సాక్షి, విశాఖపట్నం: ఇంటర్మీడియట్ విద్యార్థులు జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఇంటర్ ప్రీ-ఫైనల్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. జన్మభూమిని దృష్టిలో ఉంచుకుని వీరికి ముందుగా నిర్ణయించిన సంక్రాంతి సెలవులను కూడా మార్పు చేసింది.
వాస్తవానికి ఇంటర్మీడియట్ బోర్డు జనవరి 7 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులను జనవరి 12 నుంచి 20 వరకు మార్పు చేసింది. ఇప్పుడు ఈనెల 19 నుంచి 25 వరకు జరగాల్సిన ప్రీ-ఫైనల్-1 పరీక్షల తేదీలను మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం వీటిని 22 నుంచి 25 వరకు, 30, 31 తేదీల్లో నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
26న గణతంత్ర దినోత్సవం, 27న ఎథిక్స్ పరీక్ష, 28న ఆదివారం, 29న ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష ఉన్నందున ఆయా రోజుల్లో ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించరాదని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్‌ఐవోలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.