పశువుల ఆరోగ్యం.. జర భద్రం! | Jara save the health of the cattle .. ! | Sakshi
Sakshi News home page

పశువుల ఆరోగ్యం.. జర భద్రం!

Published Fri, Sep 16 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

పశువుల ఆరోగ్యం.. జర భద్రం!

పశువుల ఆరోగ్యం.. జర భద్రం!

  • అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
  • చికిత్స కంటే నివారణే మేలు
  • పాకలను శుభ్రంగా ఉంచాలి
  • వైద్యుల సలహాలు పాటించాలి
  • - టేక్మాల్‌ పశువైద్యాధికారి బెంజ్‌మెన్‌ సలహాలు సూచనలు

  • పశువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి అంటువ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి.​ ప్రమాదకరమైన అంటువ్యాధులకు చికిత్సకు బదులు నివారణే ముఖ్యం. వాటిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఏ మాత్రం అనుమానం వచ్చిన వైద్యులను సంప్రదించాలని  టేక్మాల్‌ పశువైద్యాధికారి బెంజ్‌మెన్‌ (సెల్‌: 96630 25553) తెలిపారు. వ్యాధుల నివారణకు పశువైద్యాధికారి సలహాలు, సూచనలు మీకోసం...
    - టేక్మాల్‌

    - గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు రెండింటి నివారణకు రక్షాబయోవ్యాక్‌.. గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటువ్యాధి మూడింటి నివారణకు రక్షట్రయోవాక్‌ పేరుతో ఒకే టీకా లభిస్తుంది.
    - టీకాలను శీతలపరిస్థితిలో భద్రపరచడం, కంపెనీలు నిర్దేశించిన విధంగా మోతాదు వాడడం చల్లని సమయాల్లో టీకాలు వేయడం, ఆరోగ్యమైన పశువులకే వేయడం, బూస్టర్‌ డోసు వేయడం, టీకాలు గ్రామాల్లోని పశుసంపదకంతా సాముహికంగా వేయడం, టీకాలు వేసేప్పుడు సూదులు మార్చడం మొదలగు జాగ్రత్తలు తీసుకుంటే టీకాల వల్ల సత్ఫలితాలుంటాయి.

    - టీకాలు వేసేముందు పశువులకు అంతర పరాన్నజీవుల మందులు తాగిస్తే టీకాలు చక్కగా పని చేస్తాయి.
    సాధారణ వ్యాధులు, అంటువ్యాధులు అంత ప్రమాదకరమైనవి కానప్పటికీ.. పశువుల్లో ఉత్పాదక సామర్థ్యాన్ని హరించివేస్తాయి. అప్పుడప్పుడు ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి.

    ఈ రెండు రకాల అంటు వ్యాధుల నివారణకు ఈ కింది విషయాల్లో రైతాంగం శ్రద్ధవహిస్తే చాలావరకు పశువుల్ని సంరక్షించుకోవచ్చు.
    - వ్యాధిగ్రస్త పశువుల్ని మందనుంచి వేరుచేసి, సత్వరమే చికిత్స చేయించాలి. మిగతా ఆరోగ్యకరమైన పశువులకు వెంటనే టీకాలు వేయించాలి.
    - టీకాలు వేసిన తర్వాత పశువుల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించడానికి 15-20 రోజుల సమయం పడుతుంది. టీకాల్ని వేయడం ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత త్వరగా వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.
    - వ్యాధిగ్రస్త పశువులు తినగా మిగిల్చిన మేత, దాణా, నీళ్లు పశువుల చొంగతో కలుషితమవడం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వాటిని తొలగించాలి. లేదా కాల్చివేయాలి.

    - వ్యాధిసోకి మరణించిన పశు కళేబరాలను సాధారణంగా నీటి ప్రవాహాలు, కాలువలు, కుంటలు, పచ్చికబయళ్లలో పడేయడం వల్ల వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. కళేబరాన్ని లోతైన గొయ్యితీసి పాతిపెట్టాలి. దొమ్మవ్యాధి సోకిన పశువుల్ని మరణించిన చోటే పాతిపెట్టాలి. ఎలాంటి పరిస్థితిలో కోయకూడదు.

    - టీబీ, హెచ్‌ఎస్‌ మొదలగు వ్యాధులు గాలి ద్వారా, శాసద్వారా వ్యాపిస్తాయి. పశువుల్ని పాకల్లో కిక్కిరిసి ఉంచకూడదు. పాకల్లో గాలి, వెంటిలేషన్‌ మెరుగ్గా ఉండేలా నిర్మించుకోవాలి. పశువులకు సరిపోను స్థలం ఉంచాలి.

    - జోరిగలు, దోమలు, గోమార్లు మొదలగు బాహ్యపరాన్న జీవులకాటు ద్వారా సర్రాథ్తేలేరియాసిన్‌ వంటి వ్యాధులు సోకుతాయి. సాయంత్రం వేళల్లో పాకల దగ్గర వేపాకు కాల్చాలి. అప్పుడప్పుడు పశువుల శరీరంపై, పాకల్లో బాహ్యపరాన్న జీవుల నిర్మూలన మందుల్ని పిచికారి చేయాలి. బాహ్యపరాన్నజీవుల బెడద తగ్గడానికి పాకల్లో చెత్త చెదారం లేకుండా, శుచి శుభ్రత పాటించాలి.

    - పశువుల మలమూత్రాల ద్వారా జలగ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. పాకల్ని రోజుకు రెండు సార్లు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేస్తూ పొడిగా ఉంచాలి. మురుగునీరు పారుదల సౌకర్యం బావుండేలా చూసుకోవాలి. పాకలో నేలమీద పొడిసున్నం చల్లుతుండాలి.  

    - మందలోకి వ్యాధి ప్రవేశించకుండా వ్యాధులు సోకిన సమయాల్లో పశువుల్ని అమ్మడం, కొనడం చేయకూడదు. అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో సంతలు మూసివేయాలి. ఒక వేళ కొత్త పశువులను మందలో కలపాలంటే 15 రోజులు విడిగా ఉంచి, ఆరోగ్యంగా ఉందో లేదో పరిశీలించి మాత్రమే పాకల్లో ఉంచాలి.

    - పశువుల్లో వ్యాధులు ప్రబలినప్పుడు సామూహికంగా నీళ్లు తాగడం, మేత తినడం, తిరగడం చేయాకూడదు. పశువులు మేసే బయళ్లను కూడా మారుస్తుండాలి.

    - వర్షపు జల్లులు, వడగాలుల తీవ్రతకు గురవడం వల్ల, చాలాదూరం ప్రయాణించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురై వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి గొంతువాపు వంటి వ్యాధులు సోకుతాయి. పశువుల్ని వాతావరణ తీవ్రత నుంచి సంరక్షించుకోవాలి.

    - పశువులకు పరిశుభ్రమైన, క్లోరినేషన్‌ చేసిన నీటిని అన్నివేళలా తాగేందుకు అందుబాటులో ఉంచాలి. పుష్టికరమైన పశుగ్రాసాలను, దాణాను అందిస్తుండాలి.  

    - రేబిస్, బ్రూసెల్లోసిస్‌ మొదలగు వ్యాధులు పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే స్వభావం కలిగి ఉంటాయి. పశుపోషకులు, పనివాళ్ళు చేతులు, దుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి.
    -

    టీబీ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్స కూడా లొంగని అనుత్పాదక పశువుల్ని పాకల్లో నుంచి తొలగించాలి.

    - బ్రూసెల్లోసిన్, ట్రైకోమోనియాసిస్, ఐబీఆర్‌ మొదలగు వ్యాధులు దున్నలు, ఆంబోతుల సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి. ఆంబోతులు, దున్నల సంపర్కం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
    - మాయ ద్వారా, గర్భకోశస్రవాల ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. మేత కలుషితం అవుతుంది. స్రవాలు పొదుగుకు అంటుకోవడం వల్ల పొదుగు వాపు సమస్య ఉత్పన్నమవుతుంది. పశువుల పాకల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.

    - ఎలుకలు, కుక్కలు, పిల్లులు, పక్షులద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. జంతువులను, పక్షులను దూరంగా ఉంచాలి.

    - కలుషితమైన పాలు, మాంసం ద్వారా కూడా వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయి.  వాటిని బాగా మరగబెట్టి లేదా ఉడికించి మాత్రమే వినియోగించాలి.

    - వాహనాలను, సందర్శకులను పశువుల పాకలోకి అనుమతించకూడదు.

    - పశువులను, దూడలను క్రమపద్ధతిలో డీవార్మింగ్‌ చేస్తుండాలి.

    - రోజూ ఉదయం, సాయంత్రం యజమాని స్వయంగా పశువుల ఆరోగ్యాన్ని పరిశీలిస్తుండాలి.

            


     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement