పెట్టుబడులు పెట్టేలా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తగు చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరింది. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్‌లపై పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 2023–24 బడ్జెట్‌కు సంబంధించి ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ ఈ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. వీటి ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు, అలాగే తమ నిధుల్లో 90 శాతానికి మించి పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)పై ప్రస్తుతం 20 శాతంగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ను ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రత్యామ్నాయంగా, ఎల్టీసీజీ ట్యాక్సేషన్ ప్రయోజనాలు పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక్క ఏడాదికి అయినా తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పసిడి పథకాలకు పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే, ఆర్థికంగా అంతగా సమర్ధమంతం కాని భౌతిక పసిడికి ప్రత్యామ్నాయ సాధనంగా వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భౌతిక రూపంలోని బంగారంలో పెట్టుబడులు తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది‘ అని యాంఫీ పేర్కొంది. బ్రిటన్ తదితర దేశాల్లో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నట్లు వివరించింది. ఆయా దేశాల్లో పెట్టుబడియేతర బంగారంపై 20 శాతం వ్యాట్ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్) విధిస్తుండగా బంగారంలో పెట్టుబడులపై మాత్రం ఉండటం లేదని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇతరత్రా పసిడి పెట్టుబడుల సాధనాల తరహాలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. మరిన్ని ప్రతిపాదనలు.. ► ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లను కూ డా ఈక్విటీ ఆధారిత ఫండ్స్ పరిధిలోకి చేర్చాలి. ► లిస్టెడ్ డెట్ సాధనాలు, డెట్ మ్యుచువల్ ఫండ్స్‌పై పన్నులు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► అలాగే ఇంట్రా–స్కీమ్ మార్పులను (ఒకే మ్యుచువల్ ఫండ్ స్కీమ్ అంతర్గతంగా వివిధ ప్లాన్లు/ఆప్షన్లలోకి పెట్టుబడులను మార్చుకోవడం) ’ట్రాన్స్ఫర్’ కింద పరిగణించరాదు. ఇలాంటి లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపునివ్వాలి. ► ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల (ఈఎల్ఎస్ఎస్) తరహాలోనే చౌకైన, తక్కువ రిస్కులతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండే డెట్ ఆధారిత పొదుపు పథకాలను (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ► ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్‌డీల తరహాలోనే అయిదేళ్ల లాకిన్ వ్యవధితో డీఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు వర్తింపచేయాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ల్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటున్నాయి. ► ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను రిజిస్టర్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీ) బదలాయించేందుకు బీమా కంపెనీలన్నింటినీ అనుమతించాలి. అలాగే బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడానికి ఏఎంసీలకు కూడా అనుమతినివ్వాలి. ► పింఛన్లకు సంబంధించి ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ పథకాలను ప్రవేశపెట్టేందుకు మ్యుచువల్ ఫండ్స్‌కు అనుమతినివ్వాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఇచ్చే పన్ను ప్రయోజనాలను వీటికి కూడా వర్తింపచేయాలి. బడ్జెట్ సెషన్లో డేటా బిల్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగలదని భావిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. బిల్లు ముసాయిదాలోని నిబంధనలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఉగ్రవాద, సైబర్ ముప్పులతో పాటు అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు మారుతుండటాన్ని పరిగణనలోకి తీసుకునే నిబంధనల రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. బిల్లులో ప్రతిపాదించిన పర్యవేక్షణ సంస్థ డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి నియంత్రణ సంస్థల తరహాలోనే దీనికి కూడా సంపూర్ణ స్వతంత్రత ఉంటుందని పేర్కొన్నారు. -
Pre-Budget Meet: ప్రోత్సాహకాలు.. తక్కువ వడ్డీ రేటు కావాలి!
న్యూఢిల్లీ: దేశం నుంచి ఎగుమతుల పురోగతికి అలాగే ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని ఎగుమతిదారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని, తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 5వ ప్రీ–బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె గురువారం ఎగుమతి సంఘాలు, సేవా రంగాల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరిసహా ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగుమతి రంగం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తుల్లో ముఖ్యాంశాలు... ► డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల ఎగుమతుల పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఎగుమతి సంఘాల భారత సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ ఎగుమతుల విలువ 460–470 బిలియన్ డాలర్ల వరకూ పురోగమించేందుకు (2021–22లో 400 బిలియన్ డాలర్లు) మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) కింద ప్రకటించిన రూ.200 కోట్లు సముద్రంలో నీటి బొట్టని కూడా సమాఖ్య పేర్కొంది. ‘కాబట్టి, పటిష్ట ఎగుమతుల మార్కెటింగ్ కోసం, గత సంవత్సరం ఎగుమతుల విలువలో కనీసం 0.5 శాతం కార్పస్‌తో ఎగుమతి అభివృద్ధి నిధిని సృష్టించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది. అలాగే సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ద్వారా ఎగుమతి చేసే వస్తువుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని సూచించింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ), టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) రద్దు ద్వారా విధానపరమైన సరళీకరణలు జరగాలని విజ్ఞప్తి చేసింది. దేశీ మార్కెటింగ్ కోసం ఎగుమతిదారులు చేసే వ్యయాలపై 200 శాతం పన్ను మినహాయింపు కోరింది. గ్లోబల్ ఇండియన్ షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించాలని సూచించింది. ఎంఎస్ఎంఈకి పన్ను రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ, విమానాశ్రయంలో విదేశీ పర్యాటకులకు పన్ను రిఫండ్ చేయాలని కోరింది. దీనివల్ల పర్యాటకం రంగం పురోగతితోపాటు హస్తకళలు, తివాచీలు, ఖాదీ, తోలు వస్తువుల ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ► వెట్ బ్లూ క్రస్ట్, ఫినిష్డ్ లెదర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలని సమావేశంలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) డిమాండ్ చేసింది. హ్యాండ్‌బ్యాగ్‌లు, వస్త్రాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఎగుమతిదారులు ప్రధానంగా ఇటువంటి తోలులను దిగుమతి చేసుకుంటారు. ఫినిష్డ్ లెదర్ డ్యూటీ–ఫ్రీ దిగుమతి తయారీదారుల పోటీ తత్వం మరింత మెరుగుపడ్డానికి ఈ చర్య దోహపదడుతుందని తెలిపింది. ► ముడి సిల్క్, సిల్క్ నూలు (15 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం), ముడి పత్తి (సుంకం రహితం), రాగి ఖనిజాలు వంటి అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాలను సవరించాలని ఎగుమతిదారులు సూచించారు, భారతదేశ ఎగుమతులు ప్రతికూల భూభాగంలోకి ప్రవేశించాయి. ► విస్తృత పన్ను రాయితీ ప్రయోజనాలతో డిమాండ్‌ను ప్రోత్సహించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కోరింది. ► ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎ శక్తివేల్సహా విప్రో లిమిటెడ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేఈపీసీ), తమిళనాడు, కలకత్తా, ఉత్తర అస్సోంకు చెందిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌తో సహా పలు కంపెనీలు, వాణిజ్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
పరిశ్రమ వర్గాలతో ప్రి–బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (నేడు) నుంచి పరిశ్రమవర్గాలు, రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు మొదలైనవారితో సమావేశం కానున్నారు. వినియోగానికి, వృద్ధికి ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ప్రి–బడ్జెట్ సమావేశాలు డిసెంబర్ 23 దాకా కొనసాగుతాయని, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నాడు స్టార్టప్స్, ఫిన్‌టెక్, డిజిటల్ రంగ సంస్థలు, ఆర్థిక రంగం.. క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సమావేశమవుతారు. వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, ప్రైవేట్ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు, వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. పరిశ్రమల సమాఖ్యలతో డిసెంబర్ 19న సమావేశమవుతారు. 2019–20 రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో.. రాబోయే బడ్జెట్లో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలపై మరింత దృష్టి పెట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్‌లను గణనీయంగా తగ్గించినందున.. వేతనజీవులకు సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లపరంగా ఊరటనిచ్చే చర్యలేమైనా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచే విధంగా ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. అలాగే, డిడక్షన్ పరిమితులను కూడా ప్రస్తుత రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచిన పక్షంలో.. పెట్టుబడులకు ఊతం లభించగలదని ఆశిస్తున్నాయి. -
వ్యవ'సాయం' కావాలి
పెట్టుబడులు పెంచాలి, టెక్నాలజీ మెరుగుపర్చాలి * అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి * ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీలో * వ్యవసాయ రంగ నిపుణుల విజ్ఞప్తులు న్యూఢిల్లీ: రైతులకు చేయూతనిచ్చే దిశగా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచాలని, టెక్నాలజీలను మెరుగుపర్చాలని వ్యవసాయ రంగ నిపుణులు కేంద్రాన్ని కోరారు. అలాగే, అసంపూర్ణంగా మిగిలిన సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల సమీకరణకు బాండ్లు జారీ చేయాలని, అటు మార్కెట్ సంస్కరణలపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా వ్యవసాయ రంగ నిపుణులు ఈ మేరకు సూచనలు చేశారు. రైతుల కోసం కిసాన్ టీవీ చానల్ ఏర్పాటు, పటిష్టమైన ధాన్య సమీకరణ విధానం, నదుల అనుసంధానం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయని అరుణ్ జైట్లీ వివరించారు. ఎకానమీలో సమస్యలు ఉన్నప్పటికీ.. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ రంగ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, కన్సార్షియం ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ (సిఫా) సెక్రటరీ జనరల్ చెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక విధానం ఉండాలి.. వ్యవసాయ-వాణిజ్యానికి సంబంధించి దీర్ఘకాలిక విధానం ఉండాలని, రైతులు ఈ రంగంలో కొనసాగడాన్ని ప్రోత్సహించేందుకు అధిక మద్దతు ధరలు ఇవ్వాలని చెంగల్‌రెడ్డి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో నీరు, భూసారం, జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇందుకోసం ఉపయోగించుకోవచ్చని స్వామినాథన్ సూచించారు. కార్పొరేట్లతో నేడు జైట్లీ భేటీ ప్రీ-బడ్జెట్ చర్చల్లో భాగంగా జైట్లీ నేడు (శుక్రవారం) కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ అవుతారు. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న తయారీ రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే, పెట్టుబడులను ఆకర్షించేందుకు, మెగా ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు, వృద్ధికి తోడ్పడేందుకు స్పష్టమైన, విశ్వసనీయమైన విధానాలను రూపొందించాలని కూడా కోరనున్నాయి.