Prevention of diseases
-
సూక్ష్మ మొక్కలతో వ్యాధుల నివారణ!
సూక్ష్మ మొక్కల (మైక్రోగ్రీన్స్)ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా నివారించుకోవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూక్ష్మ మొక్కలను ట్రేలలో ఇంట్లోనే పెంచుకునే పద్ధతులను గురించి వ్యాసం మొదటి భాగంలో గత వారం తెలుసుకున్నాం, ఇది చివరి భాగం. హృదయ సంబంధ వ్యాధులు: ఈ చిన్నమొక్కలు అత్యధికంగా పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వలన గుండెని కాపాడతాయి. అల్జీమర్స్/మతిమరుపు:వీటిలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల ఆరోగ్యాన్ని పనితీరును కాపాడి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును నియంత్రిస్తాయి. మధుమేహం: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉండటం వలన శరీర కణాలు చక్కెరను సరిగ్గా వినియోగించుకునే ప్రక్రియను నియంత్రిస్తాయి. ప్రత్యేకంగా మెంతులు ఇలా ఉపయోగించినప్పుడు మధుమేహాన్ని నియంత్రించినట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైనది. కాన్సర్: వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల కేన్సర్లను నియంత్రిస్తాయి. ఏ పంటలో ఏయే పోషకాలు? 1. ముల్లంగి: ముల్లంగి విత్తనాలను కూడా సూక్ష్మవిత్తనాలుగా వాడుకోవచ్చు. ఇవి ఉష్ణ, శీతల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొలకెత్తుతాయి. అంతేగాక ఇవి అతి తొందరగా ఎదగడం వల్ల 5 నుంచి 10 రోజులలో కత్తిరించి వాడుకోవచ్చు. 2.బ్రోకలీ: బ్రోకలీని శక్తిమంతమైన ఆహారంగా పరిగణిస్తారు. దీనిలో ఖనిజాలు ముఖ్యంగా ఇనుము, ఎ–సి విటమిన్లు అత్యధికంగా ఉంటాయి. ఎదిగిన బ్రోకలీ మొక్కల కంటే వీటిలో అత్యధికంగా పోషకాలు ఉంటాయి. 3.బీట్రూట్: మిగతా విత్తనాలతో పోలిస్తే బీట్రూట్ విత్తనాలను మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. సాధారణంగా 6 నుంచి 8 రోజులలో మొలకెత్తుతాయి. 10–12 రోజుల్లో కత్తిరించుకోవచ్చు. బీట్రూట్ విత్తనాలను వేసుకునే ముందు చల్లని నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఈ సూక్ష్మ విత్తనాలు ఆహారానికి పోషకాలతోపాటు రంగును కూడా చేరుస్తాయి. 4. తోటకూర: తోటకూర విత్తనాలు తొందరగా మొలకలు వచ్చి అతి త్వరగా ఎదుగుతాయి. దాదాపుగా 2 లేదా 3 రోజుల వ్యవధిలో మొలకెత్తుతాయి. 8 లేదా 12 రోజులలో కోతకు వస్తుంది. వీటిని ఫ్రిజ్‌లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు. 5.ఆవాలు : ఆవాలు 3 నుంచి 4 రోజుల్లో మొలకెత్తుతాయి. 6 నుంచి 10 రోజుల్లో కత్తిరించి వాడుకోవచ్చు. ఇవి చాలా తొందరగా ఎదుగుతాయి. వీటి ఘాటు రుచి వలన వంటకాలలో లేదా సలాడ్‌లో చేర్చినప్పుడు మంచి రుచిని ఇస్తాయి. 6. చుక్కకూర: చుక్కకూర విత్తనాలు 4 నుంచి 5 రోజులలో మొలకెత్తుతాయి. ఇవి నెమ్మదిగా ఎదుగుతాయి. కాబట్టి 12 నుంచి 20 రోజుల సమయం తీసుకుంటాయి. వీటిని వంటకాలలో చేర్చినప్పుడు పులుపు రుచిని కలిగి ఉండటం వలన ఎక్కువగా ఇష్టపడతారు. కంపోస్టులో పెరిగిన సూక్ష్మ మొక్కల్లో అధిక పోషకాలు! ► కంపోస్టు, హైడ్రోపోనిక్ (పోషకాల ద్రావణం కలిపిన నీరు లేదా నీరు మాత్రమే) మాధ్యమాలను సరి పోల్చినప్పుడు.. కంపోస్టులో పెంచిన మొక్కలలో అధిక పోషకాలు ఉన్నట్లు నిర్థారితమైంది. ► అమెరికా శాస్త్రవేత్తలు బ్రోకలీ మైక్రోగ్రీన్స్‌ని, ఎదిగిన బ్రోకలీ మొక్కలలోని మినరల్స్‌తో పోల్చి చూసినప్పుడు 1.15 నుంచి 2.32 శాతం వరకు (ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, సోడియం, జింక్ వంటి) ఖనిజాలు మైక్రోగ్రీన్స్‌లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ► ఈ మైక్రోగ్రీన్స్ పెంచడానికి కేవలం ఎకరానికి 15,679 లీటర్ల నీరు మాత్రమే అవసరం. అదే మొక్కలను పూర్తిగా పెంచినట్లయితే 24,80,000 నుంచి 37,00,000 లీటర్ల నీరు అవసరం. అదేవిధంగా బ్రోకలీ మొక్కలు పూర్తిగా ఎదగడానికి 100 నుంచి 150 రోజుల సమయం పడుతుంది. కానీ మైక్రోగ్రీన్స్‌ని 7 నుంచి 9 రోజులలో కత్తిరించుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే తరిగిపోతున్న వనరులు, గ్లోబల్ వార్మింగ్, పోషకాహార లోపం వంటి సమస్యలను కూడా ఈ మైక్రోగ్రీన్స్ ద్వారా నివారించవచ్చు. ► 25 రకాల మైక్రోగ్రీన్స్‌పై జరిపిన పరిశోధనలో 100 గ్రాములలో 20.4 నుంచి 147.0 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 6 నుంచి 12.1 మి.గ్రా.ల బీటా కెరోటిన్, 4.9 నుంచి 87.4 విటమిన్ ఇ ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి బాగా పెరిగిన ఆకులతో పోల్చితే చాలా ఎక్కువ శాతం పోషకాలను కలిగి ఉన్నాయి. ఈ 25 రకాలలో రెడ్ క్యాబేజి, కొత్తిమీర, తోటకూర, ముల్లంగిలో అత్యధికంగా ఆస్కార్బిక్ ఆమ్లం, కెరోటినాయిడ్స్, ఫిల్లిక్వినోన్లు, టోకోఫెరాన్లు ఉన్నట్లు అధ్యయనంలో తేల్చారు. ► చక్కెర శాతం కూడా ప్రతి వంద గ్రాములలో 10.3 గ్రా. ఉండగా అదే పరిపక్వత చెందిన వాటిలో 44–17 గ్రా. ఉన్నట్లు గుర్తించారు. ► రెడ్ క్యాబేజీపై జరిపిన పరిశోధనలో మైక్రోగ్రీన్లో ప్రతి గ్రాముకు 71.01 మైక్రోమోల్స్ ఫాలీఫినాల్స్ ఉండగా, పరిపక్వత చెందిన రెడ్ క్యాబేజీలో 50.58 మైక్రోమోల్స్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడే వారికి ఫాలీఫీనాల్స్ ఉపయోగకరం. ► హైడ్రోపోనిక్‌లో పొటాషియం తక్కువగా ఉన్న పోషకాల ద్రావణం కలపడం ద్వారా ఈ మాధ్యమంలో పెంచిన మైక్రోగ్రీన్స్‌లో తక్కువ పొటాషియం కలిగి మిగతా పోషకాలలో మార్పు లేక పోవటం వలన కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఈ మైక్రోగ్రీన్స్ సహాయ పడతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. సూక్ష్మ మొక్కలతో ఎన్నెన్నో వంటకాలు సూక్ష్మమొక్కలను సాధారణంగా సలాడ్, సాండ్విచ్, పండ్ల రసాలు, మిల్క్ షేక్‌లలో వాడతారు. అంతేకాకుండా సూపులు, రోల్స్‌లో కూడా చేర్చడం ద్వారా రుచితోపాటు పోషకాలు కూడా అధికంగా అందుతాయి. సూక్ష్మమొక్కల ఉపయోగాన్ని మరింత సులభం చేయడానికి హైదరాబాద్‌లోని ‘మేనేజ్’, జాతీయ పోషకాహార సంస్థ కలిసి వివిధ ఆహార పదార్థాలలో ఈ మొక్కలను చేర్చి పోషక స్థాయిని అధ్యయనం చేస్తున్నారు. ఇంత ఆవశ్యకత కలిగిన ఈ సూక్ష్మ మొక్కలను హోటళ్లు, రెస్టారెంట్లలో అధిక ధర పెట్టి కొనుక్కోవటం కాకుండా సులభంగా ఇంట్లోనే పెంచుకోవడం ద్వారా రోజూ తినే ఆహారంలో రుచిని, పోషకాలను పెంచుకొని ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. – డా. వినీత కుమారి (83672 87287), డెప్యూటీ డైరెక్టర్ (జెండర్ స్టడీస్), డా. జునూతుల శిరీష, సీనియర్ రీసెర్చ్ ఫెలో, డా. మేకల శ్రీకాంత్, కన్సల్టెంట్, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్), హైదరాబాద్ వాడకానికి సిద్ధమైన ఆవాల సూక్ష్మ మొక్కలు నీటిలో పెరిగిన తెల్ల ముల్లంగి సూక్ష్మ మొక్కలు -
సిరి ధాన్యాలను ఎందుకు తినాలి?
ఆధునిక రోగాల నివారణలో సిరిధాన్యాలు ఎంతో కీలక పాత్ర వహిస్తున్నాయి. మనకు, మన ముందు తరాల వారికీ, మన భూములకూ, వాతావరణానికి, మన ఆరోగ్యాలకూ ఇవి ఒక వరం. ప్రపంచానికే మార్గదర్శకంగా తిరిగి పరిచయం అవుతున్నాయి ఈ సిరిధాన్యాలు. సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ... తరతరాల సంకరం తర్వాత వరి, గోధుమ పంటల్లో పీచు పదార్థం(ఫైబర్) తక్కువైపోయింది. ఎరువులూ, పురుగు మందులూ లేని వరి అన్నం, గోధుమలూ కరవయ్యాయి. వాటికి తోడు విషపూరితమైన కలుపు మందుల వాడకం పెరిగిపోయింది. మన ఆహారంలో ఉన్న సహజపీచు పదార్థమే (డైటరీ ఫైబర్) ఆహారం నుంచి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.ప్రస్తుతం వరి, గోధుమ ఆహారపదార్థాలలో పీచు పదార్థం 0.25 శాతం– 0.5 శాతానికి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15–35 నిమిషాలలో గ్లూకోజ్ (చక్కెరగా–అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా)గా మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే ఎలా? వీటికి తోడుగా స్వీట్లు తింటే? బర్గర్, పిజ్జాలు మైదాతో చేసిన నాన్ రొట్టె కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్లని కష్టపెడుతుంది. అనేక రోగాలకు దారి తీస్తుంది. మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం. మన దేహంలోని రక్తంలో ఉండే గ్లూకోజ్ 6–7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరికి గ్లూకోజ్‌గా మారి, రక్తంలోకి రావటం, దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లో లేదా 30–40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికీ మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, ఫిట్స్, మొలలు, మూల శంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపిండాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు.అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుంచి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్‌ను రక్తంలోకి వదులుతుంటాయి. కొర్ర బియ్యం, అరిక బియ్యం, ఊద బియ్యం, సామ బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుంచి 12 శాతం పీచు పదార్థం కలిగినవి. పూర్తిగా సేంద్రియమైనవి. ఈ ఐదూ ‘పంచరత్న సిరి ధాన్యాలు’గా ‘పాలిష్ చేయబడనివి’గా మరింత శ్రేష్ఠమైనవి. వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిర్యానీ, బిసిబేళ బాత్ కూడా చేసుకోవచ్చు. సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ... మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు మనిషికి అవసరమైన 25–30 గ్రాముల ఫైబర్ (ప్రతి మానవుడికీ రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకుల కూరల నుంచి పొందవచ్చు.ఒక్కొక్క సిరిధాన్యం కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి. వరి, గోధుములలో పీచు పదార్థం 0.2 నుంచి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఉదాహరణకి కొర్ర బియ్యం– సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబర్‌తో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణులకు సరైన ఆహారంగా సూచించవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. వాటిని పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన బలహీనతకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్ ,పార్కిన్సన్, ఆస్తమాను నివారించడంలో కూడా కొర్రబియ్యం దోహదపడుతుంది.పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్ లేదని గ్రహించి, 2–3 ఫైబర్ టాబ్లెట్లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు. సహజంగా ఆహారంలోనే ఫైబర్ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలోకి గ్లూకోజు విడుదలని సమర్థవంతంగా నియంత్రించగలదు.ఇలాగే అరికలు బియ్యం.... రక్త శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి అరికలు ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ జ్వరం వగైరాల తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు. సామ బియ్యం మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగుచేస్తాయి. ఆడవారిలో pఛిౌఛీ తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింఫు మండలపు శుద్ధికి సామలు ఎంతో పనికి వస్తాయి. ఊద బియ్యం థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి కూడా ఇవి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయం, గర్భాశయ క్యాన్సర్లను తగ్గించడానికి పనిచేస్తాయి. ఊద బియ్యం జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, జజీటటuట్ఛటఅల్సర్లు, మెదడు, రక్త, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్... మొదలైన సమస్యలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి. (మరింత సమాచారం లోపలి పేజీల్లో) డాక్టర్ ఖాదర్ వలి ఆరోగ్య–ఆహార నిపుణులు -
పశువుల ఆరోగ్యం.. జర భద్రం!
అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి చికిత్స కంటే నివారణే మేలు పాకలను శుభ్రంగా ఉంచాలి వైద్యుల సలహాలు పాటించాలి - టేక్మాల్ పశువైద్యాధికారి బెంజ్‌మెన్ సలహాలు సూచనలు పశువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి అంటువ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకరమైన అంటువ్యాధులకు చికిత్సకు బదులు నివారణే ముఖ్యం. వాటిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఏ మాత్రం అనుమానం వచ్చిన వైద్యులను సంప్రదించాలని టేక్మాల్ పశువైద్యాధికారి బెంజ్‌మెన్ (సెల్: 96630 25553) తెలిపారు. వ్యాధుల నివారణకు పశువైద్యాధికారి సలహాలు, సూచనలు మీకోసం... - టేక్మాల్ - గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు రెండింటి నివారణకు రక్షాబయోవ్యాక్.. గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటువ్యాధి మూడింటి నివారణకు రక్షట్రయోవాక్ పేరుతో ఒకే టీకా లభిస్తుంది. - టీకాలను శీతలపరిస్థితిలో భద్రపరచడం, కంపెనీలు నిర్దేశించిన విధంగా మోతాదు వాడడం చల్లని సమయాల్లో టీకాలు వేయడం, ఆరోగ్యమైన పశువులకే వేయడం, బూస్టర్ డోసు వేయడం, టీకాలు గ్రామాల్లోని పశుసంపదకంతా సాముహికంగా వేయడం, టీకాలు వేసేప్పుడు సూదులు మార్చడం మొదలగు జాగ్రత్తలు తీసుకుంటే టీకాల వల్ల సత్ఫలితాలుంటాయి. - టీకాలు వేసేముందు పశువులకు అంతర పరాన్నజీవుల మందులు తాగిస్తే టీకాలు చక్కగా పని చేస్తాయి. సాధారణ వ్యాధులు, అంటువ్యాధులు అంత ప్రమాదకరమైనవి కానప్పటికీ.. పశువుల్లో ఉత్పాదక సామర్థ్యాన్ని హరించివేస్తాయి. అప్పుడప్పుడు ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి. ఈ రెండు రకాల అంటు వ్యాధుల నివారణకు ఈ కింది విషయాల్లో రైతాంగం శ్రద్ధవహిస్తే చాలావరకు పశువుల్ని సంరక్షించుకోవచ్చు. - వ్యాధిగ్రస్త పశువుల్ని మందనుంచి వేరుచేసి, సత్వరమే చికిత్స చేయించాలి. మిగతా ఆరోగ్యకరమైన పశువులకు వెంటనే టీకాలు వేయించాలి. - టీకాలు వేసిన తర్వాత పశువుల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించడానికి 15-20 రోజుల సమయం పడుతుంది. టీకాల్ని వేయడం ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత త్వరగా వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. - వ్యాధిగ్రస్త పశువులు తినగా మిగిల్చిన మేత, దాణా, నీళ్లు పశువుల చొంగతో కలుషితమవడం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వాటిని తొలగించాలి. లేదా కాల్చివేయాలి. - వ్యాధిసోకి మరణించిన పశు కళేబరాలను సాధారణంగా నీటి ప్రవాహాలు, కాలువలు, కుంటలు, పచ్చికబయళ్లలో పడేయడం వల్ల వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. కళేబరాన్ని లోతైన గొయ్యితీసి పాతిపెట్టాలి. దొమ్మవ్యాధి సోకిన పశువుల్ని మరణించిన చోటే పాతిపెట్టాలి. ఎలాంటి పరిస్థితిలో కోయకూడదు. - టీబీ, హెచ్ఎస్ మొదలగు వ్యాధులు గాలి ద్వారా, శాసద్వారా వ్యాపిస్తాయి. పశువుల్ని పాకల్లో కిక్కిరిసి ఉంచకూడదు. పాకల్లో గాలి, వెంటిలేషన్ మెరుగ్గా ఉండేలా నిర్మించుకోవాలి. పశువులకు సరిపోను స్థలం ఉంచాలి. - జోరిగలు, దోమలు, గోమార్లు మొదలగు బాహ్యపరాన్న జీవులకాటు ద్వారా సర్రాథ్తేలేరియాసిన్ వంటి వ్యాధులు సోకుతాయి. సాయంత్రం వేళల్లో పాకల దగ్గర వేపాకు కాల్చాలి. అప్పుడప్పుడు పశువుల శరీరంపై, పాకల్లో బాహ్యపరాన్న జీవుల నిర్మూలన మందుల్ని పిచికారి చేయాలి. బాహ్యపరాన్నజీవుల బెడద తగ్గడానికి పాకల్లో చెత్త చెదారం లేకుండా, శుచి శుభ్రత పాటించాలి. - పశువుల మలమూత్రాల ద్వారా జలగ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. పాకల్ని రోజుకు రెండు సార్లు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేస్తూ పొడిగా ఉంచాలి. మురుగునీరు పారుదల సౌకర్యం బావుండేలా చూసుకోవాలి. పాకలో నేలమీద పొడిసున్నం చల్లుతుండాలి. - మందలోకి వ్యాధి ప్రవేశించకుండా వ్యాధులు సోకిన సమయాల్లో పశువుల్ని అమ్మడం, కొనడం చేయకూడదు. అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో సంతలు మూసివేయాలి. ఒక వేళ కొత్త పశువులను మందలో కలపాలంటే 15 రోజులు విడిగా ఉంచి, ఆరోగ్యంగా ఉందో లేదో పరిశీలించి మాత్రమే పాకల్లో ఉంచాలి. - పశువుల్లో వ్యాధులు ప్రబలినప్పుడు సామూహికంగా నీళ్లు తాగడం, మేత తినడం, తిరగడం చేయాకూడదు. పశువులు మేసే బయళ్లను కూడా మారుస్తుండాలి. - వర్షపు జల్లులు, వడగాలుల తీవ్రతకు గురవడం వల్ల, చాలాదూరం ప్రయాణించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురై వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి గొంతువాపు వంటి వ్యాధులు సోకుతాయి. పశువుల్ని వాతావరణ తీవ్రత నుంచి సంరక్షించుకోవాలి. - పశువులకు పరిశుభ్రమైన, క్లోరినేషన్ చేసిన నీటిని అన్నివేళలా తాగేందుకు అందుబాటులో ఉంచాలి. పుష్టికరమైన పశుగ్రాసాలను, దాణాను అందిస్తుండాలి. - రేబిస్, బ్రూసెల్లోసిస్ మొదలగు వ్యాధులు పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే స్వభావం కలిగి ఉంటాయి. పశుపోషకులు, పనివాళ్ళు చేతులు, దుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి. - టీబీ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్స కూడా లొంగని అనుత్పాదక పశువుల్ని పాకల్లో నుంచి తొలగించాలి. - బ్రూసెల్లోసిన్, ట్రైకోమోనియాసిస్, ఐబీఆర్ మొదలగు వ్యాధులు దున్నలు, ఆంబోతుల సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి. ఆంబోతులు, దున్నల సంపర్కం పట్ల అప్రమత్తంగా ఉండాలి. - మాయ ద్వారా, గర్భకోశస్రవాల ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. మేత కలుషితం అవుతుంది. స్రవాలు పొదుగుకు అంటుకోవడం వల్ల పొదుగు వాపు సమస్య ఉత్పన్నమవుతుంది. పశువుల పాకల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. - ఎలుకలు, కుక్కలు, పిల్లులు, పక్షులద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. జంతువులను, పక్షులను దూరంగా ఉంచాలి. - కలుషితమైన పాలు, మాంసం ద్వారా కూడా వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయి. వాటిని బాగా మరగబెట్టి లేదా ఉడికించి మాత్రమే వినియోగించాలి. - వాహనాలను, సందర్శకులను పశువుల పాకలోకి అనుమతించకూడదు. - పశువులను, దూడలను క్రమపద్ధతిలో డీవార్మింగ్ చేస్తుండాలి. - రోజూ ఉదయం, సాయంత్రం యజమాని స్వయంగా పశువుల ఆరోగ్యాన్ని పరిశీలిస్తుండాలి. -
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకి దత్తాత్రేయ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూ, మలేరి యా వంటి వ్యాధుల నివారణలో భాగంగా వాటిపై మరింత లోతైన పరిశోధన కోసం హైదరాబాద్‌లో ఒక వైరాలజీ ల్యాబొరేటరీని ఏర్పా టు చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్వైన్‌ఫ్లూ పరి స్థితిని వివరించడంతోపాటు, రాష్ట్రం లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని కోరుతూ దత్తాత్రేయ ఆరోగ్యశాఖ మంత్రికి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం ఢిల్లీలోని నిర్మాణ్‌భవన్‌లో ఆయన మంత్రి జేపీ నడ్డాను కలిశారు. దత్తాత్రేయతోపాటు కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఉన్నా రు. నడ్డాతో సమావేశం అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్, రంగారెడ్డితోపాటు మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా దృష్టికి తెచ్చాను’ అని దత్తాత్రేయ తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఏటా ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాం తాల్లో చాలామంది మలేరియాతో చనిపోతున్నారని, కొత్తగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని ఈ నేపథ్యంలో వ్యాధులపై పరిశోధనకు హైదరాబాద్‌లో వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని నడ్డా హామీ ఇచ్చినట్టు తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌తో త్వరలోనే సమావేశమవుతానని చెప్పారు. -
విజ్ఞాన శాస్త్రంతో విలువైన అవకాశాలెన్నో...
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధనలను ప్రోత్సహించాలి. అందులోనూ సెన్సైస్‌కు పెద్దపీట వేయాలి. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. వ్యాధుల నివారణ నుంచి మనిషి జన్యుపటం ఆవిష్కరణ దాకా.. ఎక్కువ దిగుబడి నిచ్చే పంటలు, ఆయుధాలు, క్షిపణుల తయారీ.. ప్రతిదీ సైన్స్‌తోనే! మానవ ప్రగతి విజ్ఞానశాస్త్రంతోనే ముడిపడి ఉంది!! అంగారక కక్ష్యలోకి ‘మామ్’ వంటి అద్భుతాలు సైన్స్‌తోనే సాధ్యం. సైన్స్ పరిశోధనలతో వివిధ దేశాలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయో తెలిసిందే. మన పొరుగు దేశం చైనా పరిశోధనలను ప్రోత్సహించడానికి భారీగా ఖర్చు చేస్తోంది. సైన్స్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తోంది. నగరంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకూ కోర్సులను అందిస్తున్నాయి. పరిశోధనల్లో ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్, గ్రాంట్లు మంజూరు చేస్తూ భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో సైన్స్ కోర్సులు అందిస్తున్న విద్యా సంస్థలు, కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్.. సెన్సైస్‌లో స్పెషలైజేషన్లు.. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సైన్స సబ్జెక్టులు ఉంటాయి. బీఎస్సీలో ఎన్నో సబ్జెక్టులను ఎంచుకునే వీలుంది. అవి.. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, జెనెటిక్స్, ఫుడ్‌సైన్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైనవి. ఇక పీజీ కోర్సుల్లో భాగంగా పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్నవాటితోపాటు నానోటెక్నాలజీ, జియాలజీ, మెరైన్ బయాలజీ, మెరైన్ జియాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రీషనల్ సెన్సైస్, ఆయిల్ అండ్ ఫ్యాట్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెరైన్ బయోటెక్నాలజీ, ఫిషరీ సైన్స్, ఓషనోగ్రఫీ, స్పేస్ ఫిజిక్స్, జియోఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, మెటియోరాలజీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, జియోఇన్ఫర్మేటిక్స్, యానిమల్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్‌లో కోర్సులను నగరంలో, దేశంలో వివిధయూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. అందుబాటులోని కోర్సులివే.. నగరంలో ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వంటివి వివిధ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ప్రవేశపెట్టాయి. వీటిలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న, భవిష్యత్‌లో కెరీర్‌కు అవకాశమున్న స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో భాగంగా కెమికల్ సెన్సైస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్ వంటివాటిని అందిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో కెమిస్ట్రీని ఆఫర్ చేస్తోంది. సబ్జెక్టును బట్టి ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆయా యూనివర్సిటీలు దూరవిద్యలో కూడా వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ప్రత్యేక విద్యా సంస్థలు: సైన్స్ పట్ల ఆసక్తి ఉండి.. పరిశోధనల్లో రాణించాలనుకునే ఔత్సాహిక యువతకు.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది. ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)ను దేశంలో మొత్తం ఐదు చోట్ల ఏర్పాటు చేశారు. అవి..తిరువనంతపురం, మొహాలి, కోల్‌కతా, భోపాల్, పుణె. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) - మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) పేరుతో ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులో చేరిన విద్యార్థులకు నెలకు రూ. 5 వేల స్కాలర్షిప్ కూడా ఇస్తారు. బీఎస్-ఎంఎస్ కోర్సులే కాకుండా పీహెచ్డీ కోర్సులను కూడా ఐఐఎస్ఈఆర్ ఆఫర్ చేస్తోంది. ఏ సైన్స్ కోర్సులను అందించడం కోసమే ఏర్పడిన మరో ప్రతిష్టాత్మక సంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్). భువనేశ్వర్‌లో ఉన్న ఈ సంస్థ సైన్స్‌లోని వివిధ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.niser.ac.in ఏ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా నిలుస్తోంది.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) - బెంగళూరు. నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నిబంధనలకనుగుణంగా భారీ స్థాయిలో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ కూడా అందిస్తోంది. వెబ్సైట్: www.iisc.ernet.in ఏ ఇవేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థలు కూడా సెన్సైస్‌లో వివిధ విభాగాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు) కూడా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఫ్యాకల్టీగా, పరిశోధకులుగా అవకాశాలు సైన్స్ కోర్సులు పూర్తిచేసినవారికి ఉన్నన్ని కెరీర్ అవకాశాలు మరే కోర్సుల విద్యార్థులకు లేవంటే అతిశయోక్తి కాదు. పీజీ పూర్తిచేసి సెట్, సీఎస్ఐఆర్-నెట్ వంటి వాటిలో అర్హత సాధిస్తే బోధన రంగంలో లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా పనిచేయొచ్చు. జూనియర్ లెక్చరర్‌కు నెలకు రూ.12,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది. నిపుణులకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. పీహెచ్డీ పూర్తిచేస్తే ఆయా విభాగాల పరిశోధన సంస్థల్లో జూనియర్, సీనియర్ సైంటిస్టులుగా పనిచేయొచ్చు. తద్వారా నెలకు రూ.లక్షల్లో వేతనాలు పొందొచ్చు. ఇంకా ఇతర సదుపాయాలు ఉంటాయి. నెట్లో జేఆర్ఎఫ్ పొంది పీహెచ్డీ చేసేవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ. 16,000, తర్వా త మూడేళ్లు నెలకు రూ.18,000 ఫెలోషిప్ ఇస్తారు. వివిధ సెమినార్లకు హాజరయ్యేందుకు, పరికరాల కొనుగోలుకు ఏడాదికి రూ.20,000 కాంటిన్జె న్సీ గ్రాంట్ కూడా అందిస్తారు. బీఎస్సీ ఉత్తీర్ణులు సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్ వంటి పరీక్షలు రాసుకోవచ్చు. ఇంకా సాధారణ డిగ్రీ అర్హతగా ఉండే అన్ని కొలువుల్లో చేరొచ్చు. సిటీలో పరిశోధన సంస్థలు మెడికల్ హబ్, ఫార్మా హబ్, ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన భాగ్యనగరంలో దాదాపు 100కుపైగా పరిశోధన సంస్థలున్నాయి. వీటిలో అత్యధికం సైన్స్, సంబంధిత పరిశోధన సంస్థలే. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటివి ఉన్నాయి. ఇవేకాకుండా డీఆర్డీవో పరిశోధన సంస్థలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ తదితర సంస్థలు నగరంలోనే కొలువుదీరాయి. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఫర్) కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సంస్థల్లో సైన్స్‌లోని వివిధ విభాగాల్లో ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సైన్స్ కోర్సులతో మంచి కొలువులు ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలున్నాయి. ఇతర కోర్సులతో పోలిస్తే సైన్స్ అభ్యర్థులు బోధనలో, పరిశోధనల్లో ఎక్కువగా రాణిస్తున్నారు. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్ ్స, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, మ్యాథమెటికల్ మోడలింగ్ తదితర విభాగాల్లో సైన్స్ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. తాజాగా మామ్(మార్స్ ఆర్బిటార్ మిషన్) విజయం సైన్స్ నిపుణుల కృషి ఫలితమే. కాబట్టి సైన్స్ నిపుణులు లేని ఏ రంగాన్నీ ఊహించలేం. సెన్సెక్ ్సలోనూ మ్యాథమెటికల్ మోడల్స్ రూపొందించడానికి సైన్స్ నిపుణులు అవసరం. దాదాపు అన్ని యూనివర్సిటీలు సెన్సైస్‌లో యూజీ, పీజీ కోర్సుల నుంచి పీహెచ్డీ కోర్సుల వరకు ఆఫర్ చేస్తున్నాయి. సైన్స్ రంగంలో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర ప్రత్యేక విద్యాసంస్థలూ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. కాబట్టి ఆసక్తికి అనుగుణంగా సైన్స్ కెరీర్‌ను ఎంచుకుంటే మంచి కొలువులు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో అర్హత సాధించి ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థాయి హోదాల్లో చేరొచ్చు. మంచి గణిత, తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్నవారు కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు’’ - డాక్టర్. టి.పార్థసారథి, ప్రొఫెసర్, - ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ -
మలేరియా మాసోత్సవాల జాడేది?
కనిపించని అధికారులు - ప్రజలకు అవగాహన శూన్యం - మరో వారం రోజులే గడువు జమ్మికుంట : వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల నివారణ పేరుతో హడావుడి చేసే అధికారులు ఈసారి కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. జూన్ ఒకటి నుంచి 30 వరకు మలేరియా మాసోత్సవాలుగా ప్రకటించగా, ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. మలేరియా నివారణ కోసం వైద్యశాఖలో ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆవగహనా కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు. మాసోత్సవాలు మొదలై ఇరవై రోజులు దాటినా జమ్మికుంట పట్టణంలో అటు నగర పంచాయతీ అధికారులు, ఇటు వైద్యసిబ్బంది ఎవరూ కూడా వార్డుల్లో మలేరియా నివారణ కోసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాదాపు జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసి.. వాతావరణం మారిన వెంటనే పలు రకాల వ్యాధులు ప్రబలుతున్నప్పటికీ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను విస్మరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా జ్వరాలతో బాధపడుతున్న రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి, వ్యాధి నిర్ధారణ అయితే వైద్యసేవలు అందించాల్సి ఉండగా.. కనీసం శాంపిళ్లు సేకరించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. మురికి కాలువల్లో లార్విసైడ్ మందులను దోమలు వృద్ది చెందకుండా పిచుకారి చేయాలి. కానీ మాసోత్సవాలు చివర దశకు వస్తున్నా అధికారులు మేలుకోకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికే తొలకరి పలకరించడంతో పాటు వాతావరణం చల్లబడింది. దీంతో జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. సర్కారు వైద్యసేవలు అందకపోవడం వల్ల రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యాధులు ప్రబలిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.