ఇసుక తిప్పలు
బాన్సువాడ: ఇసుక క్వారీలకు అనుమతి లేదంటూ పలువురు కాంట్రాక్టర్లు కృత్రిమ కొరతను సృ ష్టించి ఇసుక ధరలను పెంచేశారు. దొడ్డిదారిన , అక్రమంగా రోజూ వందలాది లారీల ఇసుకను మంజీరా నుంచి తోడుతున్నా, ఇసుక కొరత ఉందంటూ వీరు నిర్మాణదారులను దోచుకొంటున్నారు. మంజీరా తీర ప్రాంతంలోని బిచ్కుంద మండలం హస్గుల్, షెట్లూర్, వాజిద్నగర్, పిట్లం మండలంలోని మద్దెల్‌చెరు, బాన్సువాడ మండలం చింతల్ నాగారం, బీర్కూర్ మండలం కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మండలం హంగర్గ, పోతంగల్ తదితర ప్రాంతాల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలలో ఇసుక తరలి వెళ్తోంది.
ఇసుక రవాణాకు అనుమతి లేకున్నా పలువురు కాంట్రాక్టర్లు ఇందిరమ్మ ఇండ్లకు, ప్రభుత్వ పనుల కోసమంటూ నకిలీ అనుమతులు తీసుకొని యథేచ్ఛగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూటే ఈ దందా నిరాటంకంగా కొనసాగుతున్నా పట్టించుకున్నవారు మాత్రం లేరు. ఇసుకను నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, హైదరాబాద్‌కు సై తం రవాణా చేస్తున్నారు. బాన్సువాడలోని పలు ప్రాంతాలలో ఇసుక డంపులు ఉన్నాయి. కనీసం 50 నుంచి 100 లారీల ఇసుకను నిలువ చేసి, అక్కడి నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా నిర్మాణదారులకు సరఫరా చేస్తున్నారు.
అనధికారికమే
ఇసుక క్వారీలు, పట్టాదారులు ఇసుకను తరలించకుండా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం అనుమతులను నిలిపివేసింది. అయినా, రెవెన్యూ అధికారులు, పోలీసుల తో మిలాఖాత్ అయిన కాంట్రాక్టర్లు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలలో వీరు దళారులను ఏర్పాటు చేసుకొని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. నిర్మాణదారులు ప్రశ్నిస్తే ఇసుక క్వారీలకు ప్రభుత్వ అనుమతి లేదని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని అంటున్నారు. మరో వైపు మంజీరా నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభమైనందున ధరలు తగ్గుతాయని ఇటు అధికారులు, అటు నిర్మాణదారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.
నిలిచిన నిర్మాణాలు
ఇసుక లేకపోవడంతో నాలుగు నెలలుగా అనేక నిర్మాణాలు నిలిచిపోయాయి. గతంలో పట్టణ పా్రంతాలలో ట్రాక్టర్ ఇసుక సీనరేజి, రవాణాతో కలిపి రూ.1,350కి వచ్చేది. చిన్న చిన్న పాయింట్ల నుంచి తీసుకువచ్చే ఇసుక రూ. 800 నుంచి 1200 వరకు లభించేది. నాటి ధరలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుతం క్వారీల లో ట్రాక్టర్ ఇసుకను రూ. రెండు వేల నుంచి రూ. మూడు వేల వరకు విక్రయిస్తున్నారు. పనులు నిలిపివేసిన యజమానులు చేసేదేమీ లేక అదే ధరకు కొనుగోలు చేస్తున్నారు.
అధికారులు కల్పించుకొంటే ధర తగ్గుతుందని మరికొందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల ఉదాసీనత కూడా వ్యాపారులకు కలి సొచ్చింది. కాంట్రాక్టర్లే ధరను పెంచారని బ్రోకర్లు చెబుతుండగా, కాదు బ్రోకర్లే పెంచారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఏది నిజమో తెలియని నిర్మాణదారులు గంద రగోళానికి గురవుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు తప్పవని యజమానులు ఆందోళన చెందుతున్నారు. నిజాంసా గర్ ప్రధాన కాలువ ఆధునికీకరణ నిమిత్తం ఇసుక తరలింపునకు ప్రభుత్వం అనుమతినివ్వగా, కాంట్రాక్టర్లు దీన్ని ఆసరాగా చేసుకొని ఇసుకను విక్రయిస్తున్నట్లు ఆరోప ణలు వస్తున్నాయి.
పెరుగుతున్న సమస్యలు
ఇసుక తరలింపుతో గ్రామాలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మంజీరా తీర ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వంద అడుగుల వరకు బోరుబావులు తవ్వినా నీళ్లు పడడం లేదని రైతులు వాపోతున్నారు. మంజీరా నుంచి ఇసుక తరలిపోతే చాలా బోర్లు ఎండిపోతాయి. పొలాలు బీడులుగా మిగిలి పోతాయి. డీఫ్లోరైడ్ పథకాలు వట్టి పోతాయి. పరిమితికి మించి 40 టన్నుల లోడ్‌తో లారీలు వెళ్తే కోట్లాది రూపాయలతో నిర్మించిన బీటి రోడ్లు, సీసీ రోడ్లు శిథిలమైపో తాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.