ఇక ప్రైవేట్ మద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3,736 దుకాణాల్లో గీత కారి్మకులకు 10 శాతం షాపులను కేటాయించనున్నారు. ఈమేరకు నూతన మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సంపాదనే లక్ష్యంగా ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసిందని విమర్శించారు. మద్యం కొత్త విధానంపై సబ్ కమిటీ సిఫారసులను తాజాగా మంత్రి మండలిలో ఆమోదించినట్లు చెప్పారు. 180 ఎంఎల్ మద్యాన్ని రూ.99కే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం షాపులు వస్తాయన్నారు. రెండేళ్ల కాల వ్యవధిలో ప్రైవేటు వ్యక్తులకు లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నట్లు చెప్పారు. ఇందుకు రూ.2 లక్షలు (నాన్ రిఫండబుల్) దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు.రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబుల్లో రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షలుగా ఉంటుందన్నారు. 20 శాతం ప్రాఫిట్ మార్జిన్‌తో పాటు జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఐదేళ్ల కాల వ్యవధితో 12 ప్రీమియర్ మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.15 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ.కోటి లైసెన్స్ ఫీజు చెల్లించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం గురించి మంత్రి మండలిలో చర్చకు రాలేదని, అజెండాలో ఆ అంశాలు లేవని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన వలంటీర్, సచివాలయ వ్యవస్థల కొనసాగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎస్ఆర్ఎం వర్సిటీ డీమ్డ్ టూబీ వర్సిటీగా రూపాంతరం చెందేందుకు ఎన్ఓసీ జారీని మంత్రి మండలి ఆమోదించిందన్నారు. వచ్చే రబీకి కొత్త కౌలు కార్డులు కౌలు రైతులకు మేలు చేసేలా నిబంధనల్లో మార్పులు తెస్తున్నట్లు మంత్రి చెప్పారు. కౌలు కార్డుల ప్రొఫార్మా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదించిందన్నారు. ప్రస్తుతం కౌలు కార్డులపై రైతు (భూ యజమాని) సంతకం తప్పనిసరి చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాస్తవ భూ యజమానులు సంతకాలు చేయకపోవడంతో కౌలు రైతులకు ఆర్థిక సాయం, రుణాలు దక్కడం లేదన్నారు. రైతు సంతకం అవసరం లేకుండా 2011లో నాటి ప్రభుత్వం అమలు చేసిన నమూనాలో కౌలు కార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతుల భూమి హక్కుకు నష్టం లేకుండా వచ్చే రబీకి కార్డులు అందజేస్తామన్నారు. పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్..» రెండున్నరేళ్లలో కేంద్రం సహకారంతో పోలవరాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి చెప్పారు. దెబ్బతిన్న డయా ఫ్రంవాల్ స్థానంలో రూ.990 కోట్లతో పాత కాంట్రాక్టర్ ద్వారానే కొత్తది నిర్మించేందుకు మంత్రి మండలి ఆమోదించిందన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు. » బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపేందుకు మంత్రిమండలి ఆమోదం. » భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం. » ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ‘స్టెమీ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం. దీని ద్వారా కాన్సర్, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం. పాఠశాల విద్యార్థులకు కేంద్రం సహకారంతో ఆరోగ్య ఐడీ కార్డుల జారీ. » ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి. సీజీటీఎస్‌ఎంఈ ద్వారా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కోసం రూ.5 వేల కోట్లు అందుబాటులో ఉంచేందుకు ఆమోదం. » మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఇచ్చేందుకు ఆమోదం. » కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం లబ్ధిని ఎంఎస్ఎంఈలకు అందించేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం. కొలేటరల్ గ్యారెంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రూ.5 వేల కోట్ల మేర ఋణ సౌకర్యం. » కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులు అమరావతిలో రెండో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం.