రుణాలు చెల్లించాల్సిందే
రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి
యాచారం: యాచారం: రుణం చెల్లించాల్సిందేనని మాల్ ఆంధ్రాబ్యాంక్ అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఉదయం బ్యాంక్ అధికారులు యాచారం మండలం తమ్మలోనిగూడ, చింతపట్ల, కొత్తపల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రుణాలు చెల్లించాలని రైతులను కోరారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెబుతోంది కదా.. మళ్లీ చెల్లించడం ఎందుకని ప్రశ్నించారు.
కచ్చితంగా చెల్లించాల్సిందే.. లేదంటే వడ్డీ రెండింతలవుతుందని బ్యాంకు సిబ్బంది తేల్చి చెప్పారు. మాఫీ అమలైతే మీ ఖాతాల్లోనే నగదు జమ చేస్తామన్నారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఉద్రిక్త పరిస్థితులను గమనించిన బ్యాంకు ప్రతినిధులు అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. రుణమాఫీ తర్వాత విషయం.. ముందు రుణాలు చెల్లించాల్సిందేనన్నారు. వసూళ్ల విషయంలో ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలున్నాయని చెప్పారు.