ఒక తరాన్ని ప్రేమలో ముంచెత్తిన ప్రేమసాగరం
ప్రేమలో నుంచి పుట్టిన ప్రేమ ఏమవుతుందో తెలియదు.కాని ద్వేషం నుంచి పుట్టిన ప్రేమ మాత్రం కడవరకు నిలుస్తుంది.ఇంటర్ అయిపోయింది.ఇక కాలేజ్‌లో చేరాలి.కాలేజీ అంటే? మూడు విషయాలు. ఒకటి: ఆడపిల్లలు రెండు: ఆడపిల్లలు. మూడు: ఆడపిల్లలు.ఏ రోజులు అవి?అబ్బాయి తరఫువాళ్లు అమ్మాయిని చూసొచ్చి ‘అమ్మాయి నచ్చిందిరా. చేసుకో’ అని అబ్బాయికి చెప్తే అబ్బాయి నోరు మూసుకొని తాను చూడకపోయినా తాళి కట్టేసే రోజులు. ‘అబ్బాయిని నువ్వు చూడాలా... మేం చూశాం.. బంగారంలాంటి పిల్లాడు... చేసుకో’ అనంటే అమ్మాయి తల వొంచుకుని తాళి కట్టించుకునే రోజులు.ఆ రోజుల్లో పెళ్లిచూపులు జరిగి ఒకరినొకరు చూసుకుని పెళ్లి చేసుకోవడమే పెద్ద వరం.అలాంటిది పెళ్లికి ముందే ఒకరినొకరు చూసుకుని, ఇష్టపడి, ప్రేమించుకుని, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ, ప్రేమలేఖలు రాసుకుంటూ, రాత్రిళ్లు నిద్రపట్టక దిండు అంతు చూస్తూ, పగలు ఎప్పుడవుతుందా అని పరిగెత్తి వెళ్లి చూసుకుంటూ... ఇలాంటి ఒక జీవితాన్ని అనుభవించి అలాంటి అనుభవానికి కారణమైన అబ్బాయినో/అమ్మాయినో జీవితాంతం సొంతం చేసుకోవడంలో ఉండే మత్తు మహత్తు కోసం ఒక తరం సిద్ధమవుతున్న కాలం అది.యువతరం అంతా సంప్రదాయం సంకెళ్లు విదుల్చుకుని ప్రేమ కోసం చేతులు చాచుతున్న కాలం.
1978లో ‘మరో చరిత్ర’ వచ్చింది. బాలచందర్ తీశాడు.
1981 ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. దాసరి తీశాడు.
1981 ‘సీతాకోక చిలుక’ వచ్చింది. భారతీరాజా తీశాడు.
1981 ‘ముద్దమందారం’ వచ్చింది. జంధ్యాల తీశాడు.
ప్రేక్షకులు ప్రేమకథలకు సిద్ధమయ్యారు. కాని వీళ్లందరూ మిస్సయ్యింది టి.రాజేందర్ పట్టుకున్నాడు. కాలేజీ. కాలేజీ లైఫ్ చూపించాలి. కాలేజీ అల్లరి. కాలేజీ ప్రేమ. కాలేజీ గంతులు.. పాటలు. నిజంగా కాలేజీ వయసు కుర్రాళ్లతో కాలేజీ ప్రేమ తీయాలని నిశ్చయించుకున్నాడు.హీరోగా గంగ. హీరోయిన్గా నళిని.యవ్వనం.. ఉత్సాహం.. సంగీతం.. కవిత్వం.అందుకే సినిమా అంతా ఒక పాటలా ఉండాలని అనుకున్నాడు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒక పాట.పాట పండింది. ‘ప్రేమ సాగరం’ కలెక్షన్లతో పొంగింది.‘నామం పెట్టు నామం పెట్టు కాలేజీకిచిన్నదాని చెయ్యేపట్టు మేరేజీకి’....సినిమా మొదలైన మొదటి రెండు నిమిషాల్లోనే పాట. ఉత్సాహకరమైన క్లాస్‌రూములు. కలర్‌ఫుల్ క్యాంపస్ పరిసరాలు. ఇటు అమ్మాయి అటు అమ్మాయి ఎటు చూసినా అమ్మాయిలే.ఆ ఊరి కాలేజీలో చదువుదామని నళిని వస్తుంది. ఆ ఊరి అబ్బాయే గంగ. ఆ అమ్మాయిని చూస్తాడు. ఇద్దరివీ ఎదురూబొదురూ ఇళ్లు.నళినికి ప్రేమ పట్ల సదభిప్రాయం లేదు. అలాంటి ఆలోచన లేదు. పైగా ఈ చిల్లర మల్లర ఊరి కుర్రాళ్లంటే లెక్క లేదు. కాని గంగకు నళినిని చూడటంతోటే ప్రేమైంది. వెంట పడ్డాడు. అతడి వ్యవహారం చూసి నళిని చిరాకు పడింది. అసహ్యించుకుంది. ద్వేషించింది. బుద్ధి చెప్పాలనుకుంది.అతడు రాసినట్టుగా లవ్ లెటర్ సృష్టించి ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ చేసింది.దానికి ప్రతీకారంగా కాలేజీ నాటకంలో అతడు స్టేజీ మీద అందరూ చూస్తుండగా ఆమెను ముద్దాడాడు.నళిని అన్న రాధా రవి అసలే రౌడీ. ఈ సంగతి తెలిసి ఊరుకుంటాడా? గంగను పట్టుకుని చావ బాదాడు. ఒళ్లు చీరేశాడు. కాని గంగ మారలేదు.‘హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా’ అని పాడాడు.
ప్రేమకు తొలిమెట్టు ద్వేషం అయితే మలిమెట్టు సానుభూతి. నళినికి మెల్లగా సానుభూతి మొదలైంది. తన పేరును పచ్చబొట్టు వేసుకొని గంగ జ్వరం తెచ్చుకుంటే సానుభూతి కాస్తా ఇష్టంగా మారింది.‘నువ్వుకాదంటే చచ్చిపోతాను’ అనంటే ఆ ఇష్టం కాస్త జీవితానికి సరిపడా ప్రేమగా మారింది.ఈ కాలంలోనే ప్రేమకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయే... ఆ కాలంలో లేకుండా పోతాయా?నళిని అన్న ఈ ప్రేమకు అడ్డు నిలుస్తాడు. అంతస్తు హోదా అని మాట్లాడతాడు. కాని ఆ ఇంట్లోనే పెద్దక్క సరిత ఉంటుంది. భర్త వదిలేసిన సరిత. ‘అంతస్తు హోదా కులం జాతి అని అన్నీ చూసి పెళ్లి చేశావు. కాని ఏమైంది? నాభర్త నన్ను వదిలేశాడు. ప్రేమించినవాడికి ఇచ్చి చేస్తే అదైనా సంతోషంగా ఉంటుంది’ అని తమ్ముడికి చెప్తుంది.కాని వినడు.స్వచ్ఛమైన ప్రేమను కాపాడటానికి ప్రకృతి ఏదో ఒక రక్షక వ్యవస్థను సిద్ధం చేసే ఉంటుంది.ఈ సినిమాలో కూడా టి.రాజేందర్ ‘చైన్ జైపాల్’గా ఒక రక్షకుడిలా వస్తాడు.నళిని అన్నను తన ప్రాణత్యాగంతో తుదముట్టిస్తాడు.ప్రేమ జంట ఒకటవుతుంది.ఏ అడ్డంకులు లేని ప్రేమ ఏమవుతుందో తెలియదు.కాని ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ప్రేమ బలపడి, గట్టిపడి కడవరకూ నిలుస్తుంది.అమ్మాయికి అబ్బాయి కావాలి. అబ్బాయికి అమ్మాయి కావాలి.తొలి ప్రేమలో గాఢమైన తొలి కౌగిలింతకు మించిన పెన్నిధి వారికి లేదు. ప్రేక్షకులకు కూడా అలాంటి కౌగిలింత ఇచ్చిన సినిమా– ఈ సినిమా– ప్రేమ సాగరం.
ఉయిరుళ్లవరై ఉష (ఉషతో కడదాక)
టి. రాజేందర్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ‘ఉయిరుళ్లవరై ఉష’ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినట్టుగానే తెలుగులో ‘ప్రేమసాగరం’గా అంతే పెద్ద హిట్టయ్యింది. ఈ సినిమా పోస్టర్లు, పాటలు దుమ్ము దులిపేశాయి. ఇంత పెద్ద ప్రేమదుమారం ఇంతకు ముందు తెలుగు ప్రాంతం చూడలేదు. ‘చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి’, ‘అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేను’, ‘బంతాడే బంగారు బొమ్మల్లారా’... ప్రతి పాటా హిట్. అంతవరకూ తెలుగు ప్రేక్షకులు ‘కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం– దాసరి’ అనే టైటిల్ చూశారు. కాని టి.రాజేందర్ విషయంలో ‘సంగీతం’ అదనంగా చేరడం వింతగా చూశారు. మ్యూజిక్ చేసే హీరో అప్పట్లో వింత. రాజేందర్ ఈ సినిమాలో తల నిండా జుట్టు వేసుకుని ‘ప్రేమ రక్షకుడి’గా నిలవడాన్ని ఆ తర్వాత చాలా సినిమాల్లో అలాంటి రక్షకుని పాత్రలు సృష్టించి కాపీ చేశారు. ‘నళని’ ఈ తొలి సినిమాతో స్టార్ అయ్యింది. ‘అమల’, ‘జీవిత’లను కూడా టి.రాజేందరే వెండితెరకు పరిచయం చేశాడు. ప్రేమ కథలో యాక్షన్‌ను మిళితం చేయడం, వాన పాట, షవర్ పాట... ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి కావలసిన సరంజామాను ఇస్తాయి. తన్నులు తిన్న హీరోని ‘నా దగ్గర ఉన్న మందు ఇదే’ అని హీరోయిన్ ఒళ్లంతా ముద్దులు పెట్టడాన్ని ఆ రోజుల్లో ఏ కుర్రవాడు ఆశించడూ? ఇవన్నీ సినిమాని పెద్ద హిట్ చేశాయి. టి.రాజేందర్ కొడుకు సింబూ పెద్ద స్టార్ అన్న సంగతి అందరికీ తెలుసు. రాజేందర్ భార్య ‘ఉష’ తెలుగుమ్మాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా తనే. కనుక ఇది తెలుగువారి ప్రమేయం ఉన్న సినిమాగా కూడా గుర్తు పెట్టుకోవాలి.
– కె