private shops
-
Aadhaar: ఎక్కడ పడితే అక్కడ నమోదు కేంద్రాలు ఇదిగో ఆధారం!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రం. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిరునామాలో ఈ కేంద్రాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కానీ ఈ కేంద్రం నిర్దేశించిన చోటు కాకుండా ఓ ప్రైవేటు దుకాణంలో నిర్వహిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాల నిర్వహణ గాడితప్పింది. కేవలం బడి పిల్లల కోసం పాఠశాల ఆవరణలో మాత్రమే నిర్వహించాల్సిన ఈ కేంద్రాలు బహిరంగ మార్కెట్లో ప్రైవేటు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం... వాస్తవాలను గుర్తించినప్పటికీ పట్టనట్లు ఉండడంతో ఈ కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను గాలికొదిలేసిన నిర్వాహకులు... ఇష్టారీతిన నూతన ఆధార్ నమోదు, సవరణ ప్రక్రియను సాగిస్తున్నారు. దీంతో ప్రజా సమాచార గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 33 జిల్లాల్లో 876 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లు... రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు నూతన ఆధార్ కార్డుల జారీ, ఇప్పటికే జారీ చేసిన కార్డులకు సంబంధించి సవరణ తదితర సేవలను అందించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏకంగా పాఠశాల ఆవరణలోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష్యసాధన పూర్తయ్యే వరకు అక్కడే కొనసాగించేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా రెండు ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసిన పాఠశాల విద్యాశాఖ... ఏజెన్సీల వారీగా జిల్లాలను నిర్దేశిస్తూ నమోదు, సవరణ, అప్డేషన్ కోసం ప్రతేకంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో ఒక ఏజెన్సీకి 20 జిల్లాల బాధ్యతలను అప్పగిస్తూ 526 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లు ఇవ్వగా... మరో ఏజెన్సీకి 13 జిల్లాల బాధ్యతలు అప్పగిస్తూ 350 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను ఇచ్చింది. ఈ ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గతేడాది డిసెంబర్లో వెలువడగా... ఈ ఏడాది జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నిబంధనలు గాలికి... ప్రతి విద్యా ర్థికి చేరువలో ఆధార్ సర్వి సులను అందించాలనే లక్ష్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిబంధనలను ఏజెన్సీలు గాలికి వదిలేశాయి. క్షేత్రస్థాయిలో ఆపరేటర్లు, సూపర్వైజర్లను ఎంపిక చేసి వేతన చెల్లింపులతో నమోదు/సవరణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా క్షేత్రస్థాయిలో ఆసక్తి ఉన్న వారికి ఏజెన్సీలు ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను ఇచ్చేశాయి. దీంతో కిట్లు పొందిన వారు ఈ కేంద్రాలను ప్రైవేటు ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ అధికారి సమక్షంలో కొనసాగాల్సిన ఈ కేంద్రాలు ఇప్పుడు అంగట్లో సరుకుగా ఎక్కడపడితే అక్కడ నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణకు మంగళం పాడారు... ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రతి దరఖాస్తునూ సంబంధిత పర్యవేక్షణ అధికారి వెరిఫై చేసిన తర్వాతే ఆమోదిస్తాం. కానీ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన కిట్లతో నిర్వహిస్తున్న కేంద్రాలు ఇష్టానుసారంగా నడుస్తున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం, దరఖాస్తుల పరిశీలన కొరవడడంతో ఆధార్‌లో పొరపాట్లకు అవకాశం ఉంటుంది. – బైర శంకర్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మీసేవ ఫెడరేషన్ -
వేలం వేయరు.. దుకాణాలు తెరవరు
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ దుకాణాలకు అధికారులు, పాలకులు వేలం వేయడంలేదు.. దుకాణాలను తెరవడంలేదు. ఫలితంగా సర్కారు ఖజానాకు చిల్లు పడుతోంది. పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో రూ.1.56 కోట్ల వ్యయంతో నిర్మించిన 28 దుకాణాలను, అలాగే కూరగాయల మార్కెట్లో రూ.38 లక్షల వ్యయంతో 16 దుకాణాలను నిర్మించారు. వాటిని గతేడాది ఫిబ్రవరి 17న అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఆ దుకాణాలకు వేలం వేయకుండా తెరవకుండా ఉండటంతో మార్కెట్ యార్డుకు దాదాపు ఇప్పటివరకు రూ.30 లక్షల మేర ఆదాయం రాకుండా పోయింది. గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడో? మార్కెట్‌యార్డు పాలకవర్గాన్ని పొడగించేందుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇటీవలే ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఏడాది కాలంలో పాలకవర్గం షాపింగ్కాంప్లెక్స్లోని దుకాణాలను వేలం వేయడంలో విఫలమైంది. ఈ అంశం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. వారంరోజుల్లో టెండర్లకు ఆహ్వానిస్తామని అధికారులు అంటున్నారు. వ్యాపారులు ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జోరందుకున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాలు తొలగించారు. వ్యాపారస్తులకు సిద్ధంగా ఉన్న దుకాణాలు కావాలంటే నూతనంగా నిర్మించిన ఈ దుకణాలే దిక్కు. వాటిని ఎప్పుడు వేలం వేస్తారోనని ఏడాదిన్నరగా వేచి ఉన్నారు. రూ.30 లక్షల ఆదాయం పోయినట్టే.. మార్కెట్ విలువను బట్టి రైతుబజార్‌లోని 16 దుకాణాల సముదాయంలో ఒక్కొక్కదానికి రూ.2,200, వాణిజ్య సముదాయ దుకాణాలకు ఒక్కొక్క దానికి రూ.5,200 సర్కార్పాటను వేలానికి సిద్ధం చేశారు. కానీ రూ.5,200 అద్దె ఎక్కువ అవుతుందని వాటిని రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించాలని ఇంతవరకు దుకాణాలకు వేలం నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం వేలం వేసిన తర్వాత ఆ దుకణాలకు టెండర్లు ఎవరూ వేయకపోతే మళ్లీ రెండోసారి పిలవడం అప్పుడు రానట్లయితే మూడోసారి టెండర్లను రీకాల్చేస్తూ అద్దెలో మార్పులు చేర్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దుకాణాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో టెండర్లను ఇదివరకే పిలిచి ఉంటే ఇప్పటివరకు మార్కెట్‌కు రూ.30 లక్షల ఆదాయం వచ్చేది. ఇకనైనా పాలకులు, అధికారులు పట్టించుకుని వేలం వేసి దుకాణాలను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
‘ముందు’కొస్తే కటకటాలే!
రోడ్డుపై వ్యాపారుల ఆగడాలకు చెక్ దుకాణం ముందు ఖాళీ స్థలం ఉంది.. అక్కడ షెడ్ వేసి వస్తువులు బయటపెట్టుకొని వ్యాపారం చేసుకుందామనుకుంటే ఇక కుదరదు. ఇన్నాళ్లు జరిగింది.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందనుకుంటే పొరపాటు.. ఖాళీ స్థలాల్లో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆదిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 39(బీ) అప్లికేషన్ రూపొందించారు. దీని కారణంగా వాణిజ్య సముదాలు, ప్రైవేట్ దుకాణాలు, వ్యాపారుల ఆగడాలు అదుపుకానున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే వారి పనిపట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి చర్యలకు చెక్ పెట్టనున్నారు. ఇందుకు 39(బీ)ను ఉపయోగించనున్నారు. ఇలా పనిచేస్తుంది జీపీఎస్ ఉన్న వీడియో స్వీప్ కెమెరాలు ట్రాఫిక్ పోలీసుల వాహనంపైనే పెట్టి తిప్పుతారు. ఆ వీడియో ద్వారా ఫొటోలను తీసుకుని ఏ ఏ దుకాణం నిబంధనలు అతిక్రమించిందో గుర్తిస్తారు. జీపీఎస్ లోకేషన్ ద్వారా సంబంధిత ఫొటోతో పాటు సదరు వ్యాపారి ట్రేడింగ్ లెసైన్స్, ప్రాంతం, సమయం తదితర వివరాలను 39(బీ) అప్లికేషన్లో నిక్షిప్తం చేస్తారు. తరువాత ఆ వివరాలను, జరిమానాను సంబంధిత వ్యాపారికి పంపుతారు. అపుడు చలాన్ చెల్లించాలి. ఇలా మూడుసార్లు ఒకే వ్యక్తి తప్పుచేస్తే అతని ట్రేడ్ లెసైన్స్ రద్దుచేయడంతోపాటు మూడు నెలల జైలు శిక్షణ కూడా విధిస్తారు. డ్రంకన్ డ్రైవ్ స్ఫూర్తితో.. నగరంలో పకడ్బందీగా సాగుతున్న డ్రంకన్ డ్రైవింగే స్ఫూర్తిగా ఈ ఆలోచన వచ్చింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఐదుసార్లు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి...ఇటీవల మళ్లీ పట్టుబడ్డాడు. సదరు వాహన నంబర్ ఆన్లైన్లో చెక్ చేయగా... ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ సిస్టమ్‌లో నిక్షిప్తమై ఉన్న అతడి డాటా వచ్చేసింది. ఆరోసారి పట్టుబడటంతో అతడికి మూడు నెలల జైలు శిక్షను విధించారు. ఈ ఘటనతోనే ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అందుకే 39(బీ) అప్లికేషన్ కార్యరూ పం దాల్చిం దని ట్రాఫిక్ పోలీసు అదనపు డీసీ రంగనాథ్ తెలిపారు. -
రాయితీ విత్తనం.. బహుదూరం
యాచారం: రైతులకు రాయితీ కూరగాయల విత్తనాలు అందే విషయంలో అయోమయం నెలకొంది. ఉద్యాన శాఖ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో ఉండడంతో కూరగాయల విత్తనాలు ఎప్పుడు వస్తున్నాయో... విక్రయాలు ఎప్పుడు జరుగుతున్నాయో రైతులకు సమాచారం తెలియడంలేదు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే 50 శాతం రాయితీ విత్తనాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. యాచారంలోనే ఉద్యాన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కూరగాయల రాయితీ విత్తనాలను అందించాలని స్థానిక రైతులు పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోతోంది. యాచారరం నుంచి ఇబ్రహీంపట్నం 15 కిలోమీటర్ల దూరంలో ఉండడం, పైగా ప్రయాణ ఖర్చులు రూ. 50కి పైగా కావడం, కాల యాపన అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు ధరలు ఎక్కువగా ఉన్నా ప్రైవేట్ దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీ అందుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. వంద హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో.. మండలంలోని యాచారం, గునుగల్, మొండిగౌరెల్లి, తాడిపర్తి, నందివనపర్తి, గడ్డమల్లయ్యగూడ, మాల్ తదితర గ్రామాల్లోని రైతులు 100 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయల తోటల ను సాగు చేయడానికి పొలాలను సిద్ధం చేశారు. దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రైవేట్ దుకాణాల్లో కూరగాయల ధరలు భగ్గుమనడం, ఉద్యాన శాఖ నుంచి రాయితీ విత్తనాలు అందకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తక్షణమే రాయితీ కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ ఇబ్రహీంపట్నం క్షేత్రస్థాయి అధికారి యాదగిరిని సంప్రదించగా మరికొద్ది రోజుల్లో రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. -
బియ్యం ధరలు పైపైకి...
సరిపోని రేషన్ బియ్యం - జాడలేని ప్రభుత్వ సన్నరకం విక్రయ కేంద్రాలు - ప్రైవేటు దుకాణాల్లో ఇష్టారాజ్యంగా ధరలు - సామాన్యులకు తప్పని కష్టాలు లక్సెట్టిపేట : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. జిల్లాలో ప్రధాన పంటగా వరి పండిస్తున్నా బియ్యం ధరలు మాత్రం రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. వాటి ధర వింటేనే.. పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పుణ్యమా అని వారు మూడు పూటలా అన్నం తినే పరిస్థితి లేకుండాపోయింది. అన్నం తప్పనిసరి.. జిల్లా ప్రజల్లో మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్యే ఎక్కువ. జొన్న రొట్టె, చపాతితోపాటు అన్నం కచ్చితంగా ఉండాల్సిందే. అన్నంకు ఇక్కడి ప్రజలు అంతగా ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో కూరలేమి లేకపోయినా వేడి అన్నంలో కాస్త ఊరగాయ వేసుకుని పెరుగుతో భోజనం ముగించి, తమతమ పనులకు వెళ్తుంటారు. అయితే పెరిగిన బియ్యం ధరలతో కడుపునిండా అన్నం తినే పరిస్థితి పేద, మధ్యతరగతి ప్రజలకు లేకుండా పోయింది. రోజూ దొడ్డు బియ్యం తింటూనే బంధువులు వస్తే సన్నబియ్యం వండిపెట్టేవారు ప్రస్తుత ధరలతో బెంబేలెత్తుతున్నారు. అయితే వీరి అవసరం.. బియ్యం వ్యాపారులకు వరంగా మారింది. కొందరు ఇష్టారాజ్యంగా దొడ్డు, సన్నరకం బియ్యం ధరలు పెంచేసి అందినంత దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. సరిపోని రేషన్ బియ్యం.. ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు ద్వారా నెలకు ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున అందించే బియ్యం పక్షం రోజులకే సరిపోతున్నాయి. దీంతో మిగతా రోజుల గాసానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాలు, రైస్డిపోల నుంచి బియ్యం కొనాల్సిన పరిస్థితి. మార్కెట్లో కిలో దొడ్డు రకం బియ్యం ధర రూ.16 ఉండగా.. సన్నరకాల ధర రూ.40 పైనే ఉంది. అటు అధిక ధరలకు బియ్యం కొనలేక.. ఇటు రేషన్ బియ్యం సరిపోక పేద, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గత్యంతరం లేక ఉన్నవాటిలో కాస్త తక్కువ ధరకు లభించే బియ్యాన్ని కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నరకం బియ్యం కేంద్రాలేవీ..? సామాన్యులు సైతం సన్నరకం బియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుతం కొన్ని నెలల క్రితం సన్నరకం బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించింది. అధికారులు ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.29లకు కిలో బియ్యం చొప్పున విక్రయించింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో సన్నరకం బియ్యం తినగలమనే ధీమా పేద, మధ్యతరగతి ప్రజల్లో కలిగింది. అయితే ఈ కేంద్రాలను ప్రారంభించిన నెల రోజులకే ఎత్తివేయడంతో పేదలకు నిరాశే మిగిలింది. రేషన్ బియ్యం సరిపోక.. బహిరంగ మార్కెట్లో సన్నరకం బియ్యం కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. పుట్టగొడుగుల్లా బియ్యం దుకాణాలు మండల కేంద్రంలో బియ్యం దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రోజురోజుకు బియ్యం దుకాణాల సంఖ్య పెరుగుతోంది. కొందరు వ్యాపారులు సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యం అమ్ముతూ పేదలను దోచుకుంటున్నారు. మరికొందరు నాసిరకం, పురుగులు ఉన్నవి అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం ధరలను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.