‘ముందు’కొస్తే కటకటాలే!
రోడ్డుపై వ్యాపారుల ఆగడాలకు చెక్
దుకాణం ముందు ఖాళీ స్థలం ఉంది.. అక్కడ షెడ్ వేసి వస్తువులు బయటపెట్టుకొని వ్యాపారం చేసుకుందామనుకుంటే ఇక కుదరదు. ఇన్నాళ్లు జరిగింది.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందనుకుంటే పొరపాటు.. ఖాళీ స్థలాల్లో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆదిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 39(బీ) అప్లికేషన్ రూపొందించారు. దీని కారణంగా వాణిజ్య సముదాలు, ప్రైవేట్ దుకాణాలు, వ్యాపారుల ఆగడాలు అదుపుకానున్నాయి.
- సాక్షి, సిటీబ్యూరో
రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే వారి పనిపట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి చర్యలకు చెక్ పెట్టనున్నారు. ఇందుకు 39(బీ)ను ఉపయోగించనున్నారు.
ఇలా పనిచేస్తుంది
జీపీఎస్ ఉన్న వీడియో స్వీప్ కెమెరాలు ట్రాఫిక్ పోలీసుల వాహనంపైనే పెట్టి తిప్పుతారు. ఆ వీడియో ద్వారా ఫొటోలను తీసుకుని ఏ ఏ దుకాణం నిబంధనలు అతిక్రమించిందో గుర్తిస్తారు. జీపీఎస్ లోకేషన్ ద్వారా సంబంధిత ఫొటోతో పాటు సదరు వ్యాపారి ట్రేడింగ్ లెసైన్స్, ప్రాంతం, సమయం తదితర వివరాలను 39(బీ) అప్లికేషన్‌లో నిక్షిప్తం చేస్తారు. తరువాత ఆ వివరాలను, జరిమానాను సంబంధిత వ్యాపారికి పంపుతారు. అపుడు చలాన్ చెల్లించాలి. ఇలా మూడుసార్లు ఒకే వ్యక్తి తప్పుచేస్తే అతని ట్రేడ్ లెసైన్స్ రద్దుచేయడంతోపాటు మూడు నెలల జైలు శిక్షణ కూడా విధిస్తారు.
డ్రంకన్ డ్రైవ్ స్ఫూర్తితో..
నగరంలో పకడ్బందీగా సాగుతున్న డ్రంకన్ డ్రైవింగే స్ఫూర్తిగా ఈ ఆలోచన వచ్చింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఐదుసార్లు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి...ఇటీవల మళ్లీ పట్టుబడ్డాడు. సదరు వాహన నంబర్ ఆన్‌లైన్‌లో చెక్ చేయగా... ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ సిస్టమ్‌లో నిక్షిప్తమై ఉన్న అతడి డాటా వచ్చేసింది. ఆరోసారి పట్టుబడటంతో అతడికి మూడు నెలల జైలు శిక్షను విధించారు. ఈ ఘటనతోనే ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అందుకే 39(బీ) అప్లికేషన్ కార్యరూ పం దాల్చిం దని ట్రాఫిక్ పోలీసు అదనపు డీసీ రంగనాథ్ తెలిపారు.