‘కారే రాజులు...’
జీవన కాలమ్
ప్రజాధనాన్నీ, కోట్లాది ప్రజల విశ్వాసాన్నీ కొల్లగొట్టిన చర్లపల్లి జైల్లో 4148 నంబరు ఖైదీ కథ ఈ దేశపు విలువలు ఎంత పతనమయ్యాయో చెప్పక చెప్తుంది. ప్రజల విశ్వాసాన్ని డబ్బు చేసుకున్న వ్యాపారి, పదవిని డబ్బు చేసుకుంటున్న చాలా మంది వ్యాపారుల చరిత్రలకి అద్దం పడుతున్నారు.
‘సత్యం’పేరిట కార్పొరేట్ రంగంలో జరిగిన ‘అసత్యం’ ఈ దేశంలో, బహుశా ప్రపం చంలోనే చరిత్ర. అవినీతిలో నీతి ఏమి టంటే ‘నేను పులి మీద స్వారీ చేయాలని ప్రయత్నించాను. అది నన్ను కబళించ కుం డా ఎలా దిగాలో తెలియక’ అని ఒప్పుకుంటూ రామలింగరాజుగారు బయట పడ్డారు. 7,123 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఏడేళ్ల జైలుశిక్షను సంపాదించుకున్నారు.
సాలీనా 65 దేశాలలో రెండున్నర బిలియన్ డాలర్ల వ్యాపారం చేసి 53 వేల సిబ్బందితో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ‘సత్యం’ సంస్థ అధిపతి, ఒకనాడు గర్వంగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సరసన కూర్చుని తెలుగువారికి గర్వకారణ మైన రామలింగరాజు ఇవాళ తొమ్మిది మంది అనుయాయులతో చర్లపల్లి జైలుకి తరలిపోయారు. ఆయన అస్తిత్వం ఇప్పుడు ఖైదీ నంబర్ 4148.
‘కారే రాజులు..’ అన్నమాటలు అసురపతి బలి చక్రవర్తివి. అసుర వంశంలో దైవత్వ లక్షణాలున్న ఒక మహానుభావుడి ఉవాచ. 58 సంవత్సరాల కిందట, నేను ఆనర్స్ చదువుతుండగా చూసిన ఒక గొప్ప సినిమా ఇంకా మరచిపోలేదు. రాడ్ స్టీగర్ నటించిన ‘ఎక్రా స్ ది బ్రిడ్జ్’. ఓ గొప్ప వ్యాపారి అదుపులో పెట్టలేని వ్యాపారం చేశాడు. సినిమాలో అతని పరిచయం వంద రెట్లు పెద్ద ఫొటో ముందు పిపీలికం లాగా కనిపించే వ్యాపారి. పులిని దిగ లేక దేశం నుంచి పరారై మరో వ్యక్తిగా మారిపోయాడు, రైలు ప్రయాణంలో. ఆ ‘మరో’ వ్యక్తి తనతో ఓ కుక్కని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడది ఈ కొత్త యజమానికి దక్కింది. ఓ విశ్వాస ఘాతకుడికి, విశ్వాసానికి మారుపేరయిన కుక్క స్నేహితుడు. ఇద్దరూ దేశం ఎల్లలు దాటారు. జీవితంలో పులిస్తరాకులు తినే స్థితికి వచ్చారు. ఈ దేశం అధికా రులు ఇతన్ని తమ దేశంలోకి రప్పిస్తే కాని అరెస్టు చేయలేరు. కుక్కని దొంగతనం చేసి, దేశపు ఎల్లలకి ఇటుపక్క కట్టేశారు. కోట్ల దోపిడీకి దేశాన్ని కొల్లగొట్టిన వ్యాపారి ఆ కుక్క కోసం ఎల్లలు దాటాడు. అధికారులు వెంటదరిమారు. కుక్కా, వ్యాపారీ పరాయి దేశం వైపు పరుగు తీశారు. అధికారులు తుపాకీ కాల్చారు. దేశపు సరిహద్దు గీత మీద అతనూ, కుక్కా శవాలయి కూలి పోయారు. 58 ఏళ్లు మనసులో నిలిచిన కథ ఇది. ఎక్కిన పులికంటే ఎక్కాలన్న మనస్తత్వం మనిషిని పత నానికి దారి తీయిస్తుంది.
108 సంవత్సరాల కిందట ఒక పార్శీ వ్యాపారి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి ఉక్కు అవస రమని గుర్తించి, దేశంలో మొదటి ఉక్కు కర్మాగారాన్ని స్థాపించి, దేశానికి ఉపకారం చేసి లాభాన్ని వినియో గించుకున్నాడు. ఆయన పేరు జంషెడ్జీ టాటా. ఆయన పేరిట ఇవాళ ఒక నగరమే ఉంది. ఆయన వారసుడికి స్వతంత్ర భారత ప్రభుత్వం ‘భారతరత్న’ ఇచ్చి సత్క రించింది. ఒక వ్యాపారికి భారతరత్న గౌరవాన్ని ఇవ్వ డం ఒకే ఒక్కసారి. ‘‘ఆలోచన, ఆచరణలో అప్పటి సమాజానికి అనువయిన దారిలో ప్రయాణం చెయ్య డం, అదీ ఒక మార్గదర్శి, ఒక వైతాళికుని దృష్టి. దాన్ని సామాజికమన్నా, భౌతికమన్నా, ఆధ్యాత్మికమన్నా ఆ లక్ష్యాన్ని నిర్దేశించిన ధైర్య సాహసాలున్న వ్యాపారి జంషెడ్జీ టాటా. ఆధునిక భారత నిర్మాణ వ్యవస్థాపకులలో ఒకరుగా ఆ కార ణానికే ఆయనకి మన నివాళులర్పించాలి’’ అన్నారు ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.
మరొకాయన తను ప్రారంభించిన వ్యాపారంలో లాభాలను తన సిబ్బందితో పంచుకున్నారు. ఆయన పేరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. పై రెండు ఉదాహరణల కూ బంధుత్వం ఉంది. నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఒకప్పుడు జేఆర్డీ టాటా కం పెనీలో పనిచేశారు. సత్సంప్రదాయం వారసత్వం. వ్యాపారం పులి మీద స్వారీ కాదు. అసుర వంశంలో పుట్టిన ఒక వ్యక్తి మహనీయత అతన్ని చిరస్మరణీయు ణ్ణి చేసింది. ఒక పార్శీ వ్యాపారి దార్శనికత అతన్ని భారతరత్నను చేసింది. ‘సత్యం’ను తాకట్టు పెట్టని ‘అసత్యం’ కథ బలి చక్రవర్తిది పురాణం. ‘సత్యం’ను తాకట్టు పెట్టిన ‘సత్యం’ కథ ఈనాటి వాస్తవం.
ప్రజాధనాన్నీ, కోట్లాది ప్రజల విశ్వాసాన్నీ కొల్ల గొట్టిన చర్లపల్లి జైల్లో 4148 నంబరు ఖైదీ కథ ఈ దేశపు విలువలు ఎంత పతనమయ్యాయో చెప్పక చెప్తుంది. ప్రజల విశ్వాసాన్ని డబ్బు చేసుకున్న వ్యాపారి, పదవిని డబ్బు చేసుకుంటున్న చాలా మంది వ్యాపారుల చరిత్ర లకి అద్దం పడుతున్నారు. ప్రస్తుతం చాలామంది నేతల అడ్రసులూ చర్లపల్లి జైలుకి బదలీ కావడాన్ని మనం వింటున్నాం.
‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే వారేరీ...!!!’ అన్న నీతి ఒంట బట్టడానికి కూడా సంస్కారం కావాలి. ప్రహ్లాదుడి జీన్స్ బలి చక్రవర్తిలో ఉన్నట్టే, జంషెడ్జీ జీన్స్ జేఆర్డీ టాటాలోనూ ఉన్నాయి. కానీ మనం మహాత్ముడు, లాల్ బహదూర్‌శాస్త్రి, టంగుటూరి జీన్స్‌ని ఎక్కడో తాకట్టు పెట్టేశాం.