మలేరియా మాసోత్సవాల జాడేది?
కనిపించని అధికారులు
- ప్రజలకు అవగాహన శూన్యం
- మరో వారం రోజులే గడువు
జమ్మికుంట : వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల నివారణ పేరుతో హడావుడి చేసే అధికారులు ఈసారి కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. జూన్ ఒకటి నుంచి 30 వరకు మలేరియా మాసోత్సవాలుగా ప్రకటించగా, ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. మలేరియా నివారణ కోసం వైద్యశాఖలో ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆవగహనా కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు. మాసోత్సవాలు మొదలై ఇరవై రోజులు దాటినా జమ్మికుంట పట్టణంలో అటు నగర పంచాయతీ అధికారులు, ఇటు వైద్యసిబ్బంది ఎవరూ కూడా వార్డుల్లో మలేరియా నివారణ కోసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
దాదాపు జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసి.. వాతావరణం మారిన వెంటనే పలు రకాల వ్యాధులు ప్రబలుతున్నప్పటికీ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను విస్మరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా జ్వరాలతో బాధపడుతున్న రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి, వ్యాధి నిర్ధారణ అయితే వైద్యసేవలు అందించాల్సి ఉండగా.. కనీసం శాంపిళ్లు సేకరించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు.
గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. మురికి కాలువల్లో లార్విసైడ్ మందులను దోమలు వృద్ది చెందకుండా పిచుకారి చేయాలి. కానీ మాసోత్సవాలు చివర దశకు వస్తున్నా అధికారులు మేలుకోకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు.
ఇప్పటికే తొలకరి పలకరించడంతో పాటు వాతావరణం చల్లబడింది. దీంతో జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. సర్కారు వైద్యసేవలు అందకపోవడం వల్ల రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యాధులు ప్రబలిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.