Prem Chand
-
కలం యోధుడు: మున్షీ ప్రేమ్‌చంద్ / 1880–1936
గ్రామీణ భారతావనిని పట్టి పీడిస్తున్న దారిద్య్రం, దళితులను దోపిడీ చేయడం, మూఢ నమ్మకాలు, ధార్మిక క్రతువులు, పితృస్వామ్యం, జమీందారీ విధానం, వలసవాదం, మతతత్వం లాంటి అంశాలను ప్రేమ్‌చంద్ నిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేశారు. మున్షీ ప్రేమ్‌చంద్‌గా అందరికీ సుపరిచితులైన ధన్పత్రాయ్ను సామ్యవాద వాస్తవిక రచయితగా పేర్కొనవచ్చు. ప్రేమ్‌చంద్‌ను తరచూ గాంధేయవాది అని పొరపడుతూ ఉంటారు. రచనా జీవితం తొలి రోజుల్లో ఆయన గాంధేయవాద పోకడలు పోయారు. ఏదో మాయ జరిగినట్లుగా దోపిడీదారులందరూ తాము చేస్తున్న నేరాలను మానేసినట్లు ఆయన రాసేవారు. కానీ తరువాతి రచనల్లో ఆయన క్రమంగా సామ్యవాద సిద్ధాంతం వైపు మారారు. మరాఠీ రచయిత టి.టికేకర్తో సంభాషణ జరిపినప్పుడు ప్రేమ్‌చంద్ ఇలా అన్నారు. ‘‘నేను ఓ కమ్యూనిస్టుని. అయితే నా కమ్యూనిజమల్లా రైతులపై దౌర్జన్యం చేసే జమీందార్లను, సేనలనూ, ఇతరులను లేకుండా చేయడం వరకే పరిమితం’’ అని. అలాగే భారత జాతీయోద్యమం పట్ల ప్రేమ్‌చంద్ వైఖరి విమర్శనాత్మకంగా సాగింది. ఆయన దానిని గుడ్డిగా పొగిడేవారు కాదు. తవన్ (1931), ఆహుతి (1930) లాంటి కథానికల్లో జాతీయవాదాన్ని ఆయన ఆకర్షణీయంగా, ప్రేరణాత్మకంగా చిత్రించారు. ఆ తరువాత రంగ్‌భూమి (1925), కర్మభూమి (1932) లాంటి నవలల్లో ఈ సైద్ధాంతిక ‘ముఖతలం వెనుక ఉన్న మలిన’ వాస్తవాన్ని ఆయన బహిర్గతం చేశారు. ప్రముఖ విమర్శకులు సుధీర్ చంద్ర ఈ విషయాలు తెలిపారు. ఆధిపత్య వర్గం నుంచి తమ వర్గ ప్రయోజనాలను ప్రచారం చేసుకోవడం కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకోవడాన్ని ప్రేమ్‌చంద్ మున్షీ విమర్శించారు. స్త్రీవాద దృక్కోణం నుంచి ప్రేమ్‌చంద్‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇక వలసవాద భారతదేశంలోని లోబరుచుకొనే శక్తులపై ఆయన కథానికలు తీవ్రంగా దాడి చేస్తే, ఆయన రాసిన ‘గోదాన్’, ‘గబన్’, ‘నిర్మల’ వంటి నవలలు కుండ బద్దలు కొట్టినట్లు ఉంటాయి. సమాజంలోని అన్యాయాలపై ఆయన సూటిగా, నిర్మొహమాటంగా తన రచనల్లో విరుచుకుపడ్డారు. ఆయన రచనల్లో కొన్ని.. ఘాటైన విమర్శలకు గురైనప్పటికీ ఆయనను అనుకరించే రచయితలు పలువురు రంగ ప్రవేశం చేశారు. ఆయన రచనలు పాఠకులకే కాక, సాటి రచయితలకు కూడా ప్రేరణగా నిలిచాయంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. – మేఘా అన్వర్, ఢిల్లీ లేడీ శ్రీరామ్ కళాశాలలో బోధకులు -
బాకీ పడ్డ కథలు
మహా కథకుడు ప్రేమ్‌చంద్ రాసిన ‘సావాసేర్ ఘెవ్’ అనే కథ ఉంటుంది. అందులో దయాళువు అయిన ఒక రైతు ఆ రాత్రి తన ఇంట బస చేసిన సాధువుకు జొన్నరొట్టెలు పెట్టలేక షావుకారు దగ్గర ‘సేరుంబావు’ గోధుములు అప్పు తెచ్చి, ఆతిథ్యం ఇచ్చి, ఆ సంగతి మర్చిపోతాడు. సేరుంబావు గోధుములు! ఏం పెద్ద భాగ్యమని. ఆ తర్వాత ఆ రైతు ఎన్నోసార్లు గోధుమ పండించి ఉంటాడు. ఎందరికో గోధుమలు దానం చేసి ఉంటాడు. కాని సేరుంబావు గోధుములు అప్పు ఇచ్చిన షావుకారు మాత్రం తన అప్పు మర్చిపోడు. చాలాఏళ్ల తర్వాత ఆ గోధుమలకు వెలగట్టి, వడ్డీ వేసి, చక్రవడ్డీ వేసి రైతు ముందు పద్దు పెడతాడు. ‘ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్టు. కాని పైలోకాల్లో ఉన్న దేవతలకు నువ్వు చేసిన బాకీ ఎగవేతకు సమాధానం చెప్పాలి’ అంటాడు. ధర్మభీతి కలిగిన రైతు పై లోకాల్లో ఉన్న దేవతల దగ్గర ముఖం చెల్లడానికి తన పొలం పుట్ర పశువు అన్నీ ఆ సేరుంబావు గోధుమల అప్పుకు దఖలు పరిచి ఆ షావుకారు పొలంలోనే కూలీగా మారతాడు. సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’లో కూడా ఒక కథ ఉంది. రంగయ్య అనే రైతు తండ్రి 200 రూపాయలు అప్పు చేసి దానిని చెల్లించే బాధ్యత కొడుక్కు అప్పజెప్పి కన్నుమూస్తాడు. కొడుకు ప్రతి సంవత్సరం పంట పండించడం, మూడొంతులు బాకీకి జమ చేయడం... ఒక వంతు తినడం. కానీ 20 ఏళ్లు ఇలా చేసినా అప్పు తీరదు. షావుకారు ఒకరోజు ఆ రంగయ్యకు మిగిలిన జత ఎద్దులను కూడా తెచ్చి పెరట్లో కట్టుకుంటాడు. రగిలిపోయిన రంగయ్య కొడవలి పట్టి షావుకారు గొంతు కోస్తానని నిలబడతాడు. అప్పుడు షావుకారు ‘ఒరే... నువ్వు నరకాలంటే నరుకు. కాని పితృరుణం చాలా పవిత్రమైనది. దానికి అపచారం చేయాలనుకుంటే నీ ఇష్టం’ అంటాడు. రంగయ్య తండ్రిని తలుచుకుని కన్నీరు మున్నీరు అవుతాడు. పరలోకంలో ఉన్న తండ్రి ఆత్మ శాంతించడానికి మూడో ఎద్దుగా చాకిరీ చేసి బాకీ చెల్లించడానికి నిష్క్రమిస్తాడు. కథగా మొదట వచ్చి తర్వాత సినిమాగా తెరకెక్కి గొప్పగా నిలిచించి ‘దో బిఘా జమీన్’. అందులో పేద రైతు బల్రాజ్ సహానీ షావుకారు దగ్గర చేసిన అప్పు 65 రూపాయలు మాత్రమే. ఫ్యాక్టరీ కట్టుకుంటాను బాకీకి బదులుగా నీ పొలం ఇవ్వు అనంటే మట్టి మీద మమకారంతో పొలం తప్ప పుడకా పుల్లా అన్నీ అమ్మి షావుకారు దగ్గరకు వెళితే బాకీని 235 రూపాయలుగా తేలుస్తాడు. బాకీనా? పొలమా? బల్రాజ్ సహానీ నగరానికి వస్తాడు. నానా బాధలు పడతాడు. చివరకు బాకీ చెల్లించలేకపోతాడు. క్లయిమాక్స్‌లో ఊరికి తిరిగి వచ్చి తన పొలంలో కడుతున్న ఫ్యాక్టరీని చూసి కనీసం గుప్పెడు మట్టిని తీసుకుందామనుకున్నా కాపలామనిషి అదిలింపుతో తీసుకోలేకపోతాడు. ఒక చక్రవర్తికి శిరస్సున ఉన్న కిరీటం సర్వశక్తిమంతమైనదిగా అనిపించవచ్చు. కాని ఈ జగాన ఎదుటివానికి అప్పిచ్చే స్థితి కలిగి ఉండటమే అసలైన, సర్వవ్యాపితమైన, ధార్మిక బలిమిగల, చట్ట సమర్థత ఉన్న, న్యాయమూర్తుల తీర్పులు పొందగల ప్రచండ శక్తి. ఎదుటివాడి దురదృష్టాన్ని పెట్టుబడిగా చేసుకునేదే అప్పు. 2500 ఏళ్ల క్రితమే మనిషి– నీకు పశువులు, విత్తనాలు, పొలము ఇస్తాను... బాగుపడి బదులుగా నాకు వాటి మీద 20 శాతం అధికమొత్తం ఇవ్వు అని చెప్పడం మొదలుపెట్టాడు. వరదలు వచ్చినా, కరువు వచ్చినా, అగ్నిప్రమాదాలు సంభవించినా, మహమ్మా రులు పెట్రేగినప్పుడు, ఇంటి పెద్ద అకాల మృత్యువు సంభవించినప్పుడు ఈ ‘అప్పు ఇచ్చువాడు’ ఎదిగి, ఎదిగి, ఎదిగి చెమట చుక్క చిందించకుండా శ్రీమంతుడవడం నేర్చాడు. చెల్లించలేనంత అప్పు ఇవ్వడం ద్వారా దేశాలను నెత్తురు చుక్క చిందించనవసరం లేని యుద్ధంతో జయిస్తున్నాడు. మోసంతో ఎగ్గొట్టే వాళ్ల సంగతి పక్కనపెడదాం. పిల్ల పెళ్లి అని, అబ్బాయి చదువు అని, భార్య అనారోగ్యమని, వ్యాపారంలో నష్టం అని, హఠాత్తుగా ఉద్యోగం పోయిందని, ఎవరో దగా చేశారని అప్పు చేసి, తప్పక తిరిగిద్దామన్న ఉద్దేశంతో ఉండి, చెల్లించలేక సతమతమయ్యవారితో, ఏది ఉన్నా లేకపోయినా ‘పరువు’ అనే బరువుతో బతుకుదామనుకునేవాళ్లతో, కొద్దిపాటి చిల్లర అప్పుకు కూడా బెంబేలెత్తిపోయేవాళ్లతో ‘తెలిసినవారు’, ‘బంధువులు’, ‘స్నేహితులు’, ‘వడ్డీ వ్యాపారులు’ అయిన అప్పిచ్చినవారి వైఖరి ఏమిటి? మీరు ఇచ్చింది అప్పే. వారు చెల్లించవలసిందీ అప్పే. జీవితం కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆ భర్త చక్కగా నవ్వుతాడు. భార్య అతని కోసం ఆదివారం చికెన్ వండుతుంది. ఇద్దరు పిల్లలు సాయంత్రం తండ్రి ఇంటికి రాగానే నాన్నా అని కావలించుకుంటారు. అందరూ కలిసి టీవీలో ఏదో సినిమా చూస్తారు. వారు ఉన్నారని వృద్ధ తల్లిదండ్రులు బతుకుతుంటారు. వారు ఉన్నారని తోబుట్టువులు బతుకుతుంటారు. వారు ఉన్నారని ఆప్తులతో కూడిన ప్రపంచమే ఉంటుంది. కాని కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేక ఆ భర్త, ఆ భార్య, ఇద్దరు చిన్నారులు చెరువులో దూకి మరణిస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రాణాలు ఎలాంటి వడ్డీతో సమానం. ఆ సమూహిక మరణంలో అసలు, వడ్డీ పోనూ ఈ అమానుష సమాజం పడిన రుణం ఎంత? హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ విషాదానికి బాధ్యులు ఎవరు? ‘క్షమ’ మనిషిని ఉన్నతీకరిస్తుంది. ఎదుటివారి తప్పులనే కాదు అప్పులను కూడా క్షమించగలిగే సందర్భాలలో క్షమించగలగడమే మనిషి గొప్పతనం. ‘ఇస్తావా? చస్తావా?’ అనకండి. చచ్చే రోజులే ఉన్నాయి ఈ దౌర్భాగ్య కాలంలో. -
కథ చెప్పిన విజేత
కథ రాయడం కంటేకూడా కథ చెప్పడంలో నైపుణ్యం వేరు! మరి కథ చెప్పుకోవడంలో.. ఆ ధైర్యమే వేరు!! ఎవరూ తమ జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలా చూపించుకోరు! కాని తన పుస్తకం ఇంకొకరికి స్ఫూర్తినిస్తుంది అని నమ్మినప్పుడు తన జీవితంలా ఇంకొకరి జీవితం కాకూడదు అని నిశ్చయించుకున్నప్పుడు.. పుస్తకం తెరిచి.. మనసు విప్పి.. తన కథ తానే చెప్పుకోవడంలో గొప్పతనం ఉంది!! ‘‘ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ’’ పుస్తకాన్ని బేబీ హల్దార్ చేతిలో పెట్టి.. ‘‘ఆటోగ్రాఫ్’’ ప్లీజ్ అన్నాడు ప్రొఫెసర్ ప్రబో«ద్ కుమార్. సిగ్గుపడుతూ.. ఆ పుస్తకం మొదటి పేజీలో సంతకం చేసిచ్చింది బేబీ హల్దార్. ఆమె ఆ ప్రొఫెసర్ ఇంట్లో పనిమనిషి. ఆ ప్రొఫెసర్.. మున్షీ ప్రేమ్‌చంద్ మనవడు! తన సంరక్షకురాలిగా వచ్చిన బేబీ హల్దార్ .. ఈ రోజు రచయిత కావడానికి ప్రోత్సాహం అందించిన మనిషి! ఆ కథే.. బేబీ హల్డార్ బయోగ్రఫీ..ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ!! కశ్మీర్ నుంచి దుర్గాపూర్ వయా ముర్షిదాబాద్ బేబీ పుట్టింది కశ్మీర్లో. గుండ్రటి మొహం, సొట్ట బుగ్గలతో పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న ఆ పాపాయిని చూసుకుని ‘‘చందమామా’’ అంటూ మురిసిపోయింది బేబీ తల్లి. సారా కంపు గప్పున కొట్టడంతో ఆసంబరం క్షణంలో విషాదం అయింది. ఆ తాగుబోతు బేబీ తండ్రి. ఆయనొక ఎక్స్ సర్వీస్మన్. ఆర్మీలోంచి బయటకు వచ్చాక డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. అప్పుడే తాగుడికి బానిసయ్యాడు. పని చేసి డబ్బులు తేవడం కంటే తాగొచ్చి భార్యను కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. పెళ్లయి, బిడ్డ పుట్టిన నాలుగేళ్ల వరకూ ఆ తల్లి భరించింది భర్తను. ఆపై వల్లకాక ఆ చంటిపిల్లను తండ్రి దగ్గరే ముర్షిదాబాద్‌లో వదిలేసి ఆమె వెళ్లిపోయింది. అతను ఊరుకోలేదు. పిల్లను సాకాలనే వంకతో రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త తాగుడుకు ఆమె విసిగిపోయి కోపమంతా బేబీ మీద తీసేది. అలా సవతి తల్లి చెడ్డది అన్న పేరును ఆమే మోసింది. చిన్నప్పటి నుంచి బేబీకి చదువంటే ఇష్టం. కాని ఆరు వరకే చదివించి మానిపించారు పెద్దవాళ్లు. ఇంటి పనుల్లో సవతి తల్లికి సాయపడుతూ.. సమయం దొరికినప్పుడు స్నేహితులతో ఆడుకుంటూ కాలంగడిపింది బేబీ. చదువు తర్వాత బేబేకి ఇష్టమైన వ్యాపకం.. ఆటలు! లేడిలా పరిగెత్తుతుంది. జంపింగ్‌లోనూ అదే మెరుపు వేగం చూపిస్తుంది. ఆ నైపుణ్యాన్ని ఎవరూ కనిపెట్టలేదు కాని పన్నెండేళ్లకు ఈడొచ్చిందని పెళ్లి చేసి అత్తారిల్లయిన దుర్గాపూర్ పంపారు. కల కోసం... అత్తారింట్లో పని పెద్ద భారమనిపించలేదు బేబీకి. కాపురమే కష్టం అనిపించింది. చాలా సార్లు చదువు.. ఆటలు గుర్తొకొచ్చి ఏడిచేది. యేడిదికల్లా కొత్త బాధ్యత పుట్టింది ఆమెకు బిడ్డ రూపంలో. ఆ తర్వాత మూడేళ్లలో మరో ఇద్దరు బిడ్డలతో పదహారేళ్లకే ముగ్గురు పిల్లల తల్లి అయింది. తన తల్లికి ఎదురైన హింసే బేబీకీ ఎదురైంది భర్త దగ్గర్నుంచి. తాగొచ్చి కొట్టేవాడు. అతని సంపాదన అతనికే సరిపోయేది కాదు. దాంతో బేబీ ఇళ్లల్లో పనిచేసి ఆర్థికభారాన్నీ మోసింది. ఆమెకు ఒకటే కల.. తన పిల్లలు చదువుకోవాలని. రోజురోజుకి పెరుగుతున్న భర్త హింస.. తమను బతకనివ్వదని తెలిసి ఒక రోజు ఢిల్లీ రైలెక్కింది పిల్లలను (సుబోద్, తపస్, ప్రియ)తీసుకొని. అప్పటికి ఆమె వయసు పాతికేళ్లు! పనిమనిషి.. ఢిల్లీలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్లల్లో పని వెదుక్కుంది. ఇంటి యజమానుల ఆగడాలను భరించింది. ఆ తర్వాత గుర్గావ్లోని ఓ ఇంట్లో రోజంతా ఉండిపోయే పనిమనిషి కావాలని పొరుగింటామె చెప్పింది బేబీకి. ఒక్క ఇల్లే చూసుకుంటే తన ఇల్లు గడుస్తుందా? సందేహాన్నే బయటపెట్టింది బేబీ. ‘‘ఉన్నవాళ్లే. జీతం బాగానే ఉంటుంది. అవుట్‌హౌజ్‌లో ఉండొచ్చట’’ చెప్పింది పక్కింటామె. మరో ఆలోచన చేయకుండా గుర్గావ్ వెళ్లింది బేబీ. ఆ ప్రొఫెసరే ప్రబో«ద్ కుమార్. ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది అక్కడే. దిద్దుకున్న బాట.. ఎప్పటిలాగే ఆ రోజూ పుస్తకాల అల్మారాలు దులిపే పనిపెట్టుకుంది బేబీ. ఆ పని అంటే ఆమెకు చాలా ఇష్టం. దులిపే పేరుతో నచ్చిన పుస్తకాలను వచ్చీరాని చదువుతో అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ప్రొఫెసర్ ఇంటికి వచ్చాక ఆమె సంతోషంగా ఉండడానికి కారణం.. ఆ పుస్తకాలే! స్టూల్ ఎక్కి కిందటి వారం చదవాలనుకున్న పుస్తకం తీసి పేజీలు తిప్పు తోంది.. ఓ చేతిలో దుమ్ముతుడిచే గుడ్డను పట్టుకొని. ఏదో పనిమీద అటుగా వెళ్తున్న ప్రొఫెసర్ కంట్లో పడిందా దృశ్యం. ఆశ్చర్యపోయాడు. ‘‘బేబీ.. నీకు చదువొచ్చా?’’ అడిగాడు అదే ఆశ్చర్యంతో. ఆ మాట వినపడనంత ఏకాగ్రత ఆమెకు ఆ పుస్తకంలో. దగ్గరకు వచ్చి స్టూల్‌ను కదిపాడు ప్రొఫెసర్. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిపడింది బేబీ. ‘‘మాస్టారూ’’ అంటూ కంగారు, భయం కలగలిసిన భావంతో పుస్తకం అల్మారాలో పెట్టేసి చటుక్కున స్టూల్ దిగింది. ఆప్యాయంగా తల మీద చేయి వేసి.. ‘‘నీకు చదువొచ్చా...’’ అని అడిగాడు. ‘‘ఆరు వరకే చదివాను మాస్టారూ.. కాని ఇష్టం’’ చెప్పింది బేబీ. ఓ పెన్ను, నోట్ బుక్ ఇచ్చి ఆమె జీవిత కథను రాయమని చెప్పాడు ప్రబో«ద్ కుమార్. 20 ఏళ్ల తర్వాత పెన్ను, బుక్ పట్టుకున్న ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. ధైర్యం చెప్పాడు ప్రొఫెసర్. తొలుత చాలా తప్పులు రాసింది. తన పేరు స్పెల్లింగ్‌తో సహా! సరిదిద్దాడు ప్రబో«ద్. నోట్‌బుక్ మార్జిన్ నుంచి ప్రారంభమైన ఆమె రాతను కరెక్ట్ చేశాడు ఆయన. అలా ఆమె రాసినదాన్ని రోజూ చూసేవాడు, పొరపాట్లు దిద్దేవాడు. అంతేకాదు బెంగాలీ(ఆమె బెంగాలీ), ఇంగ్లిష్ పుస్తకాలను ఇచ్చేవాడు చదవమని. ఫలితంగా.. వచ్చిందే ‘‘ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ’’! బేబీని ప్రొఫెసర్ రాయమని చెప్పిన ఆమె జీవితకథ! మార్కెట్లో సంచలనం సృష్టించింది. ‘‘ఇది బేబీ జీవితమే కాదు.. మన దేశంలోని చాలామంది ఒంటరి స్త్రీల, ఒంటరి తల్లుల కథ.. ఎందరో పనిమనుషుల వ్యథ.. మన సమాజంలో స్త్రీల మీద సాగుతున్న జులూమ్కు అద్దంపట్టిన రచన’’ అంటూ బేబీ రాసిన పుస్తకం మీద సమీక్షలు వచ్చాయి. ‘‘ఒంటరి ప్రయాణం చాలా కష్టం. ముఖ్యంగా నాలాంటి మహిళలకు. ఊరొదిలి వెళ్లిపోతున్నప్పుడు చాలామంది చాలా మాటలన్నారు నన్ను. అవేవీ వినిపించుకోలేదు. నా పిల్లలకు చదువు చెప్పించాలి, వాళ్లకు మంచి భవిష్యత్తునివ్వాలనే ఆశ తప్ప నాకింకే ఆలోచనా లేకుండింది. నా పుస్తకం చదివిన ఒకావిడ.. ‘‘నా కథ కూడా నీలాంటి కథే ’’ అని ఫోన్ చేసి చెప్పినప్పుడు ముందు ఏడుపొచ్చింది. తర్వాత సంతోషమనిపించింది. మన దేశంలో నాలా ఇల్లు వదిలివెళ్లిన ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. కాని వాళ్లందరికీ నాకు దొరికిన సపోర్ట్ దొరక్కపోయుండొచ్చు. నాలా మాట్లాడలేకపోవచ్చు. అలాంటి వాళ్లందరికీ నేను, నా పుస్తకం స్ఫూర్తినివ్వగలిగితే.. వాళ్లలో కొంతైనా ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగితే నా జన్మ ధన్యమైనట్టే!’’ అంటుంది 44 ఏళ్ల బేబీ హల్దార్. ఆమె ప్రయాణం ఆగలేదు. రెండో పుస్తకం మొదలుపెట్టింది. రాయడాన్ని కొనసాగించాలని కోరుకుంటోంది. ‘‘ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ’ని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ ప్రకాష్ ఝా సినిమా తీయనున్నట్టు, ఈ పుస్తకాన్ని ఒరియా, తమిళ్, తెలుగులో అనువదించనున్నట్టూ వార్తలు వినిపిస్తున్నాయి. తాత.. మనవడు మున్షీ ప్రేమ్‌చంద్.. ఆధునిక హిందీ, ఉర్దూ సాహిత్య కృషీవలుడు. సేవాసదన్, వర్దాన్, రంగ్‌భూమి, నిర్మల, ప్రేమాశ్రం, గబన్, కర్మభూమి ఆయన రచనల్లో కొన్ని మాత్రమే. మున్షీ అనేది సాహిత్యప్రియులు ఆయనకు గౌరవంగా ఇచ్చిన బిరుదు! మున్షీ ప్రేమ్‌చంద్ సాహిత్యం ద్వారా సమాజానికి సేవ చేస్తే ఆయన మనవడు ప్రొఫెసర్ ప్రబో«ద్‌కుమార్ తనింట్లో పనిమనిషిని రచయిత్రిగా నిలిపి తాత స్ఫూర్తిని చాటాడు. – శరాది -
65 కేజీల గంజాయి స్వాధీనం - నలుగురి అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా వైరావరం సమీపంలో సోమవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 65 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మోటార్‌బైక్‌పై వెళుతున్న వ్యక్తులను ఆపి.. సోదాలు నిర్వహించగా.. వారి వద్ద గంజాయి దొరికింది. దొరికిన గంజాయి విలువ రూ.2.60లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారు.. నిజామాబాద్‌కు చెందిన రాజ్‌పుత్‌సింగ్, గోపవరం కొత్తపల్లెకు చెందిన శివరామకృష్ణ, వైరావరం పాత కాలనీకి చెందిన ప్రేమ్‌చంద్, విశాఖ జిల్లా మాధవరంపాడు గ్రామానికి చెందిన రాజు లుగా పోలీసులు గుర్తించారు.