పరుల‘పాలు’ కాకుండా...
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకిస్తున్న ప్రోత్సాహక సొమ్ము పక్కదారి పడుతోంది. దీంతో ప్రోత్సాహానికి కొన్ని షరతులు వర్తింపజేయాలని సర్కారు యోచిస్తోంది. గత ఏడాది నవంబర్ నుంచి పాడి రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహక సొమ్ము ఇస్తున్నారు. అయితే కొందరు ప్రైవేటు డైయిరీ వ్యాపారులు అక్రమంగా దీన్ని ఎగురేసుకుపోతున్నారన్న విషయం వెలుగు చూసింది. దీంతో ప్రోత్సాహక సొమ్ము ఇతరులకు చేరకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని, కొత్తగా మరికొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని సర్కారు నిర్ణయించింది.
గత ఏడాది ప్రోత్సాహకమిస్తూ జారీచేసిన జీవోకు, అనంతరం విడుదల చేసిన మార్గదర్శకాలకు మధ్య కొద్దిపాటి తేడా ఉంది. జీవోలో సన్నచిన్నకారు రైతులకే ప్రోత్సాహక సొమ్ము ఇవ్వాలని పేర్కొనగా... మార్గదర్శకాల్లో రైతులు ఎవరైనా అని పొందుపరిచారు. దీంతో ప్రోత్సాహక సొమ్ము నిజమైన రైతులకే కాకుండా ప్రైవేటు డెయిరీ ఫారాలకూ చేరింది. ఈ నేపథ్యంలో దీన్ని సన్నచిన్నకారు పాడి రైతులకే వర్తింప చేయాలంటూ పశుసంవర్థకశాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. ఇప్పటికే ప్రైవేటు డెయిరీ ఫారాల నుంచి పాలు తీసుకుంటున్నా వాటికి ప్రోత్సాహకాన్ని నిలిపివేశారు.
భారాన్ని తగ్గించే యోచన
ప్రోత్సాహకం ప్రారంభమైనప్పటి నుంచి విజయ డెయిరీ పాల సేకరణ భారీగా పెరిగింది. ప్రోత్సాహక ఉత్తర్వులు రాకముందు గత ఏడాది అక్టోబర్లో 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వుల అమలు ప్రారంభమైన గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు ఏడాది కాలంలో పాల సేకరణ అమాంతం 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. ప్రైవేటు డెయిరీ ఫారాల వ్యాపారులు రంగప్రవేశం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రోత్సాహకం చెల్లింపునకు ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. వాస్తవంగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ప్రోత్సాహకానికి రూ. 12 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ అది ఏమూలకూ సరిపోవడంలేదు. దీంతో విజయ డెయిరీ తన వద్ద ఉన్న ఆర్థిక నిల్వలను ప్రోత్సాహకానికి మళ్లించాల్సి వచ్చింది. మరో రూ. 12 కోట్లు సొంతంగా ప్రోత్సాహక బకాయిలు చెల్లించినట్లు సమాచారం. ఇంకా రూ. 48 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రైవేటు డెయిరీలను కట్టడి చేసి ప్రోత్సాహక భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు యోచిస్తోంది.
సమాచారమంతా ఆన్లైన్లో...
ప్రైవేటు డెయిరీలకు ప్రోత్సాహకం వెళ్లకుండా నిరోధించేందుకు.. పాలు పోసే రైతులందరి వివరాలను ఆన్లైన్లో పెట్టాలని విజయ డెయిరీనిర్ణయించింది. రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, విజయ డెయిరీకి ఎన్ని లీటర్లు పోస్తున్నారన్న సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో ఏ గ్రామానికి చెందిన ఏ రైతు విజయ డెయిరీకి ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నారో ఎవరైనా ఆన్లైన్లో చూడొచ్చు. మరోవైపు పాల నాణ్యత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. నాణ్యత నిర్ధారణ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. పాలల్లో ఉండాల్సిన పోషకాలన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.