మనోళ్లు ‘మామూలోళ్లే’! | Nizamabad Excise Officials Have Allegations Over Accepting Bribe | Sakshi
Sakshi News home page

మనోళ్లు ‘మామూలోళ్లే’!

Published Fri, Oct 11 2019 9:02 AM | Last Updated on Fri, Oct 11 2019 9:02 AM

Nizamabad Excise Officials Have Allegations Over Accepting Bribe - Sakshi

నిజామాబాద్‌ నగరంలో హైదరాబాద్‌ రోడ్డులోని వంశీ వైన్స్, ద్వారకామాయి వైన్స్‌లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) బృందం శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఎక్కడో హైదరాబాద్‌ నుంచి వచ్చి ఇక్కడ కేసులు నమోదు చేస్తుంటే.. మరి జిల్లాలోని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు..?

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ఎక్సైజ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే అధనంగా వసూలు చేస్తున్నారు. అయినా జిల్లా ఎక్సైజ్‌ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎంతైనా వాళ్లు కూడా ‘మామూలోళ్లే’ కదా! అందుకే అధికారులు, సిబ్బంది కార్యాలయాలకే పరిమితమయ్యారు. అయితే, పైనున్న వారు వీళ్లలా ‘మామూలు’ అధికారులు కారు కదా..! జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, క్షేత్ర స్థాయిలో పూర్తి బలగం ఉన్న జిల్లా ఎక్సైజ్‌ యంత్రాంగం ఎందుకు దాడులు చేయలేదనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జిల్లాలో ఐదు ఎక్సైజ్‌ స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్‌లో సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. నిజామాబాద్‌ స్టేషన్‌లో అదనంగా మరో ఎస్సై, వీటికి తోడు అసిస్టెంట్‌ కమిషనర్‌ నేతృత్వంలోని ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఉంది. దీనికి అదనంగా మరో టాస్క్‌ఫోర్స్‌ విభాగం పని చేస్తోంది. ఇవి కాకుండా ఓ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం, ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ఉంది. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి బహిరంగంగా  అడ్డ్డగోలుగా రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతుంటే, ఇంత యంత్రాంగం ఉన్న ఎక్సైజ్‌శాఖ ఏం చేసినట్లు? కేవలం వారికి వచ్చే మామూళ్ల వసూళ్లకే పరిమితమయ్యారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 

దసరా వరకు దండుకున్నారు.. 
మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్సుల్లో క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 వరకు ధర పెంచేసి అడ్డుగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఇలా ఒక్కో రోజు రూ.లక్షల్లో దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పది రోజుల్లో రూ.కోట్లలో వెనకేసుకున్నారు. నెల వారీగా లైసెన్సు ఫీజు భారమవుతోందంటూ హడావుడి చేసిన మద్యం వ్యాపారులు చివరి నెల అందిన కాడికి దండుకుంటున్నారు. వీరితో జిల్లాలోని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు చేతులు కలపడంతో దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ క్రమంలో మందు బాబుల జేబులకు చిల్లు పడింది. జిల్లా వ్యాప్తంగా 95 వైన్సులుంటే దాదాపు అన్ని వైన్సులు దసరా వరకు ఎమ్మార్పీ నిబంధనలను ఉల్లంఘించారు. దసరా తర్వాత కూడా కొన్ని వైన్సుల్లో యథేచ్ఛగా ఎమ్మార్పీ నిబంధన ఉల్లంఘన జరుగుతోంది. 

కొత్త లైసెన్సుల సిండికేట్‌కు బాటలు.. 
నవంబర్‌ ఒకటో తేదీ నుంచి కొత్త వైన్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ఎక్సైజ్‌ ఉ న్నతాధికారుల తాజా నిర్వాకం కారణంగా కొత్త వైన్సులు ప్రారంభమయ్యాక కూడా సిండికేట్‌ దోపిడీ కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో ఇలాగే వ్యవహరిస్తే మద్యం దోపిడీ యథేచ్ఛగా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

కేసులు సైతం తారుమారు.. 
నవ్వి పోదురుగానీ నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది ఎక్సైజ్‌ అధికారుల పనితీరు. మూడు నెలల క్రితం ఓ కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద లంచం డిమాండ్‌ చేస్తూ ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ను కూడా తనిఖీ చేశారు. కేసులను తారుమారు చేసేందుకు ఏ ఒక్క రికార్డును కూడా నమోదు చేయలేదని ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అయితే, ఈ స్టేషన్‌లో ఉండాల్సిన జనరల్‌ డైరీ, ఈ–2 రిజిస్టర్, కాంట్రవన్‌ రిజిస్టర్‌లను ప్రతిరోజు నమోదు చేయాల్సి ఉండగా, వారం రోజులుగా పెండింగ్‌లో పెట్టినట్లు తేటతెల్లమైంది. ఈ అడ్డగోలు వ్యవహారంపై ఏసీబీ ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర కమిషనరేట్‌కు, రాష్ట్ర విజిలెన్స్‌ విభాగానికి నివేదిక ఇచ్చింది. కానీ దానిపై ఇప్పటివరకు రాష్ట్ర ఎక్సైజ్‌ అధికారులు కనీస చర్యలు తీసుకోక పోవడంతో ఇలాంటి అడ్డగోలు దందాలు యథేచ్చగా కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మాకు ఫిర్యాదు అందలేదు.. 
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు మాకు ఒక్కరు కూడా ఫిర్యాదు చేయక పోవడంతో జిల్లా ఎక్సైజ్‌ అధికార యంత్రాంగం కేసులు నమోదు చేయలేక పోయింది. హైదరాబాద్‌కు ఫిర్యాదులు చేస్తే హైదరాబాద్‌ టీం వచ్చి కేసులు చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు మద్యం విక్రయాలు ఆపేశారు. 
– డేవిడ్‌ రవికాంత్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement