ఆభరణాలపై అప్పు చెల్లించాలని నోటీస్
మెదక్ రూరల్: వ్యవసాయ సాగు కోసం బంగారు ఆభరణాలను బ్యాంకులో కుదువ పెట్టి తీసుకున్న అప్పును వెంటనే చెల్లించాలని రైతుకు ఓ ప్రైవేట్ బ్యాంకు అధికారులు నోటీస్ పంపించారు. మెదక్ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామానికి చెందిన మీసాల మల్లయ్య అనే రైతు గత సంవత్సరం మార్చిలో మెదక్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో బంగారు ఆభరణాలు కుదువ పెట్టి వ్యవసాయ సాగు కోసం రూ. 20 వేలను అప్పుగా తీసుకున్నట్లు బాధిత రైతు తెలిపారు.
కాగా తీసుకున్న అప్పును వెంటనే చెల్లించాలని లేనట్లయితే నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారి తనకు నోటీస్ పంపించారని ఆయన వాపోయారు. ప్రభుత్వం ఓ వైపు బంగారు ఆభరణాలపై సైతం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని చెబుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు నోటిస్ పంపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.