అవినీతి పార్టీలను వెళ్లగొట్టండి
హొసూరు: తమిళనాడులో 50 ఏళ్లుగా పరిపాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అవినీతి లంచగొండితనానికి పాల్పడిన పార్టీలని, ఈ పార్టీలను ప్రస్తుతం జరి గే ఎన్నికల్లో తమిళనాడు నుండి వెళ్లగొట్టాలని డీఎండికే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రేమలత విజయ్‌కాంత్ అన్నారు. బుధవారం సాయంత్రం హోసూరు గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తమిళనాడు శాసన సభ సాదారణ ఎన్నికలలో ప్రజా సంక్షేమ కూటమిదే హవా ఉందని తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం, ఇళ్లకే రేషన్ సరుకులు అందజేస్తామని, బాలికల ఉన్నతోన్నత పాఠశాలల్లో రాత్రి వేళల్లో కళాశాలలను ఏర్పాటు చేస్తామని ప్రేమలత విజయ్‌కాంత్ తెలిపారు. డీఎండీకే అధికారానికొస్తే పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం ఉచిత టిఫిన్ అందజేస్తామని ఆమె తెలిపారు.
హోసూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, ట్రేడ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, లేబర్ కోర్టు, లేబర్ ఆఫీసులను ఏర్పాటు చేస్తామని ప్రేమలత విజయ్‌కాంత్ తెలిపారు. హోసూరులో తాగు నీటి సమస్య నివారణకు చర్యలు గైకొంటామని, కెలవరపల్లి రిజర్వార్ నుండి హోసూరు రామనాయకుని చెరువుకు నీరు అందజేస్తామని తెలిపారు. తమిళనాడులో 34 ప్రభుత్వ శాఖల్లో అవినీతి, లంచగొండి తనాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక డెరైక్టరెట్ను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.
డీఎండీకే ఎమ్మేల్యేలు 24 గంటలు ఎమ్మేల్యే కార్యాలయంలోనే ఉంటూ ప్రజలకు సేవలందిస్తారని ప్రేమలత తెలిపారు. హోసూరు ఎమ్మేల్యే 15 ఏళ్లుగా శాసన సభ్యుని కార్యాలయాన్ని తెరువ లేదని ఆరోపించారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు గైకొంటామని, వేపనహళ్ళి, హోసూరు నియోజక వర్గాలలో డీఎండీకే అభ్యర్థులను గెలిపించి, మార్పును, అభివృద్దిని కాంక్షించాలని తమిళనాడు ప్రజలను కోరారు.