ప్రైవేట్ ట్యాక్సీలపై ఆర్టీవో కొరడా
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు
* పీవీఎస్ఏ బ్యాడ్జీలు ఉన్న ట్యాక్సీలే తిరగాలని హుకుం
* రేడియో ట్యాక్సీలకు సైతం బ్యాడ్జీలు తప్పనిసరి
* త్వరలో ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ ప్రారంభం
సాక్షి, ముంబై: ఆర్టీవో అధికారులు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో నగరంలోని 27 శాతం ప్రైవేట్ ట్యాక్సీలు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రవాణా అధికారి ఒకరు మాట్లాడుతూ.. టూరిస్ట్ ట్యాక్సీలను నడిపేందుకు కావాల్సిన బ్యాడ్జీలు లేకపోవడంతో చాలా మంది డ్రైవర్లు సేవలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ప్రతి డ్రైవరు పబ్లిక్ సర్వీస్ వెహికిల్ అథరైజేషన్ (పీవీఎస్ఏ) బ్యాడ్జీలను కలిగి ఉండాలన్నారు.
రేడియో ట్యాక్సీలతోపాటు టూరిస్ట్ వాహన డ్రైవర్లు కూడా ఈ బ్యాడ్జీలను కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాము కొన్ని రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది డ్రైవర్లకు బ్యాడ్జీలు లేనట్లుగా గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే రేడియో ట్యాక్సీలు, టూరిస్టూ వాహనదారులకు కూడా బ్యాడ్జీలు లేని డ్రైవర్లకు వాహనాలు అప్పగించవద్దని రవాణా శాఖ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు.
అదేవిధంగా క్యాబ్‌లలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్యాబ్ కంపెనీలను ఆదేశించామని చెప్పారు. క్యాబ్‌ల్లో జీపీఎస్ వ్యవస్థ, మొబైల్ యాప్స్‌లలో ఎస్ఓఎస్ బటన్ తదితర ప్రాథమిక భద్రతా చర్యలను క్యాబ్‌లలో అందుబాటులో ఉంచనట్లయితే సదరు కంపెనీలు వాహనాలను నడిపేందుకు లెసైన్సులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించామన్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ మహేష్ జగాడే ట్యాక్సీ నిర్వాహకులతో ఓ సమావేశం నిర్వహించారు. ట్యాక్సీలలో భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సదరు క్యాబ్‌లలో ఏదైనా నేరం జరిగితే దానికి కంపెనీయే జవాబుదారీ వహించాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు.
దీంతో ‘మేరు ప్లస్’ కంపెనీ తమ ఐదు ట్యాక్సీల్లో ప్రయోగాత్మకంగా ‘ప్యానిక్ స్విచ్’లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ను కూడా ప్రారంభించనున్నట్లు ఆర్టీవో అధికారి పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రయాణికులు పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. ఇక్కడ స్విచ్ వేయడం ద్వారా జీపీఎప్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ రూంలో ఉన్న పోలీసులకు సదరు డ్రైవరు పూర్తి వివరాలు, వాహనం ఏ ప్రాంతంలో ఉందో తెలుస్తుందని అధికారి తెలిపారు. నిర్భయ పథకం ద్వారా దీనిని వాహనాల్లో అమర్చనున్నట్లు అధికారి వివరించారు.