లక్ష్యం 350 కిమీ.. మరోసారి పృథ్వీ-2 సక్సెస్!
బాలాసోర్: దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్‌లోని టెస్ట్ రేంజ్లో ఆర్మీ రెండుసార్లు ఈ క్షిపణీని వెంటవెంటనే పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఢీకొనగలదు. 500, వెయ్యి కిలోల వార్‌హెడ్స్ మోసుకెళ్లగలుతుంది. ఇప్పటికే ఈ క్షిపణికి సంబంధించి ఇలాంటి పరీక్షలు రెండింటిని 2009 అక్టోబర్ 12న విజయవంతంగా నిర్వహించారు.
ఇప్పటికే ఉత్పత్తి చేసిన క్షిపణుల్లో ర్యాండమ్‌గా పృథ్వీ-2 క్షిపణిని ఎంచుకొని పరీక్షలు నిర్వహించారు. స్ట్రాటెజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ఎఫ్ఎస్), డీఆర్డీవో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ కసరత్తులో భాగంగా ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.