సర్వర్లుగా ఎక్సైజ్ కానిస్టేబుళ్లు
మంగళగిరి : సర్వరుగా డ్యూటీ చేయాల్సి రావడంతో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలకు వేరే ఉద్యోగులను కేటాయించకపోవడంతో జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు సేల్స్‌మెన్‌గా డ్యూటీలు వేయడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒక్కో దుకాణానికి ఇద్దరిని కేటాయించారు. మొదట్లో బాటిల్ అమ్మకం మాత్రమే అని విధులు అప్పగించారు. అయితే, ఆదాయం రావట్లేదని భావించిన ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల్లోలాగా తినుబండారాలు, వాటర్ ప్యాకెట్లు సప్లయి చేయాలని మౌఖికంగా ఆదేశించింది.
దీంతో సర్వర్లుగా డ్యూటీ చేయాల్సి రావడంతో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనికితోడు సెలవులు కూడా ఇవ్వకపోవడం, ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వహించాల్సి రావడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీటిని జీర్ణించుకోలేక వారు సిక్ లీవ్ పెట్టేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 15 మందికిపైగా సిబ్బంది ఇలా లీవ్ పెట్టారు. రెండు మూడు రోజుల్లో మరికొందరు సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు.
దీనికితోడు దుకాణంలో మద్యం బాటిళ్లు పగిలిపోతే వాటి ధర కూడా వీరే చెల్లించాల్సి వస్తోంది. ఇలా నెలకు ఐదారు వేలు సమర్పించుకోవాల్సి రావడంతో వారు తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే మంగళగిరి, దుగ్గిరాల దుకాణాల్లో పని చేసే సిబ్బంది నెలలో బ్రేకేజీ బాటిళ్ళకు రూ.5 వేలను తమ జీతాల నుంచి చెల్లించి సెలవుపై వెళ్లిపోయారు. మరి కొందరు అదే దారిలో ఉన్నారు.