ఆ నగరం రెండు రోజుల్లో ఖాళీ..!
నగరం అంటే.. వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు, పదుల సంఖ్యలో పాఠశాలలు, రవాణా సదుపాయాలు, కళాశాలలు, క్రీడా స్థలాలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్, వినోద పార్కులు.. ఇలా సదుపాయాలన్నీ ఉండితీరాల్సిందే. ఇవి మాత్రమే ఉంటే సరిపోతుందా..! వీటన్నిటినీ మించి వేల సంఖ్యలో ప్రజలు ఉండాలి. అయితే, ఉక్రెయిన్‌లోని ప్రిప్యత్ నగరంలో ఒక్క మనిషి కూడా కనిపించడు. మరి, సదుపాయాల మాటేమిటి అనేగా మీ సందేహం..? అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంతకీ ప్రిప్యత్ కథేంటి..?!
1970, ఫిబ్రవరి 4న ఉక్రెయిన్‌లోని ‘చెర్నోబైల్ అణు విద్యుత్ కేంద్రం’ సమీపంలో ప్రిప్యత్ నగరాన్ని ప్రారంభించారు. చెర్నోబైల్లో పనిచేసే కార్మికులు, పరిశోధకులు, ఇతర సిబ్బంది వసతి కోసం ఈ నగరాన్ని సృష్టించారు. చెర్నోబైల్ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నివసించేందుకు వీలుగా 13 వేలకు పైగా అపార్ట్మెంట్లు నిర్మించారు. వారి చిన్నారుల చదువుల కోసం 15 ప్రాథమిక, 5 ఉన్నత పాఠశాలలు, ఒక వృత్తి విద్యా కళాశాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి, రవాణా సదుపాయం, క్రీడా మైదానం.. ఇలా అన్నిటినీ సమకూర్చారు.
భారీ ప్రణాళిక..
సోవియట్ యూనియన్ నలుమూలల నుంచీ 75-80 వేల మందిని ఈ నగరానికి తరలించాలనుకున్నారు. దానికి తగ్గట్టుగా అధికారులు చర్యలు చేపట్టడంతో 1979 నాటికి అధికారికంగా ‘ప్రిప్యత్’కు నగర హోదా లభించింది. దీంతో ఉద్యోగులు కూడా నెమ్మది నెమ్మదిగా అపార్ట్మెంట్లలోకి చేరుకోవడం మొదలుపెట్టారు. అలా ఓ దశలో నగర జనాభా 50 వేలకు చేరుకుంది. తొలుత అణువిద్యుత్ కేంద్రం సమీపంలో నివాసం అంత మంచిది కాదని వారు భావించారు. అయితే, ఎలాంటి చీకూచింతా లేకుండా పదహారేళ్లు గడిచిపోయాయి.
ప్రమాదం..
అంతా సజావుగానే సాగుతుందనుకున్న సమయంలో 1986, ఏప్రిల్ 26న జరిగిన ప్రమాదం నగర వాసులను తీవ్ర భయభ్రాంతులను చేసింది. చెర్నోబైల్ అణు విద్యుత్ కేంద్రం నాలుగో రియాక్టర్లో భారీ పేలుడు సంభవించింది. దీన్ని చూసేందుకు ప్రజలు సమీపంలోని రైల్వే బ్రిడ్జిపైకి పరుగులెట్టారు. అణు రియాక్టర్‌పైన చెలరేగిన మంటలను చూసిన కొందరు దాన్ని చిన్న ప్రమాదమేనంటూ కొట్టి పారేశారు. అణు విద్యుత్ కేంద్రంలో ఇటువంటివి సహజమేనంటూ తేలికగా తీసుకున్నారు.
రేడియేషన్..
అణు రియాక్టర్ లీకవ్వడంతో రేడియేషన్ ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే, తొలుత దీన్ని గుర్తించడంలో వారు కూడా విఫలమయ్యారు. రేడియేషన్ సాధారణ స్థాయిలోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదనీ అన్నారు. అయితే, అక్కడి రేడియేషన్ అప్పటికే ప్రమాదకర స్థాయిని మించిపోవడంతో మంటలను అదుపుచేసేందుకు వెళ్లిన సహాయక బృందాలు, అధికారులు, సమీపంలోని ప్రజలు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. మరికొందరు స్పృహ కోల్పోయారు.
నిర్మానుష్యం..
దీంతో సోవియట్ ప్రభుత్వం ప్రిప్యత్ వాసులను అక్కడి నుంచి ఆగమేఘాల మీద తరలించడం మొదలుపెట్టింది. పనులు చేసుకుంటున్న వారు, చదువుతున్న చిన్నారులు, గృహిణులు.. ఇలా ప్రజలంతా ఎక్కడి వస్తువులు అక్కడే విడిచిపెట్టి నగరాన్ని ఖాళీ చేశారు. దాదాపు 50 వేల మంది ప్రిప్యత్ను విడిచిపెట్టడంతో నగరం నిర్మానుష్యంగా మారింది. కొన్ని వందల ఏళ్ల పాటు ఆ నగరం నివాసయోగ్యం కాదని అధికారులు తేల్చడంతో ప్రజలు తిరిగి వచ్చే సాహసం చేయలేదు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ అయిన నగరంగా ప్రిప్యత్ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది.
భయంకర నగరం..
గత 29 ఏళ్లుగా జనసంచారం లేని ప్రిప్యత్ నగరం ప్రస్తుతం భయంకర నగరంగా పేరొంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. చిందరవందరగా పడేసి ఉన్న సామగ్రి, చిన్నారుల ఆటవస్తువులు, పుస్తకాలు, ఆసుపత్రిలోని మందులు, అమ్యూజ్మెంట్ పార్కులోని జెయింట్‌వీల్, మోడుబారిన గోడలు సందర్శకులను భయపెడుతున్నాయి. కొందరు ఔత్సాహిక పరిశోధకులు నేటికీ పరిశోధనల పేరుతో నగరాన్ని చూసి వెళ్తుంటారు.