నేడు, రేపు ప్రివిలేజెస్ కమిటీ సమావేశం
- 12 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
- 25, 26 తేదీల్లో అభిప్రాయాలు విననున్న కమిటీ
- హైదరాబాద్లో సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం మంగళ, బుధవారాల్లో హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. గత నెల ఎనిమిది నుంచి పది వరకూ జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై వైఎస్సార్సీపీ శాసనసభ్యులు 12 మంది అభిప్రాయాలను విననుంది. కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ ఈ నెల 15న వీరికి నోటీ సులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నానిగుడివాడ), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజ తుని), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), రాచమల్లు శివప్రసాదరెడ్డి(ప్రొద్దుటూరు) ఈనెల 25న మంగళవారం ఉదయం 11.30 గంటలకు కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంది. 26వ తేదీ బుధవారం నాడు అదే సమయానికి కమిటీ ముందు హాజరై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), డాక్టర్ ఎం.సునీల్ కుమార్ (పూతలపట్టు), కిలేటి సంజీవ య్య (సూళ్లూరుపేట), కంబాల జోగులు(రాజాం) అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంది.