2020లో అటు టోక్యో...ఇటు టి20
ప్రపంచ క్రీడా పటంలో మన స్థానం ఏమిటనేది చూపించే వేదిక ఒకటైతే... జనం మెచ్చిన క్రికెట్ పండుగలో మన బలాన్ని ప్రదర్శించే మైదానం మరొకటి... ‘రియో’లో ఒక రజతం, ఒక కాంస్యానికే ఆట ముగించిన భారత బృందం ‘టోక్యో’లో ఏం చేస్తుందనేది ఆసక్తికరం! 2007లో మొదటిసారి విజేతగా నిలిచిన తర్వాత మళ్లీ టి20 ఫార్మాట్లో ప్రపంచకప్‌ను అందుకోలేకపోయిన ‘మెన్ ఇన్ బ్లూ’ సత్తాకు ప్రపంచ కప్ పరీక్ష పెట్టనుంది. వార్షిక క్యాలెండర్లో ప్రతీ ఏడూ వచ్చే క్రీడా టోర్నీలు ఎన్ని ఉన్నా... ప్రత్యేకంగా నిలిచే వేడుకలు మాత్రం కొన్నే ఉంటాయి. 2020లో అలరించబోతున్న రెండు మెగా ఈవెంట్లలో భారత జట్టు ఆశలు, సవాళ్లను చూస్తే...
2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 121 మంది సభ్యుల భారీ బృందంతో బరిలోకి దిగింది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం సాధించగా, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్యం అందుకుంది. ఇవి మినహా అన్నీ వైఫల్యాలే. పోటీలకు మించి ఎన్నో ఆశలు రేపిన క్రీడాకారులు అసలు పోరుకు వచ్చేసరికి మాత్రం చతికిల పడ్డారు. అంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలతో మెరిసిన తర్వాత నాలుగేళ్లకు ఆ సంఖ్య పెరుగుతుందనుకుంటే పరిస్థితి తిరోగమించింది. ‘రియో’తో పోలిస్తే ఈసారి ‘టోక్యో’లో పరిస్థితి కొంత మెరుగు కావచ్చనేది అంచనా. గత నాలుగేళ్లలో కొన్ని క్రీడా సమాఖ్యలు ప్రణాళికాబద్ధంగా తమ ఆటగాళ్లను సన్నద్ధం చేసిన తీరు... ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) పథకం ద్వారా ప్రభుత్వం ఆటగాళ్లకు అందించిన ఆర్థిక సహకారం కలగలిసి పతకాల రూపంలో కనిపించాలనేది ప్రతీ అభిమాని ఆకాంక్ష.
జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. వేర్వేరు క్రీడాంశాల్లో భారత్ నుంచి ఇప్పటికే 62 మంది క్రీడాకారులు అర్హత సాధించగా... చాలా అంశాల్లో ఇంకా అర్హతకు అవకాశం ఉంది. వాటిలో తుది గడువు ముగిసిపోకపోగా, క్వాలిఫయింగ్ ఈవెంట్లు కూడా జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి భారత్ తరఫున 6 క్రీడాంశాలు, 24 ఈవెంట్లలో కలిపి మొత్తం 62 మంది (టీమ్ ఈవెంట్ హాకీ సహా) ‘టోక్యో’కు అర్హత సాధించారు. హాకీ కాకుండా ఇందులో ఆర్చరీ, అథ్లెటిక్స్, ఈక్వెస్ట్రియన్, షూటింగ్, రెజ్లింగ్ కూడా ఉన్నాయి.
►2016కు ముందు వరల్డ్ చాంపియన్‌షిప్, వరల్డ్ కప్‌లలో పతకాలు పండించిన భారత షూటర్లు ఒలింపిక్స్‌కు వచ్చేసరికి బోల్తా పడ్డారు. అయితే ఈసారి కూడా భారత షూటర్లు ఇటీవల సాధించిన విజయాలు ఆశలు రేపుతున్నాయి. ఇప్పుడైనా వారు అదే జోరు కొనసాగిస్తే కచ్చితంగా పతకాలు అందించే ఆటల జాబితాలో షూటింగ్ ఉంటుంది. రికార్డు స్థాయిలో ఇప్పటికే 10 ఈవెంట్లలో 15 మంది క్వాలిఫై కావడం విశేషం. వీరిలో మను భాకర్, సౌరభ్ చౌదరి, తేజస్విని సావంత్‌లపై మంచి అంచనాలు ఉన్నాయి.
►ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, కాంస్యం గెలిచిన యోగేశ్వర్ దత్ల బాటలో ‘టోక్యో’లో రెజ్లింగ్‌పై అభిమానులు నమ్మకం ఉంచుతున్నారు. ఇప్పటికే క్వాలిఫై అయిన బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), రవి దహియా (57 కేజీలు), వినేశ్ ఫొగాట్ (మహిళల 53 కేజీలు) దేశానికి పతకం సాధిస్తే రెజ్లింగ్ గౌరవం మరింత పెరుగుతుంది.
►మహిళల హాకీ జట్టు విషయంలో సందేహాలు ఉన్నా... పురుషుల హాకీ జట్టుకు పతకం సాధించగల సత్తా ఉందనేది సగటు అభిమాని నమ్మకం. హాకీ జట్టు ‘డ్రా’ కూడా మనకు అనుకూలంగానే ఉంది. 1980 ఒలింపిక్స్ తర్వాతి నుంచి హాకీలో పతకం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారత్‌కు ఈ సారైనా ఆ కోరిక తీరుతుందేమో చూడాలి.
►ఇక బ్యాడ్మింటన్ విషయానికి వస్తే మరోసారి పీవీ సింధుపైనే ఆశలు ఉన్నాయి. అయితే ఆమెతో పాటు చాలా సందర్భాల్లో కోచ్ పుల్లెల గోపీచంద్ చెప్పిన విధంగా ఈసారి ప్రత్యర్థులు సింధు గత మ్యాచ్‌లను బట్టి సన్నద్ధమై వస్తారు కాబట్టి ఆమె మరింత శ్రమించక తప్పదు. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత సింధుకు ఎదురైన పరాజయాలు ఆ దిశగా ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. సైనా ఇటీవలి ప్రదర్శన, ఫిట్నెస్ను బట్టి చూస్తే ఆమెపై అంచనాలు కష్టమే. పురుషుల విభాగంలోనూ శ్రీకాంత్ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. అయితే సాయిప్రణీత్ అర్హత సాధిస్తే భారత్ పతకం గురించి ఆశలు పెట్టుకోవచ్చు. ఇక పురుషుల డబుల్స్‌లోనూ సాత్విక్–చిరాగ్ జోడి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
►బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ కూడా పతకాలు సాధించగల స్థాయి ఉన్న క్రీడాంశాలు. టెన్నిస్‌లో మన ఆటగాళ్ల ర్యాం కింగ్‌ను బట్టి ఒక అంచనాకు రావచ్చు. మరోవైపు ఎప్పటిలా గే అథ్లెటిక్స్‌లో ఆశలు, అంచనాలు తక్కువే ఉన్నాయి. ‘నడక’లో ఇర్ఫాన్, స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్‌లతో పాటు 4్ఠ400 మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ అర్హత సాధిం చింది. కానీ ఇందులో ఎవరైనా ఫైనల్ చేరినా గొప్పే. ఏ రకంగానైనా ‘రియో’లో మన ప్రదర్శన వైఫల్యం కిందే లెక్క. దానితో పోల్చుకోకుండా 2012 ఒలింపిక్స్ ఆరు పతకాల ఘనతను అధిగమించగలిగితే భారత్ అద్భుతం చేసినట్లే. భారత్ అనామక జట్టుగా బరిలోకి దిగిన తొలిసారి 2007లో టి20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
ఆ తర్వాత ఐదు పొట్టి ప్రపంచ కప్‌లు జరిగినా మన చేతికి అది చిక్కలేదు. 2008లో ఐపీఎల్ వచ్చి టీమిండియా ఆటగాళ్లంతా స్టార్లుగా, టి20 ఫార్మాట్లో రాజులుగా మారిపోయిన తర్వాత కూడా గెలుపు సాధ్యం కాలేదు. 2014లో ఫైనల్, 2016లో సొంతగడ్డపై సెమీస్ చేరిన భారత్... మిగిలిన మూడు సందర్భాల్లో లీగ్ దశకే పరిమితమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత 2020లో మళ్లీ 20–20 ప్రపంచ కప్‌కు రంగం సిద్ధమైంది. అక్టోబరు 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో ఈ మెగా టోర్నీ జరగనుంది.
►వరల్డ్ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్, అలవోకగా సిక్సర్లు కొట్టగల ఓపెనర్లకు తోడు యువ ఆటగాళ్ల బృందంతో ప్రస్తుత భారత టి20 జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఐసీసీ టీమ్ ర్యాంకుల్లో టీమిండియా ఐదో స్థానంలో ఉంది. మన జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఓవరాల్ టి20 రికార్డు సాధారణంగానే ఉన్నా... తాజా ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లి సేనను ఫేవరెట్‌గా పేర్కొనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తర్వాత టైటిల్ గెలిచే సత్తా భారత్‌కు మాత్రమే ఉందనేది విశ్లేషకుల మాట. కోహ్లి, రోహిత్‌లతో పాటు రాహుల్ ఈ ఫార్మాట్లో ప్రమాదకర ఆటగాడిగా మారాడు.
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లాంటి దూకుడైన కుర్రాళ్లకు టి20ల్లో ఆకాశమే హద్దు. గాయాల నుంచి కోలుకొని హార్దిక్ పాండ్యా జట్టులో చేరితే మన ఆల్‌రౌండ్ బలగానికి తిరుగుండదు. అతను పునరాగమనం చేయలేకపోతే శివమ్ దూబే రూపంలో మరో ఆటగాడు మనకు అందుబాటులో ఉంటాడు. బౌలింగ్‌లో మన పేసర్ల గాయాలు కొంత ఆందోళన కలిగించినా... వరల్డ్ కప్ సమయానికి అన్నీ సర్దుకోవచ్చు. బుమ్రాలాంటి వరల్డ్ క్లాస్ పేసర్ భారత దళాన్ని నడిపించనుండగా, యువ ఆటగాళ్లు దీపక్ చాహర్, నవదీప్ సైనీలు జట్టులో భాగంగా ఉండవచ్చు. 15 మంది సభ్యుల జట్టులో ఎవరెవరు ఖాయమనేది ఇప్పుడే చెప్పలేకపోయినా గాయం నుంచి కోలుకుంటే భువనేశ్వర్‌కు చోటు ఉండటం ఖాయం. టి20ల్లో రికార్డు గొప్పగా లేకపోయినా, ఆస్ట్రేలియా బౌన్సీ వికెట్లపై షమీ అత్యంత విలువైన బౌలర్‌గా మారగలడు.
►ఆస్ట్రేలియాలో తొలిసారి టి20 ప్రపంచ కప్ జరగబోతోంది. అక్కడి పెద్ద మైదానాలు బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా నిలవడం ఖాయం. ఐపీఎల్లో వీరబాదుడు బాది ఉత్సాహంగా ఆసీస్ గడ్డపై అడుగు పెడితే లెక్క తప్పవచ్చు. ఇక్కడ అలవోకగా సిక్సర్‌గా మారిన బంతులు అక్కడ బౌండరీకి చాలా ముందే క్యాచ్‌లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాని కోసం కుర్రాళ్లకు ప్రత్యేక సన్నద్ధత అవసరం. అయితే మైదానం ఎలాంటిదైనా పది సీట్ల ఆవలకు కొట్టే సామర్థ్యం ఉందని రోహిత్ చాలా సార్లు నిరూపించాడు కాబట్టి అతని స్థాయికి ఇది సమస్య కాకపోవచ్చు.
అన్నింటికి మించి ధోని ఈ మెగా టోర్నీ వరకు ఆడతాడా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న. దీనిపై ఇంకా స్పష్టత లేకున్నా, అతని అనుభవం ఆసీస్‌లో పనికొస్తుందని భావిస్తే చివరిసారిగా ఎంపిక చేయవచ్చు కూడా. భారత్ ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై అదే జట్టు ప్రత్యర్థిగా ద్వైపాక్షిక సిరీస్‌లలో 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 గెలిచి 3 ఓడింది. అంటే ప్రదర్శన బాగానే ఉన్నట్లు. ఇందులో 2015–16 టూర్లో భాగంగా జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో గెలుచుకోవడం ఎప్పటికైనా స్ఫూర్తినిచ్చే అంశమే!