priest murder
-
పూజారి దారుణ హత్య
తమిళనాడు, అన్నానగర్: అయ్యలూర్ సమీపంలో మంగళవారం పూజారిని దారుణంగా నరికి హత్య చేశారు. దిండుక్కల్ జిల్లా వడమదురై సమీపంలోని అయ్యలూర్ నయినాన్కులత్తుపట్టికి చెందిన ముత్తుస్వామి (60) అదే ప్రాంతంలోని ఓ ఆలయంలో పూజారిగా ఉంటున్నాడు. భార్య వసంత, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముత్తుస్వామి, నాచ్చి అనే మహిళను రెండో వివాహం చేసుకుని వడమదురై – తిరుచ్చి రోడ్డులో ఉన్న మందైకులం ప్రాంతంలో నివసిస్తున్నాడు. సోమవారం ముత్తుస్వామి నయినాన్కులత్తుపట్టికి వెళ్లాడు. మొదటి భార్య కుమారులు పాండిరాజన్ (27), వీరమణి (26) ఆస్తిని విభజించి ఇవ్వమని ముత్తుస్వామిని అడిగారు. ఈ క్రమంలో తండ్రీ కుమారుల మధ్య తగాదా ఏర్పడింది. స్థానికులు సర్ది చెప్పి ముత్తుస్వామిని పంపించారు. మంగళవారం మందైకులం ప్రాంతంలో ముత్తుస్వామి నరికిన గాయాలతో మృతి చెంది కనిపించాడు. స్థానికులు వడమదురై పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ శివకుమార్ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ముత్తుస్వామి కత్తితో నరికి హత్య చేసినట్లు తెలిసింది. ఆస్తి విభజించి ఇవ్వకపోవడం వల్ల మొదటి భార్య కుమారులే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణ చేస్తున్నారు. -
గురుద్వారా పూజారి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం
న్యూఢిల్లీ: ఆజాద్పూర్లోని గురుద్వారా ప్రధాన పూజారి హత్య కేసులో మహిళ సహా నలుగురికి ఢిల్లీ కోర్టు గురువారం యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. రాజధానితో సహా పలు నగరాల్లో ఉన్న గురుద్వారాలపై పట్టు కోసం జరుగుతున్న వివాదాల నేపథ్యంలో నేరస్తులు ఈ హత్యకు ఒడిగట్టారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఆజాద్పూర్లోని ‘రబ్దా కుట్టా’ గురుద్వారాలో బాబా లఖ్బీర్ సింగ్ ప్రధాన పూజారి(మహంత్)గా నియమితులయ్యారు. తనను బలవంతంగా తప్పించి లఖ్బీర్ను ఆ పదవిలో కూర్చోబెట్టారని ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జస్బీర్ కౌర్(42) అవమానంగా భావించింది. మృతుడు, నిందితురాలు ఇద్దరూ ‘బుద్ధా దళ్’లో రెండు వేర్వేరు వర్గాలకు చెందినవారు. దాంతో లఖ్బీర్ను ఎలాగైనా హత్యచేయాలని జస్బీర్ పథకం పన్నింది. ఆమెకు ఆమె కుమారుడు మల్కిత్ సింగ్(22)తో పాటు సుఖ్పాల్ సింగ్(28), రంజిత్ సింగ్(22) సహకరించారు. కాగా, లఖ్బీర్ సింగ్ కుటుంబం పంజాబ్ వెళ్లడంతో 2010 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో గురుద్వారాలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో నలుగురు నిందితులు గురుద్వారాలోకి ప్రవేశించి అతడికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని 24 గంటల పాటు గురుద్వారా స్టోర్రూంలోనే ఉంచారు. ఆ సమయంలో మృతదేహాన్ని తగలబెట్టడానికి సైతం వారు యత్నించారు. కాగా, మరుసటి రోజు రాత్రి నిందితులు మల్కిత్, సుఖ్పాల్, జస్బీర్ మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి తిమర్పూర్ సమీపంలోని కాలువలో విసిరేశారు. కేసు పూర్వాపరాలు విచారించిన అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కామిని నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
నెల్లూరు జిల్లాలో పూజారి హత్య.. హుండీ దోపిడీ
నెల్లూరు సమీపంలోని చెముడుగుంటలో దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. వెంకటాచలం మండల పరిధిలో ఉన్న ఈ గ్రామంలోని చింతాలమ్మ ఆలయంలోకి ఆదివారం తెల్లవారుజామున చొరబడిన దోపిడీ దొంగలు.. అక్కడున్న పూజారిని హత్యచేసి, హుండీని ఎత్తుకెళ్లిపోయారు. ఇటీవలి కాలంలో ఆలయాల్లో దోపిడీలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ దోపిడీలు జరుగుతున్నాయి. అయితే, ఏకంగా పూజారిని చంపి మరీ హుండీ ఎత్తుకెళ్లడం మాత్రం ఇటీవల ఎక్కడా లేదు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.