రెండు పాఠశాలల బస్సులు ఢీ
ఓ బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మరో 8 మందివిద్యార్థులకు కూడా..
ఉయ్యూరు మండలం పొట్లపాడు శివారులో ఘటన
బెంబేలెత్తిన విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికుల ఆగ్రహం
ఉయ్యూరు : ఓ ప్రైవేటు సంస్థకు చెందిన పాఠశాల బస్సు ఎదురుగా వస్తున్న మరో స్కూల్‌బస్సు ను ఢీకొట్టింది. మండలంలోని పొట్లపాడు వద్ద గురువారం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్‌కు కాలు విరగ్గా, ఎనిమిది మంది విద్యార్థులకు గాయాల య్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. ఉయ్యూరులోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన పాఠశాల బస్సు పొట్లపాడులో విద్యార్థులను ఎక్కించుకొని తిరిగి వస్తోంది. ఉయ్యూరులోనే మరో ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు కడవకొల్లు వైపు నుంచి విద్యార్ధులతో పొట్లపాడు వైపు వెళుతోంది. సింగిల్ రోడ్డు కావడం, రెండు వైపులా పంట కాలువలు ఉండటం తో బస్సులు తప్పుకోవడం కష్టమైంది. ఈ సందర్భంగా ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ మేరుగ ప్రసాద్ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ కార్పొరేట్ పాఠశాల బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కార్పొ రేట్ పాఠశాల విద్యార్థులు టి.తులసి (8వ తరగతి), టి.గోపిచంద్ (6వ తరగతి), జె.లక్కి (ఎల్కేజీ), ఎం.కమల (నర్సరీ), ఎం.వీరనాగసాయి (5వ తరగతి), శ్రావణి (రెండో తరగతి), కీర్తన, ఆ బస్ డ్రైవర్ పాముల ఆదిశేషు, మరో పాఠశాల విద్యార్థి కె.జితేంద్ర (9వ తరగతి) గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆదిశేషు కాలు విరిగింది. ప్రమాదంలో కాలు విరిగినప్పటికీ ఆదిశేషు బాధపడుతూనే బ్రేక్‌పై కాలు తీయకుండా వాహనం పంటబోదెలోకి దూసుకుపోకుండా అదుపు చేశాడు.
గ్రామస్తులు, తల్లిదండ్రుల ఆగ్రహం
రెండు బస్సుల్లోని విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో గ్రామస్తులు, స్థానికులైన విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చారు. గాయపడినవారిలో కొందరిని 108లో, మిగిలినవారిని ఆటోల్లో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆదిశేషును విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం అనంతరం మరో బస్సు డ్రైవర్ మేరుగ ప్రసాద్ అక్కడినుంచి పరారవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. రూరల్ ఎస్సై యువకుమార్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. రెండు బస్సులను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఎవరిని పడితే వారిని డ్రైవర్లుగా చేర్చుకుని పిల్లల జీవితాలతో చెలగాటమాడుతారా ? ప్రమాదం జరిగితే పాఠశాల యాజమాన్యం ప్రతినిధులు రారా? పిల్లలను వదిలేసి డ్రైవర్ పారిపోతాడా? అంటూ బస్సులను పోలీసులు తరలించనీయకుండా అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని గ్రామ సర్పంచ్ యర్రపోతు అంక వరప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు యర్రపోతు సుజాత పరామర్శించారు.