అప్రయత్నంగా మెదడు విశ్రాంతిలోకి వెళ్లడమే హైవే హిప్పోసిస్.. ప్రొఫెషనల్ డ్రైవర్ల కంటే సాధారణ వ్యక్తులపైనే ఈ ప్రభావం ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తేనే ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చిన నిపుణులు చెబుతున్నారు.. ఏమిటీ హైవే హిప్పోసిస్..
సాక్షి, అమరావతి: నాలుగు లేదా ఆరు వరుసల హైవేలు.. మధ్యలో డివైడర్లు ఉండటంతో ముందునుంచి వాహనాలకు ఆస్కారమేలేదు.. ఎక్కడోగానీ మలుపులు లేకుండా నల్లత్రాచులా రోడ్లు.. మరోవైపు, ఆధునిక ఫీచర్లతో కార్లు.. ఏసీతో చుట్టూ చల్లదనం.. ఆడియో సిస్టం నుంచి మంద్రంగా సంగీతం.. దీంతో వేగంగా దూసుకుపోయే కార్లు.. ఇంకేముంది.. పెద్దగా శ్రమలేకుండానే ప్రయాణించవచ్చని అనుకుంటాం. కానీ, ఈ అత్యంత సౌకర్యవంతమైన డ్రైవింగ్ వెనుక ఓ పెనుముప్పు కూడా పొంచి ఉంది. అదే హైవే హిప్పోసిస్ స్థితి. ఇటీవల జాతీయ రహదారులపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలకు ప్రధాన కారణమిదే. తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ స్థితికి గురికాకుండా ఉండగలమని నిపుణులు సూచిస్తున్నారు.
ఏమిటీ హైవే హిప్పోసిస్..
సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనురెప్పలు మూతపడి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. దీనికి హైవే హిప్పోసిస్ కాస్త భిన్నమైంది. పైన చెప్పుకున్నట్లు విశాలమైన హైవేలపై డ్రైవింగ్ సులభంగా మారింది. ఎదురుగా వాహనాలు రావు.. చాలా దూరం వరకు మలుపులు ఉండవు.. దీంతో కొంతదూరం వెళ్లిన తరువాత డ్రైవింగ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే డ్రైవర్ మెదడుకు పెద్దగా పనిఉండదు. ఫలితంగా మెదడు మెల్లగా విశ్రాంతి తీసుకుంటుంది.
ఆటోమేటిక్ వాహనాలైతే గేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి డ్రైవర్ మెదడుకు ఇంకా ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. ఈ స్థితిలో డ్రైవర్ నిద్రపోరు. కళ్లు తెరిచే ఉంటారు. స్టీరింగ్‌పై పట్టు ఉంటుంది. కానీ, పెద్దగా పనిలేకపోవడంతో డ్రైవర్ మెదడు మాత్రం నెమ్మదిగా విశ్రాంతిలోకి జారుకుంటుంది. ఈ స్థితినే హైవే హిప్పోసిస్ అంటారు. సాధారణంగా హైవేపై రెండు నుంచి మూడు గంటలు ప్రయాణం చేసిన తరువాత ఈ స్థితి ఏర్పడవచ్చు. అది కూడా రోజూ సాధారణంగా నిద్రించే సమయంలో ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ స్థితి ఆవహిస్తుంది.
అంటే రాత్రి 10గంటల తరువాత నుంచి తెల్లవారుజాము మధ్యగానీ.. మ.2 గంటల నుంచి 4 గంటల మధ్య హైవేపై ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేటప్పుడు హైవే హిప్పోసిస్ స్థితి ఏర్పడుతుంది. ఇది 5–15 నిముషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో డ్రైవర్‌కు వాహనంపై నియంత్రణ ఉండదు. ఎదురుగా ఏదైనా వాహనాన్ని నిలిపి ఉంచితే చివరి నిముషం వరకు గుర్తించలేక ఢీకొడతారు. ఇలాగే ఎక్కువుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అలాగే, హైవేపై మలుపు వస్తే డ్రైవర్లు చివరి క్షణం వరకు గుర్తించలేరు. కారు రోడ్డు నుంచి పక్కకు వెళ్లిగానీ లేదా డివైడర్‌ను ఢీకొట్టి గానీ పల్టీలు కొడుతుంది. హైవేపై ఏదైనా ఫ్లైఓవర్‌గానీ, బ్రిడ్జ్‌గానీ వస్తే గుర్తించలేక రెయిలింగ్‌ను ఢీకొడతారు. హైవేపై జంక్షన్ల వద్ద రోడ్డుకు అడ్డంగా ఏదైనా వాహనంగానీ వ్యక్తులుగానీ వచ్చినా సరే గుర్తించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రొఫెషనల్ డ్రైవర్ల కంటే కూడా సాధారణ వ్యక్తులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువుగా ఈ స్థితికి గురవుతారు.
60 శాతం ప్రమాదాలకు ఇదే కారణం..
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం హైవే హిప్పోసిస్ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో కూడా హైవే హిప్పోసిస్ కారణంగానే 60 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిçÜ్తున్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నివేదిక తెలిపింది. కోల్‌కత–ఢిల్లీ జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదాలపై ఎన్‌హెచ్‌ఏఐ చేసిన అధ్యయన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిల్లో 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా 3.84 లక్షల మంది గాయపడ్డారు.
తగిన జాగ్రత్తలు పాటిస్తేనే..
హైవే హిప్పోసిస్‌కు గురికాకుండా ఉండేందుకు డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మన రోజువారి పనితీరుకు అనుగుణంగా మన మెదడు అలవాటు పడి ఉంటుంది. రోజూ సాధారణంగా నిద్రకు అలవాటైన సమయంలో డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలి. తప్పనిసరైతే మాత్రం నిపుణుల సూచనలు పాటించాలి.
అవి ఏమిటంటే..
- సాధారణంగా రెండు గంటల డ్రైవింగ్ తరువాత హైవే హిప్పోసిస్ ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి 90 నిమిషాల డ్రైవింగ్ తరువాత డ్రైవర్ బ్రేక్ తీసుకోవాలి.
కిందకు దిగి అటూ ఇటూ నడవాలి. ఎవరికైనా ఫోన్ చెయ్యొచ్చు. కాసేపు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడొచ్చు. దాంతో మెదడు మళ్లీ చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. తర్వాత మళ్లీ డ్రైవింగ్ మొదలుపెట్టొచ్చు.
- గంటసేపు డ్రైవింగ్ తరువాత డ్రైవర్ తనకు తాను కాస్త అసౌకర్యం కలిగించుకోవాలి. కారులో ఏసీని ఆఫ్ చేయలి. దాంతో చెమటలు పడతాయి. కారు అద్దాలు కిందకు దించితే బయట నుంచి వేగంగా గాలి లోపలకి వచ్చి కాస్త చికాకు పెడుతుంది. దాంతో డ్రైవర్ సుఖవంతమైన స్థితి నుంచి బయటకు వచ్చి అసౌకర్యానికి గురవుతారు. దాంతో మెదడు మళ్లీ చురుగ్గా పనిచేస్తుంది.
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్, రియర్ మిర్రర్‌ను మాటి మాటికి చూస్తుండాలి. దాంతో కనుగుడ్లు అటూ ఇటూ తిరుగుతుండటంతో మెదడు చురుకుదనం సంతరించుకుంటుంది.
- ప్రస్తుతం అధునాతన స్లీప్ మోనిటరింగ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కార్లు, వాహనాల్లో వాటిని ఏర్పాటుచేసుకోవాలి. స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్‌ఫోన్లలోనూ ఇవి వస్తున్నాయి. ఇవి సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ శరీరంలో కాసేపు కదలికలు లేకపోతే వెంటనే బీప్ శబ్దంతో అప్రమత్తం చేస్తాయి. దాంతో హైవే హిప్పోసిస్ స్థితి నుంచి వెంటనే బయటకు రావచ్చు.
- రోడ్డుపై దృష్టి సారించలేకపోతున్నామని గుర్తించగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాహనాన్ని నిలిపివేయాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, సురక్షిత దాబాలు, అనివార్యమైతే పెట్రోల్ బంకుల సమీపంలో వాహనాన్ని నిలిపి కాసేపు కునుకు తీయాలి. అనంతరం నిద్రలేస్తే మెదడు మళ్లీ చురుగ్గా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment