pres cription
-
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?
జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. కానీ వైద్యుల సలహా లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రమాదకరమని మీకు తెలుసా? 564 మందిపై 2023లో నిర్వహించిన సర్వేలో 43.6శాతం మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించారట. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడినా, అదేపనిగా వాడినా అనర్థాలు తప్పవని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచ పది ఆరోగ్య సంక్షోభ అంశాల్లో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మొదటి పదిలో ఒకటిగా ఉన్నట్టు పేర్కొంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే యాంటీబయాటిక్స్ కొనుగోలు చేయాలి అంటున్నారు డీఏసీ. ఏఎంఆర్ అంటే యాంటీ బయోటిక్స్‌ను అతిగా వాడడం వల్ల ఆ మందు వైరస్‌పై పనిచేయకుండా పోయే పరిస్థితి అని తెలిపింది. యాంటీ బయోటిక్స్‌ను ప్రజలు అవగాహన లేకుండా వాడటంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. యాంటీబయోటిక్స్ వాడకం అనర్థాలపై అవగాహన పెంచాలని సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 12.7 లక్షల మంది బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కారణంగా మృతి చెందినట్టు తెలిపారు. యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల బ్యాక్టీరియా రెసిస్టెంట్‌గా మారుతుందని, ఇది సూపర్‌బగ్ మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వినియోగించాలన్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇకపై స్పష్టంగా ‘ప్రిస్క్రిప్షన్’!
సాక్షి, ముంబై: డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు అర్థం కాక రోగులకు ఒక్కోసారి మందుల దుకాణదారులు వేరే మందులు ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఫుండ్ అండ్ డ్రగిస్టు (ఎఫ్డీ) పరిపాలనా విభాగం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మోడల్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ పెర్ఫెక్ట్ పాలసీని ఎఫ్డీ కమిషనర్ మహేష్ జగడే జారీ చేశారు. దీనిమేరకు ఇకపై రోగులకు డాక్టర్లు తాము రాసిచ్చే మందుల పేర్లను స్పష్టంగా రాయాలి. మందులు సాధారణ తెల్లకాగితంపై కాకుండా వారి లెటర్ హెడ్‌పైనే రాసివ్వాల్సి ఉంటుంది. దానిపై రిజిస్ట్రేషన్ సంఖ్య, డాక్టర్ పూర్తిపేరు, చిరునామా కచ్చితంగా ఉండాలి. మందుల పేర్లు, వాటిని వాడే విధానం (డోస్) ఆంగ్లంలో పెద్ద అక్షరాల్లో స్పష్టం గా రాయాలి. కొన్ని సందర్భాల్లో డాక్టర్ రాసిన రాత అర్థంకాక ఇంట్లో మిగిలిపోయిన మందులే మళ్లీ కొనాల్సి వస్తుంది. ఇంటికి వచ్చాక పరిశీలిస్తే అంత కు ముందు వాడిన మందులే ఉంటాయి. అదే అక్షరాలు స్పష్టంగా రాస్తే ఫలానా మందు, మాత్రలు తమ వద్ద ఉన్నాయని తెలుసుకుని కొనుగోలు చేయడం మానేస్తారు. దీంతో రోగుల డబ్బు వృథా కాకుండా అరికట్టవచ్చని జగడే అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ప్రిస్క్రిప్షన్పై స్పష్టంగా రాయని డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మందుల చీటిపై డాక్టర్ లేదా క్లినిక్, నర్సింగ్ హోం రిజిస్ట్రేషన్ నంబరు, పూర్తి పేరు, చిరునామ ముద్రించడంవల్ల నకిలీ డాక్టర్లకు కళ్లెం వేయడానికి మార్గం సుగమమైంతుందని జగడే పేర్కొన్నారు. తెల్ల కాగి తంపై మందులు రాసివ్వడంవల్ల ఇది అసలు డాక్టర్ రాసిచ్చారా..? లేక నకిలీ డాక్టర్ రాసిచ్చాడా...? అనేది తేల్చుకోవడం కష్టం కానుంది. దీంతో ఈ మోడల్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఫర్ఫెక్ట్ పాలసీని జారీచేసినట్లు ఆయన స్పష్టం చేశారు.