ప్రయాణీకులకు రక్షణగా కూల్ షేడ్స్ !
నాగ్ పూర్ః భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నగరాల్లో ఒకటైన నాగపూర్ లో ప్రయాణీకుల కష్టాలపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎండ వేడి నుంచీ ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నారు.
తీవ్రమైన వేడిని తట్టుకోలేక, సిగ్నల్ పడిన ఒకటి రెండు నిమిషాలు కూడ వేచి చూడలేని ప్రజలు... సిగ్నల్ జంప్ కు ప్రయత్నించడాన్ని నాగపూర్ అధికారులు గమనించారు. అందుకే ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ప్రతి కూడలివద్దా ముఖ్యంగా టూవీలర్ పై ప్రయాణించే వారికి ఎండనుంచి రక్షణ కోసం పచ్చని క్లాత్ తో నీడనిచ్చే ఏర్పాట్లు చేశారు. నాగపూర్ లో ఈసారి నమోదవుతున్న44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేని ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేందుకు కూడ వెనుకాడటం లేదు. దీంతో అధికారులు ఈ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
చల్లని రాష్ట్రంగా చెప్పే మహరాష్ట్రతోపాటు ఈసారి దేశంలోనే అనేక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంటినుంచీ బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణించాల్సి రావడం వారి ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తోంది. దీంతో తీక్షణమైన సూర్యకిరణాల వేడినుంచీ ప్రయాణీకులను కాపాడేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూల్ గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిగ్నల్ పడినప్పుడు మోటారిస్టులు అక్కడి నీడలో ఆగేందుకు ప్రయత్నిస్తుంటారు. లేదంటే ఎండను తట్టుకోలేక అడ్డదిడ్డంగా రోడ్లు దాటడం, సిగ్నల్ జంప్ చేయడం చేస్తుంటారు. దీన్ని నిశితంగా గమనించిన నాగపూర్ అధికారులు కూల్ షేడ్స్ ప్రక్రియ చేపట్టారు. స్థానికుల కష్టాలపై దృష్టి సారించిన అధికారుల ప్రయత్నాన్ని నాగపూర్ ప్రజలు అభినందిస్తున్నారు.