Premanjali
-
కథ బాగుంటే విజయమే
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త జనరేషన్ అవసరం. పూరి జగన్నాథ్, గుణశేఖర్‌లాంటి వాళ్లు విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చినవారే. ‘ప్రేమాంజలి’ చిత్రదర్శకుడు వరుణ్‌ది కూడా నర్సీపట్నం కావడం విశేషం. టీజర్ చూస్తే మెసేజ్ ఉన్న సినిమాలా ఉంది. హిట్ అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సుజయ్, శ్వేతానీల్ జంటగా వరుణ్ దొర దర్శకత్వంలో మహాలక్ష్మి సమర్పణలో ఆర్.వి. నారాయణ రావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమాంజలి’. గోవర్ధన్ సంగీతం అందించారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ బిగ్ సీడీ, దర్శకుడు సాగర్ పాటల సీడీ, తమ్మారెడ్డి టీజర్ రిలీజ్ చేశారు. ‘‘చిన్న సినిమాలు రావడం వల్లే ఇండస్ట్రీలో కొత్త కథలు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్. ‘‘ఎటువంటి అవగాహన లేని చిన్న పిల్లలు ప్రేమలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పేపర్స్‌లో, టీవీల్లో వచ్చే వార్తలు నన్ను ప్రభావితం చేశాయి. అలాంటివాళ్లకు మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా తీశా’’ అన్నారు వరుణ్ దొర. సహ నిర్మాత కె.వి. ప్రసాద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజ్ నజీర్. -
ప్రేమ బాధ్యత
‘ప్రేమంటే ఓ బంధం కాదు.. ప్రేమ అనేది ఒక బాధ్యత’ అని చాటిచెప్పేలా నిర్మించిన చిత్రం ‘ప్రేమాంజలి’. ‘ఓ ప్రేమజంట కథ’ అనేది ఉపశీర్షిక. సుజయ్, శ్వేతానీల్, వినయ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఆర్.వరుణ్ దొరను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ వినాయక క్రియేషన్స్ పతాకంపై ఆర్వీ నారాయణరావు, ఆర్బీ ఆర్య నిర్మించిన ‘ప్రేమాంజలి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ‘‘ప్రేమంటే ఫ్యాషన్‌గా మారిపోతున్న ఈ రోజుల్లో ప్రేమకు గౌరవం కల్పిస్తూ ఈ చిత్రం తెరకెక్కించాం. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పీజీ వర్ధన్, కెమేరా: భాస్కర్ దొర్నాల. -
ప్రేమంటే ఓ బాధ్యత!
లవ్ అంటే ఓ ఫ్యాషన్‌గా మారిపోయిన ఈ రోజుల్లో ప్రేమంటే బంధం మాత్రమే కాదు ఓ బాధ్యత కూడా అనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమాంజలి’. సుజయ్, శ్వేతానీల్ జంటగా ఆర్. వరణ్ దొర దర్శకత్వంలో ఆర్.వి. నారాయణరావు, ఆర్.బి. ఆర్య నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: పీజీ వర్ధన్, ఛాయాగ్రహణం: భాస్కర్ డోర్నాల.