జడ్జీల నియామకం మాటేదీ?
ప్రధాని ప్రసంగంపై సీజేఐ అసంతృప్తి
* దేశ ప్రజల న్యాయం గురించి ఆలోచించాలని మోదీకి సూచన
న్యూఢిల్లీ: పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ జడ్జీల నియామక అంశాన్ని ప్రస్తావించకపోవడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్(సీజేఐ) టి.ఎస్. ఠాకూర్ పెదవి విరిచారు. ‘ప్రజాకర్షణగల ప్రధాని గంటన్నరపాటు చేసిన ప్రసంగాన్ని విన్నాను. జడ్జీల నియామకాన్నీ ప్రస్తావిస్తారని ఆశించా. ప్రధానికి ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. మీరు పేదరికాన్ని నిర్మూలించండి. ఉపాధి కల్పించండి...పథకాలు ప్రవేశపెట్టండి. అదే సమయంలో దేశ ప్రజల న్యాయం గురించీ ఆలోచించండి’ అని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో సీజేఐ అన్నారు.
వృత్తిరీత్యా తాను అత్యున్నతస్థాయికి చే రుకున్నందు వల్ల...ఇక జీవితంలో ఆశించేది ఏమీ లేనందువల్ల నిర్మొహమాటంగా నిజం మాట్లాడుతున్నానన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చే శారు.
కోర్టులపై ఎన్నో రెట్లు పనిభారం...
కేసుల సంఖ్య పెరగడంతో కోర్టులపై పనిభారమూ ఎన్నో రెట్లు పెరిగిందని, దీంతో సత్వర న్యాయం అందించలేకపోతున్నామని సీజేఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఓ ఉర్దూ ద్విపదను ఉటంకించారు. ‘గుల్ ఫేంకే ఔరో పర్, సమర్ భీ...ఏ అబర్-ఏ కరమ్, ఏ బెహర్-ఎ-సఖా...కుచ్ తో ఇధర్ భీ’(నువ్వు ఇతరులకు పండ్లు, పూలు ఇచ్చావు...ఓ కృపా మేఘమా, స్నేహ కెరటమా...మాపైనా ఏదో ఒకటి వర్షించు) అని పేర్కొన్నారు. హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, జడ్జీల బదిలీలు, నియామకాల్లో కొలీజియం నిర్ణయాన్ని కేంద్రం అమలు చేయకపోవడాన్ని సీజేఐ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తప్పుబట్టిన నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సీజేఐ సూచనను మోదీ పట్టించుకోవాలని కాంగ్రెస్ సూచించింది.