
జాతీయ రహదారులపై మద్యం షాపులు వద్దు
హెల్మెట్‌ధారణ తప్పనిసరి
15 రోజుల్లో కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించండి
108 వాహనం వచ్చే సమయాన్ని తగ్గించాలి
రోడ్డు భద్రతా సమావేశంలో కలెక్టర్ కీలక నిర్ణయాలు
విజయవాడ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను కొనసాగించరాదని ఎక్సైజ్ అధికారులను కోరుతూ జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం తీర్మానించింది. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని ముఖ్య అధికారుల బృందం ఎట్టి పరిస్థితిలోనూ జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు మూసి వేయించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.
కీలక నిర్ణయాలివే..
కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ టోల్‌గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ల ద్వారా డ్రైవర్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదం సంభవించిన సందర్భంలో 108 వాహనం ప్రమాద స్థలాన్ని చేరుకునే సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని, తద్వారా మరణాలను తగ్గించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ధారణ తప్పనిసరని ఆదేశించారు. నీటిపారుదల శాఖ కాలువలు, కరకట్టలపై ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. సంబంధిత వ్యక్తులకు ముందుగా నోటీసులు జారీచేసి 15 రోజుల వ్యవధిలో వాటిని తొలగించాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతకు సంబంధించి 18 అంశాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి పంపించామన్నారు.
వాహనాదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు అతిక్రమించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. నగరంలో 62 ముఖ్య కూడళ్లను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉప రవాణా కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆటో, స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లకు ఈ నెల, వచ్చే నెలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ ఎస్పీ సాగర్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శేషుకుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ రామకృష్ణ, రవాణా అధికారులు పాల్గొన్నారు.