సాఫ్ట్‌వేర్ లవ్
వారానికి రెండు సెలవులు. ఐదంకెల జీతం. హైఫై జీవితం. అప్పుడప్పుడు ఫారిన్ టూర్స్. ఇలా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రేమలో పడతారు. తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. అసలు ఆ ప్రేమికులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? వారి ప్రేమ విజయం సాధించిందా లేదా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా ‘సరసుడు’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు పాండిరాజ్.
శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై శింబు హీరోగా ఆయన తండ్రి, ‘ప్రేమసాగరం’ ఫేమ్ టి.రాజేందర్ నిర్మించారు. నయనతార, ఆండ్రియా, అదాశర్మ కథానాయికలు. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత టి. రాజేందర్ మాట్లాడుతూ– ‘‘మా శింబు సినీ అర్ట్స్ బ్యానర్‌లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఇది. ఐటీ బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథ. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్.
మా చిన్న కొడుకు కుళల్ అసరన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఫ్రెండ్‌గా ‘సత్యం’ రాజేష్ బాగా నటించారు. వచ్చే నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. దర్శకుడు పాండిరాజ్ అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకట్ కొమ్మినేని, కెమెరా: సతీష్.