వ్యవ'సాయం' కావాలి
పెట్టుబడులు పెంచాలి, టెక్నాలజీ మెరుగుపర్చాలి
* అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి
* ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీలో
* వ్యవసాయ రంగ నిపుణుల విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: రైతులకు చేయూతనిచ్చే దిశగా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచాలని, టెక్నాలజీలను మెరుగుపర్చాలని వ్యవసాయ రంగ నిపుణులు కేంద్రాన్ని కోరారు. అలాగే, అసంపూర్ణంగా మిగిలిన సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల సమీకరణకు బాండ్లు జారీ చేయాలని, అటు మార్కెట్ సంస్కరణలపై బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా వ్యవసాయ రంగ నిపుణులు ఈ మేరకు సూచనలు చేశారు.
రైతుల కోసం కిసాన్ టీవీ చానల్ ఏర్పాటు, పటిష్టమైన ధాన్య సమీకరణ విధానం, నదుల అనుసంధానం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయని అరుణ్ జైట్లీ వివరించారు. ఎకానమీలో సమస్యలు ఉన్నప్పటికీ.. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ రంగ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, కన్సార్షియం ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ (సిఫా) సెక్రటరీ జనరల్ చెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాలిక విధానం ఉండాలి..
వ్యవసాయ-వాణిజ్యానికి సంబంధించి దీర్ఘకాలిక విధానం ఉండాలని, రైతులు ఈ రంగంలో కొనసాగడాన్ని ప్రోత్సహించేందుకు అధిక మద్దతు ధరలు ఇవ్వాలని చెంగల్‌రెడ్డి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో నీరు, భూసారం, జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇందుకోసం ఉపయోగించుకోవచ్చని స్వామినాథన్ సూచించారు.
కార్పొరేట్లతో నేడు జైట్లీ భేటీ
ప్రీ-బడ్జెట్ చర్చల్లో భాగంగా జైట్లీ నేడు (శుక్రవారం) కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ అవుతారు. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న తయారీ రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే, పెట్టుబడులను ఆకర్షించేందుకు, మెగా ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు, వృద్ధికి తోడ్పడేందుకు స్పష్టమైన, విశ్వసనీయమైన విధానాలను రూపొందించాలని కూడా కోరనున్నాయి.