క్రైం.. కలవరం
అభివృద్ధితో పాటే కొత్తూరులో పెరుగుతున్న నేరాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోని చర్యలు
గతంతో పోలిస్తే రెట్టింపు కేసులు
కొత్తూరు: రాజధానికి అతిచేరువలో అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు మండలం అభివృద్ధితో పాటు క్రైం రికార్డులో కూడా ముందంజలో ఉంది. నేరాలు, ప్రమాదాలు, దొంగతనాలు పెరిగిపోతున్నా యి. వీటి నివారణ కోసం పోలీసులు ఎంతకృషిచేస్తున్నా తగ్గడం లేదు. గతేడాది వివిధ సంఘటనలకు సంబంధించి 247 కేసులు నమోదవగా, ఈ ఏడాది 350 కేసులు నమోదైనట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నారు. మండల పరిధిలో హత్యల పరంపర కొనసాగుతోంది. ఒకప్పుడు గొడవలు పడితే పెద్దల సమక్షంలో పంచాయతీల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే వారు. కాగా, రియల్‌భూమ్ కారణంగా జల్సాలకు అలవాటుపడి కక్షలు పెంచుకుంటున్నారు. గతేడాది జరిగిన నాలుగు హత్యలను పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది జరిగిన ఏడు హత్యకేసుల్లో ఆరింటిని ఛేదించారు. కాగా, ఈ హత్యలు చిన్న చిన్న కారణాలతోనే జరుగుతున్నట్లు క్రైం రికార్డు చెబుతోంది. మండలంలో ఇటీవల కాలంలో హైదరాబాద్ తరహాలో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. దుకాణాల ముందు, ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలను కొట్టేస్తున్నారు. ఈ ఏడాది జవనరి నుండి ఇప్పటివరకు 34 దొంగతనాలు జరిగాయి. సుమారు రూ.15.46లక్షల వస్తువులు, నగలను దోచుకెళ్లారు. పోలీసుల దర్యాప్తులో సుమారు రూ.11.40లక్షలను రికవరీ చేసి దొంగలను రిమాండ్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదాలూ ఎక్కువే
కొత్తూరు మండల కేంద్రం నుండి షాద్‌నగర్ సమీపంలోని సోలీపూర్ గేటు వరకు సుమారు 18 కి.మీ మేర బైపాస్‌రోడ్డును ఏర్పాటుచేశారు. ఈ రోడ్డు విశాలంగా ఉండడంతో వాహనాలు గంటకు 100 నుండి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి. కాగా పలు కూడళ్ల వద్ద అండర్‌పాస్‌లను నిర్మించడం మాత్రం మరి చారు. ఈ కూడళ్ల వద్ద రెప్పపాటులో ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోవ డం పరిపాటిగా మారింది. గతేడాది జనవరి నుండి డిసెంబర్ వరకు జరిగిన 67 ప్రమాదాల్లో 44 మంది వాహనదారులు మృతిచెందగా, 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుండి డిసెంబర్ వరకు కేవలం కొత్తూరు మండలం పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డుపై 84 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 56 మంది మృతిచెందగా, 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీటితో పాటు చిన్నచిన్న ఘటనలు మరెన్నో ఉన్నాయి.
పెరిగిన ఆత్మహత్యలు
ఆత్మహత్యల సంఖ్య చాలా కూడా ఆందోళనకరంగా ఉంది. అమ్మానాన్నలు తిట్టారని, భార్య కాపురానికి రాలేదని, భర్త కొట్టాడనే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 53 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రజల్లో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించడానికి ఇటీవల మండల కేంద్రంలో ఎస్పీ విశ్వప్రసాద్ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది ఎంతమేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
అదుపునకు చర్యలు
నియోజకవర్గ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. దానికి తోడు పట్టణం కూడా విస్తరించింది. దీంతో నేరాలు సైతం పెరుగుతున్నాయి. వాటిని అదుపు చయడానికి రాత్రిళ్ళు గస్తీ పెంచడంతో పాటు సిబ్బందిని కూడా పెంచాం.
- ద్రోణాచార్యులు, డీఎస్పీ