ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
రెండో రోజుకు చేరిన ప్రీమియర్ కబడ్డీ పోటీలు
కలవరపడిన చీతాస్..సమన్వయంతో గెలిచిన స్టాలియన్స్
దూకుడుతో ‘బుల్స్’ విజయం.. గ్లాడియేటర్స్ గందరగోళం
వరంగల్ స్పోర్ట్స్ : గ్రామీణ క్రీడ కబడ్డీకి ఆదరణ కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రీమియర్ కబడ్డీ మ్యాచ్‌లకు జిల్లాలో ప్రజలు, క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అభిమానుల కేరింతలతో క్రీడాకారులు రెట్టింపు ఉత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నారు. స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు ఆదివారం రెండో రోజు ఉల్లాసంగా జరిగాయి. క్రీడాకారులు పోటాపోటీగా తలప డి పాయింట్లు సాధించారు. కార్యక్రమంలో చింతల స్పోర్ట్స్ ఎండీ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు సారంగపాణి, కార్యదర్శి ఎండీ అజీజ్‌ఖాన్, వరంగల్ రూరల్ డీవైఎస్ఓ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా ఖమ్మం చీతాస్– సిద్దిపేట స్టాలియన్స్..
రెండో రోజు మొదటగా ఖమ్మం చీతాస్ వర్సెస్ సిద్దిపేట స్టాలియన్స్ జట్లు తలపడ్డాయి. తొలుత రైడింగ్ వెళ్లిన ఖమ్మం క్రీడాకారులు మొదటి పది నిమిషాలు చాకచక్యంగా ఆడి లీడింగ్ పాయింట్లతో సిద్దిపేట స్టాలియన్స్‌కు చెమటలు పట్టించారు. అయితే చీతాస్‌లో లీడర్షిప్ లోపించడంతో ప్రత్యర్థులకు పాయింట్లు సునాయసంగా ప్రారం భించారు. ఈ మేరకు సిద్దిపేట స్టాలియన్స్ రెట్టింపు ఉత్సాహంతో హాఫ్ టైం అయ్యే సరికి 16 పాయింట్లు సాధిం చగా.. చీతాస్ 9 పాయింట్ల వద్ద డీలాపడింది. తిరిగి ఆట మొదలయ్యాక అదే ఉత్సాహంతో సిద్దిపేట స్టాలియన్స్ 33–21తో ఖమ్మం చీతాస్పై 12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, సిద్దిపేట స్టాలియన్స్ జట్టులో క్రీడాకారుడు చోగల్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో రెఫరీలు గ్రీన్‌కార్డుతో హెచ్చరించారు. దీంతో ఆయన వెనక్కి తగ్గాడు. అనంతరం బెస్ట్ రైడర్‌గా పవన్, బెస్ట్ డిఫెండర్‌గా సుప్రియోకు చింతల స్పోర్ట్స్ చెరో రూ. 5వేల నగదు అందజేసింది.
హైదరాబాద్ బుల్స్ దూకుడు..
రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ బుల్స్ వర్సెస్ గద్వాల గ్లాడియేటర్స్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు టీంలకు చెందిన క్రీడాకారులు మొదటి నుంచి నువ్వా.. నేనా అన్నట్లు దూకుడు ప్రదర్శించినప్పటికీ బుల్స్ ముందు గ్లాడియేటర్స్ చతికలబడక తప్పలేదు. హాఫ్‌టైం అయ్యేసరికి ఒక్క పాయింట్ తేడాతో హైదరాబాద్– గద్వాల జట్ల మధ్య 13–12 పాయింట్లు ఉన్నప్పటికీ తిరిగి ఆట మొదలయ్యాక బుల్స్ సమన్వయం దూకుడు ప్రదర్శించి గ్లాడియేటర్స్‌కు అందనంత దూరంగా 40–22 పాయింట్ల సాధించి గ్లాడియేటర్స్‌పై 20 పాయింట్ల అత్యధిక స్కోరుతో విజయం సాధించింది. ఇందులో బెస్ట్ రైడర్‌గా విష్ణుకు చింతల స్పోర్ట్స్ నుంచి రూ. 5వేలు, బెస్ట్ డిఫెండర్ గా అనుజ్ రూ. 5వేల నగదు అందజేశారు.