Private investors
-
వారీ ఎనర్జీస్‌కు రూ.1,000 కోట్లు
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూల్స్ తయారీలో ఉన్న వారీ ఎనర్జీస్ రూ.1,000 కోట్ల నిధులను సమీకరించింది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు సంస్థ సీఎండీ హితేష్ దోషి తెలిపారు. ఈ నిధులతో ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 గిగావాట్లకు చేర్చనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 గిగావాట్లు ఉంది. 2023 జనవరి నాటికి విస్తరణ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని చిక్లిలో ఉన్న కంపెనీకి చెందిన మాడ్యూల్స్ తయారీ కేంద్రం వద్ద 5.4 గిగావాట్ల సోలార్ సెల్స్ తయారీ యూనిట్ సైతం స్థాపిస్థామన్నారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో పాలుపంచుకోనున్నట్టు గుర్తు చేశారు. వారీ ఎనర్జీస్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ప్రాజెక్ట్ డెవలప్మెంట్, రూఫ్‌టాప్ సొల్యూషన్స్ అందించడంతోపాటు సోలార్ వాటర్ పంప్స్ తయారీలోనూ ఉంది. -
జియో మ్యానియా : క్యూలో టాప్ ఇన్వెస్టర్
సాక్షి, ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడుల మ్యానియా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ కంపెనీలు జియోలో పెట్టుబడులకు క్యూ కట్టాయి. తాజాగా ఈ వరుసలో మరో టాప్ కంపెనీ నిలవనుంది. వరుస మెగా డీల్స్ తో దూకుడుగా ఉన్న జియో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టాప్ ఇన్వెస్టర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ తో మరో భారీ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు చురుగ్గా సాగుతున్నట్టు సమాచారం. (రిలయన్స్ జియోలో ఏఐడీఏ పెట్టుబడి) రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియోలో టీపీజీ క్యాపిటల్ 1 నుంచి 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మరి కొద్ది రోజుల్లో రానుందని తెలిపింది. 1992లో ఏర్పాటైన టీపీజీ ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 45కి పైగా స్టార్టప్‌లలో 70 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా ఎయిర్ బీఎన్బీ, నైకా, లివ్‌స్పేస్, లెన్స్‌కార్ట్ , బుక్‌మైషో , సర్వేమన్కీ తదితరాలున్నాయి. (జియోలో రెండోసారి) కాగా గత ఏడు వారాల్లో జియోలో 21 శాతం వాటాల విక్రయం ద్వారా ఇప్పటికే రూ. 97,885.65 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ (రెండుసార్లు), జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ) కంపెనీలతో మెగా డీల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
40వేల కోట్లతో జాతీయ ఇన్ఫ్రా నిధి
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం రూ. 40,000 కోట్ల జాతీయ పెట్టుబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీఈవో నియామక ప్రక్రియ జనవరి ఆఖరు నాటికి పూర్తి కాగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రష్యా, సింగపూర్, బ్రిటన్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్.. ఎన్ఐఐఎఫ్లో పాలు పంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ఐఐఎఫ్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాలు తెలిపారు. ఫండ్ పనితీరును సమీక్షించేందుకు మార్చిలో కౌన్సిల్ మరోసారి సమావేశమవుతుందని చెప్పారు. ఈ నిధికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) పెట్టుబడుల సలహాదారుగా ఆరు నెలల పాటు వ్యవహరిస్తుంది. అలాగే ఎన్ఐఐఎఫ్ ట్రస్టీ లిమిటెడ్ సంస్థకు ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ఏడాది పాటు సలహాదారుగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌ఐఐఎఫ్‌కు బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.20,000 కోట్ల మేర కేటాయింపులు జరపనుండగా, ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి మరో రూ. 20,000 కోట్లు వస్తాయని అంచనా. కొత్త వాటితో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు, విస్తరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్థిక మంత్రి వ్యవహరిస్తుండగా, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 49శాతం లోపు ఉంటుంది.