పూజారి కుమారుడిది హత్యే !
బలమైన ఆయుధంతో దాడి
పరారీలో అనుమానితులు
జాతర పనుల కమీషన్లే కారణం
పోస్టుమార్టం నివేదికలో
వెల్లడైన అంశాలు
సాక్షి, హన్మకొండ : మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మయ్య పెద్ద కుమారుడు ఆనందరావును పథ కం ప్రకారమే హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య చేసిన అనంతరం తప్పించుకునేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు, పోలీసుల విచారణలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
జూలై 16న
పూజారి సిద్ధబోయిన లక్ష్మయ్య పెద్దకొడుకు సిద్ధబోయి న ఆనందరావు ఈనెల 16వ తేదీన పస్రాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి తొమ్మిది గంటల కు భార్య ఉషారాణికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు తెలిపినా ఇంటికి రాలేదు. మరుసటి రోజు 17న నార్లాపూర్ దా టిన తర్వాత రోడ్డు పక్కన మృతదేహమై కనిపించాడు. రోడ్డు పక్కన బైక్ పడిపోయిన ఉండడం, తలకు బల మైన గాయం కనిపించడంతో రోడ్డు ప్రమాదమే మృతి కి కారణమని తొలుత భావించారు. అయితే, ఆనందరావు మృతిపై అనుమానమున్నట్లు ఆయన భార్య ఉషారాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.
బలమైన గాయాలు
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సిద్ధబోయిన ఆనందరావు రోడ్డు ప్రమాదంలో కాకుండా బలమైన గాయాల కారణంగా మృతి చెందినట్లుగా పోస్టుమార్టం నివేదిక వచ్చింది. మృతుడి ఛాతి, కడుపు, పొత్తికడుపు, మర్మాంగాలపై తీవ్రమైన దెబ్బలు తగలడం వల్ల మరణం సంభవించినట్లు తెలుస్తుంది. దెబ్బల తీవ్రతను బట్టి బలమైన ఆయుధంతో ఆనందరావుపై నిందితులు దాడి చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాల ఆధారంగా పోలీసులు హత్య కోణంలో విచారణ వేగవంతం చేశారు. మృతుడి మొబైల్ ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అనుమానితుల జాబితా రూపొందించారు. అనంతరం అనుమానితుల విచారణ కోసం తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి పోలీసులు గురువారం వెళ్లగా.. ముందుగానే పసిగట్టిన అనుమానితుడు గ్రామం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.