‘నీట్’గా సీట్లు బ్లాక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు పీజీ వైద్య సీట్ల భర్తీలో యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎన్ఆర్ఐ కోటాగా మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. 2019– 20 వైద్య విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ సీట్ల మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ శని, ఆదివారాల్లో జరగనున్న నేపథ్యంలో భారీగా సీట్లను బ్లాక్ చేసుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాయి! నీట్లో మంచి ర్యాంకులు సాధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో సీట్లు పొందిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రూ. లక్షల్లో నజరానాలు ఇచ్చి తమ కాలేజీల్లో చేరినట్లుగా చూపేందుకు పక్కాగా స్కెచ్ వేసుకున్నాయని తెలిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో అప్పటికప్పుడే సీట్ల కేటాయింపు జరగాల్సి ఉండటం, ఈ సీట్లకు స్థానిక రిజర్వేషన్ ఉండకపోవడం, ‘నీట్’వల్ల దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా మేనేజ్మెంట్ సీట్లకు పోటీ పడే అవకాశం ఉండటంతో యాజమాన్యాలు వీటిని తమకు అనుకూలంగా మార్చుకోజూస్తున్నాయి.
నీట్ ర్యాంకుల ఆధారంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే విడుదల చేసిన మెరిట్ జాబితాలో దాదాపు 50 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. వారంతా అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందిన వారేనని, ఇప్పటికే అఖిల భారత కౌన్సెలింగ్, వాళ్ల సొంత రాష్ట్రాల్లోని కౌన్సెలింగ్‌లో సీట్లు పొందారని చెబుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు పొంది మళ్లీ మన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో పీజీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని కొందరు టాప్ ర్యాంకర్లు కూడా జాతీయస్థాయి కాలేజీల్లో చేరినా ఇక్కడ కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లకు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇలా చేయడం వెనుక మతలబు ఏమిటని ఇతర వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేవలం సీటు బ్లాక్ చేసే ఎత్తుగడలో భాగంగా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆయా విద్యార్థులను రంగంలోకి దింపాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బ్లాక్ చేయడం ద్వారా సీటుకు రూ. కోట్లు..
రాష్ట్రంలో మైనారిటీ కాలేజీలతో కలుపుకొని 11 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లుండగా మరో 50%మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్లు ఇప్పటికే భర్తీ అవగా మేనేజ్మెంట్ కోటా కింద 500 సీట్లున్నాయి. ఈ కోటాలో మళ్లీ మూడు కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ–1లో సగం అంటే 250 సీట్లు ఉన్నాయి. వాటిలో ఫీజు ఏడాదికి రూ. 24 లక్షలు. ఇక కేటగిరీ–2లో 30 శాతం లెక్కన 150 సీట్లున్నాయి. ఇక కేటగిరీ–3లో 20 శాతం కింద 100 సీట్లున్నాయి. కేటగిరీ–2 సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు కేటగిరీ–1 ఫీజుకు మూడు రెట్లు ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 72 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. ఇక కేటగిరీ–3 కోటాను ఇన్స్టిట్యూషనల్ కోటా అంటారు. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వారి పిల్లలకు కేటాయించుకోవడానికి సంబంధించిన కోటా. వారి బంధువులకు కూడా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. వాటి ఫీజు కూడా కేటగిరీ–2 ఫీజుల మాదిరిగానే రూ. 72 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. ఇప్పుడు కేటగిరీ–1 సీట్లను బ్లాక్ చేయడం ద్వారా మేనేజ్మెంట్లు సీట్ల దందాకు తెరలేపాయి. కేటగిరీ–1 సీట్లలో చేరిన విద్యార్థులెవరైనా వాటిని వదులుకుంటే అవి ఆటోమేటిక్‌గా కేటగిరీ–2లోకి అంటే ఎన్ఆర్ఐ సీట్లుగా మారిపోతాయి. అలా మారిపోతే వాటి ఫీజు అధికారికంగానే రూ. 72 లక్షలు అవుతుంది. ఇక అనధికారికంగా డిమాండ్‌ను బట్టి రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు కూడా అమ్ముకునేలా యాజమాన్యాలు దందాకు సిద్ధమయ్యాయి.
ఎలా బ్లాక్ చేస్తారంటే?
పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేయడం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందిన మెరిట్ విద్యార్థులతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కుమ్మక్కయ్యాయని సమాచారం. ఈ కుమ్మక్కులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేరిన విద్యార్థులు కస్టోడియన్ సర్టిఫికెట్‌కు బదులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లనే వెరిఫికేషన్ కోసం తీసుకొస్తారు. అలా అక్కడ సీటు వచ్చిన విద్యార్థి ఇక్కడ కూడా కౌన్సిలింగ్లో పాల్గొంటారు. కాలేజీ యాజమాన్యంతో ముందే జరిగిన ఒప్పందం ప్రకారం ఇక్కడి కాలేజీల్లో వాళ్లు కేటగిరీ–1 సీటు కింద చేరతారు. అలాగే ఫీజు కింద రూ. 24 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన ఏళ్లకు బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తారు. మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి అన్ని కేటగిరీల్లోని అన్ని విడతల కౌన్సిలింగ్‌లు అయిపోయాక ఈ విద్యార్థులు తమ సీటును వదులుకుంటారు. దీంతో కేటగిరీ–1 సీట్లు కేటగిరీ–2లోకి అంటే ఎన్ఆర్ఐ కోటాలోకి మారిపోతాయి. అయితే సీటును వదులుకుంటే తప్పనిసరిగా సంబంధిత విద్యార్థి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 5 లక్షల జరిమానా చెల్లించాలి. ఆ సొమ్మును సైతం కాలేజీ యాజమాన్యాలే విద్యార్థికి ఇవ్వడంతోపాటు మరో రూ. 4–5 లక్షలు ముట్టజెబుతాయి. ఆ తర్వాత ఆ సీట్లను ఎన్ఆర్ఐ కోటాలోకి మార్చుకొని డిమాండ్‌ను బట్టి రూ. కోటి నుంచి రూ. రెండు కోట్ల వరకు అమ్ముకుంటాయి.
రూ. 200 కోట్ల దందాకు వ్యూహం!
ప్రైవేటు మెడికల్ కాలేజీల దందాను ఆపడం ఎవరి తరం కాదని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలే అనధికారికంగా అంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చి ఇక్కడ చేరితే తాము ఎలా అడ్డుకోగలమని అంటున్నాయి. కేటగిరి–1లోని 250 సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతోపాటు మన రాష్ట్రంలోని టాప్ ర్యాంకర్ల ద్వారా కూడా ఇటువంటి దందా నిర్వహించేందుకు యాజమాన్యాలు వ్యూహం రచించాయి. కనీసం 75 నుంచి 100 కేటగిరీ–1 సీట్లను కేటగిరీ–2 సీట్లలోకి మార్చేందుకు పథకం రచించినట్లు తెలిసింది. కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు రాజకీయంగా పలుకుబడి ఉండటంతో అధికారులు కూడా నోరుమెదపడంలేదు. వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ దందా వల్ల పలు కాలేజీలు దాదాపు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు అక్రమంగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందా వల్ల సహజంగా మెరిట్ ప్రకారం కేటగిరీ–1లో సీటు దక్కించుకోవాల్సిన విద్యార్థులు నష్టపోతున్నారు. గతేడాది దాదాపు 30 సీట్లు కేటగిరీ–1 నుంచి ఎన్ఆర్ఐ కేటగిరీలోకి మారినట్లు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి యాజమాన్యాలు 75 నుంచి 100 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఇదంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం.
50మందిలో మనోళ్లు ముగ్గురే..
ప్రైవేటు మెడికల్ కాలేజీలు మైండ్‌గేమ్ ఆడుతూ వ్యాపారం చేస్తున్నాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన మేనేజ్మెంట్ మెరిట్ లిస్టులోని టాప్–50 మందిలో 47 మంది కశ్మీర్, బిహార్, బెంగాల్ విద్యా ర్థులే ఉన్నారు. కేవలం ముగ్గురే మన రాష్ట్ర విద్యార్థులున్నారు. ఆ 47 మంది విద్యార్థులు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో కాలేజీల్లో చేరారు. మళ్లీ ఇక్కడ వారెందుకు దరఖాస్తు చేశారంటే యాజమాన్యాలు కుమ్మక్కైనట్లు అర్థమవుతోంది. దీనిపై ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు తీసుకోవాలి.
– విజయేందర్, జూడా, తెలంగాణ అధ్యక్షుడు
ఒక్క సీటు కూడా బ్లాక్ కానివ్వం...
మేనేజ్మెంట్ కోటాలోని కేటగిరీ–1 సీటు కోసం దేశంలోని ఏ విద్యార్థైనా పోటీ పడొచ్చు. అయితే తమ సొంత రాష్ట్రాల్లోని ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీటు పొంది మళ్లీ ఇక్కడ సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని గతంలోనే మాకు ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ సీటు పొందిన వారు ఇప్పటికే అక్కడ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారు. మన దగ్గర సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ ఉన్న వారినే అనుమతిస్తాం. ఈ విషయమై కౌన్సెలింగ్ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా వెరిఫికేషన్‌కు అనుమతించం. ఈ నెల 22న ఆలిండియా కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారి జాబితా కూడా వస్తుంది. ఆ జాబితాలో మేనేజ్మెంట్లోని కేటగిరీ–1 మెరిట్ లిస్ట్‌లో పేర్లను పరిశీలిస్తాం. అక్కడా ఇక్కడా ఆ విద్యార్థులే ఉంటే ఆయా కాలేజీలకు ఫోన్ చేసి ఇక్కడ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని తెలియజేస్తాం. ఆ తర్వాతే సీట్లు కేటాయిస్తాం. ఒక్క సీటు కూడా బ్లాక్ అవకుండా చూస్తాం. ఈ విషయంలో రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.
– డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం