మొదలైన ప్రైవేటు మెడికల్ కాలేజీల కుట్ర
► బీ కేటగిరీ సీట్ల దరఖాస్తుకు అడ్డంకులు
► వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు
► ముందే సీట్లు అమ్మేసుకుంటున్న యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల కుట్ర మొదలైంది. గతేడాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫీజుల పెంపు నుంచి ప్రవేశ పరీక్ష, అడ్మిషన్లు, నాలుగేళ్ల ఫీజు గ్యారంటీ వరకు అనేక విషయాల్లో చుక్కలు చూపించిన కాలేజీలు ఇప్పుడూ అదే పద్ధతి అవలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈసారి కూడా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోని 35 శాతం బీ కేటగిరీ సీట్లకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తుది గడువు. అయితే విద్యార్థులు దరఖాస్తు చేసుకుందామనుకుంటే ఆన్‌లైన్‌లో సమస్యలు వస్తున్నాయి. వెబ్‌సైట్‌లో ప్రకటించిన నంబర్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వెబ్‌సైట్‌లో పేర్కొన్న అడ్రస్‌లోనూ ఎవరూ అందుబాటులో లేరన్న విమర్శలూ వస్తున్నాయి.
దీంతో ఎవరికి చెప్పుకోవాలో పాలుపోక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగానే వెబ్‌సైట్‌కు అంతరాయం కలిగిందని నిర్వాహకులు చెబుతున్నా అందులో వాస్తవం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యాలు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పరీక్షపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
ముందే అమ్మేసుకుంటున్న వైనం..
రాష్ర్టంలోని ప్రైవేటు వైద్య, దంత విద్య కళాశాలల్లోని బీ కేటగిరీలోని 35 శాతం సీట్లకు పరీక్ష నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. 12 ప్రైవేటు కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు, మరో 10 కళాశాలల్లోని బీడీఎస్ సీట్లకు కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు. గతేడాది ప్రైవేటు కాలేజీలు నిర్వహించిన ప్రత్యేక ప్రైవేటు వైద్య పరీక్షకు 5,130 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 2,266 మందికి ర్యాంకులు ప్రకటించారు. అందులో సీట్లు పొందిన వారి నుంచి ఫీజుల రూపంలో లాగేసుకున్న యాజమాన్యాలు.. మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగిలిన నాలుగేళ్ల ఫీజుకు కూడా బ్యాంకు గ్యారంటీ చూపాలని ఒత్తిడి చేశాయి.
దీంతో గ్యారంటీ చూపలేక సీటు కోల్పోయారు. దీంతో గతేడాదిలాగా తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు రాకుండా యాజమాన్యాలు ముందే పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ముందే బీ కేటగిరీ సీట్లను అమ్మేసుకుంటున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీటు కొనుగోలు చేసిన విద్యార్థుల దరఖాస్తులనే ఆన్‌లైన్‌లో యాజమాన్యాలు నింపుతున్నాయని చెబుతున్నారు.
సర్వీస్ ప్రొవైడర్‌లో సమస్య వల్లే
సర్వీస్ ప్రొవైడర్ వల్లే వెబ్‌సైట్‌లో సమస్య తలెత్తింది. దీన్ని త్వరలో సరిదిద్దుతాం. అలాగే గడువు తేదీని కూడా వచ్చే నెల ఐదో తేదీ వరకు పెంచాలని నిర్ణయించాం.- డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ