ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధర పెంపు
టన్నుకు రూ. 300 అధికం
విశాఖ ఉక్కుపై మరింత భారం
విశాఖపట్నం: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను టన్నుకు రూ. 250 నుంచి 300 వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఉక్కు సంస్థలకు షాక్ తగిలింది. ఈ నిర్ణయం సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్ వంటి ఉక్కు సంస్థలపై అధిక భారాన్ని కలిగించనున్నది. ఉక్కు ఉత్పత్తిలో అత్యధికంగా వినియోగించే లంప్ ఐరన్‌ఓర్‌పై రూ. 300, తక్కువ గ్రేడు ఫైన్ ఐరన్‌ఓర్‌పై రూ. 250 పెంచుతూ జూన్ మొదటి వారంలో సంస్థ నిర్ణయం తీసుకున్నది.
పెంపు నిర్ణయం వల్ల ఇప్పటి వరకు ఉన్న టన్ను లంప్ ధర రూ. 4300 నుంచి రూ. 4600కు, ఫైన్ ధర రూ. 2910 నుంచి 3160 ధర పెరిగింది. ప్రతి నెలా ధరలను సమీక్షించే ఎన్ఎండీసీ ఫిబ్రవరిలో ఫైన్స్‌పై రూ. 100 పెంచింది. ఇటీవల ఒడిశాలో మైనింగ్‌పై తాత్కాలిక బ్యాన్‌ను అవకాశంగా తీసుకుని ఎన్ఎండీసీ ధర పెంచినట్టు మార్కెట్ వర్గాల సమాచారం. ఏప్రిల్ మొదట్లో అంతర్జాతీయ ఐరన్‌ఓర్ ధరలు 20 శాతం తగ్గడంతో దేశీయంగా ఉక్కు ధరలు తగ్గించాల్సి వచ్చింది.
ఈ పరిస్థితుల్లో ఎన్ఎండీసీ ధరలు పెంచడంపై ఉక్కు పరిశ్రమ వర్గాలు విస్తుపోతున్నాయి. ఈ పరిణామంవల్ల సొంత గనులులేని విశాఖ స్టీల్, ప్రైవేటు సంస్థలైన ఎస్సార్, జేఎస్డబ్ల్యూలపై తీరని భారం పడనున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్ 6.3 మిలియన్ టన్నులకు ఉత్పత్తికి అవసరమయ్యే రెండింతల ఐరన్‌ఓర్ ధరకు సుమారు రూ. 380కోట్లు భారం పడనున్నదని ప్లాంటు వర్గాల సమాచారం.