premprasad
-
నకిలీ మద్యం విక్రయిస్తే లెసైన్స్ రద్దు
మహానంది, న్యూస్‌లైన్: మద్యం దుకాణాల్లో నకిలీలు విక్రయిస్తే లెసైన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ హెచ్చరించారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు శనివారం ఆయన మహానంది వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 84 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లను నియమించారని, వారు శిక్షణలో ఉన్నారన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన ఆరు ఔట్లెట్లను బుక్కాపురంలో 1, కోవెలకుంట్లలో 2, ఆత్మకూరులో 1, సున్నిపెంటలో 2 ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమ నిల్వలపై దాడులు విస్తృతం చేశామన్నారు. ఇటీవల బేతంచర్ల, మహానంది మండలాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పత్తికొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్ఐల మధ్య జరిగిన గొడవలో బాధ్యులపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నంద్యాల ఎక్సైజ్ సీఐ కేశవులు ఉన్నారు. -
నాటుసారాను పూర్తిగా నిర్మూలించాం
ఆలూరు రూరల్, న్యూస్‌లైన్ : దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుర్జిత్‌సింగ్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి వారు దేవరగట్టులో విలేకరులతో మాట్లాడారు. బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్, ఏఆర్ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. అలాగే బన్ని ఉత్సవంలో పాల్గొనే నెరణికి, నెరణికితండా, కొత్తపేటతో పాటు మరో పది గ్రామాల కొండల్లో ఉన్న నాటుసారా తయారీ స్థావరాలపై దాదాపు 25 రోజులుగా సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. ఆ దాడుల్లో దాదాపు 36 వేల లీటర్ల ఊట, 1000 లీటర్లకు పైగా నాటుసారా బిందెలను ధ్వంసం చేశారన్నారు. బన్ని ఉత్సవమే గాకుండా ఆలూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నాటుసారా అమ్మకాలను, తయారీని అరికట్టేందుకు మున్ముందు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.