pre final exams
-
9 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 9 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ –2 కాంపోజిట్ పేపర్ మినహాయించి అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ –2 కాంపోజిట్ పేపర్ ఒక్కటే ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం షెడ్యూళ్లను ప్రకటించారు. అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 పరీక్షలను కూడా ఇవే తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి విద్యార్థులు సాధించిన మార్కులను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌లో నిర్ణీత గడువులోగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
ఫిబ్రవరి 11 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 19వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆర్జేడీఈలను, డీఈవోలను ఆదేశించింది. నిర్ణీత తేదీల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని పేర్కొంటూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 24, 25 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏప్రిల్ 7 నుంచి 16వ తేదీ వరకు వార్షిక పరీక్షలను (ఎస్ఏ–2) నిర్వహించాలని తెలిపింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6, 7 తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, 8వ తరగతి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, 9వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించాలని వెల్లడించింది. ఏప్రిల్ 18వ తేదీన ఫలితాలను ప్రకటించి, విద్యార్థులకు జవాబు పత్రాలను అందజేయాలని, 20వ తేదీన పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించాలని సూచించింది. -
ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు రీషెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం: ఇంటర్మీడియట్ విద్యార్థులు జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఇంటర్ ప్రీ-ఫైనల్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. జన్మభూమిని దృష్టిలో ఉంచుకుని వీరికి ముందుగా నిర్ణయించిన సంక్రాంతి సెలవులను కూడా మార్పు చేసింది. వాస్తవానికి ఇంటర్మీడియట్ బోర్డు జనవరి 7 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులను జనవరి 12 నుంచి 20 వరకు మార్పు చేసింది. ఇప్పుడు ఈనెల 19 నుంచి 25 వరకు జరగాల్సిన ప్రీ-ఫైనల్-1 పరీక్షల తేదీలను మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం వీటిని 22 నుంచి 25 వరకు, 30, 31 తేదీల్లో నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 26న గణతంత్ర దినోత్సవం, 27న ఎథిక్స్ పరీక్ష, 28న ఆదివారం, 29న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉన్నందున ఆయా రోజుల్లో ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించరాదని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్ఐవోలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
20 నుంచి ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ప్రాక్టికల్స్ , మార్చి ఒకటి నుంచి 16 వరకు థియరీ పరీక్షలు కొనసాగుతాయి. అయితే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 28న నైతిక-మానవ విలువలు, 31న పర్యావరణ విద్య పరీక్షలు ఉంటాయని వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు బుధవారం తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా గైర్హాజరై వార్షిక పరీక్షలు ఉత్తీర్ణత సాధించినా తర్వాత కోర్సులు చేయడానికి వీలుండదని స్పష్టం చేశారు. ప్రిన్సిపాళ్లందరూ ఈ విషయంలో చొరవ తీసుకుని విద్యార్థులందరూ ఈ పరీక్షలు రాసేలా చూడాలని ఆదేశించారు. లేదంటే విద్యా సంవత్సరం నష్టపోతారనే విషయాన్ని తెలపాలని సూచించారు.