ప్రియాంకను 'ఆ' దృష్టితో చూడలేదు..
అసెంబ్లీలో ప్రియాంక గాంధీ ఫొటోను చూసిన బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్
సెల్‌ఫోన్‌ను సభలోకి తీసుకెళ్లడం తప్పేనని క్షమాపణలు
ప్రియాంకను ‘..ఆ’ దృష్టితో చూడలేదంటూ మీడియాకు వివరణ
చర్చ సమయంలో మొబైల్ గేమ్ ఆడుతూ మీడియాకు చిక్కిన బణకార్
శాసనసభల్లో అమ్మాయిల ఫొటోలుచూడటం వారి సంస్కృతి : సిద్ధు
బెంగళూరు: ప్రజాసమస్యల చర్చకు వేదికైన శాసనసభలో మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తూ బీజేపీ శాసనసభ్యులు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఇందులో ఒకరు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ ఫొటోను అసభ్య రీతిలో తాకుతూ (టచ్) కెమరా కంట పడ్డారు. వివరాలు... బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో బీదర్ జిల్లా ఔరాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే ప్రభూచౌహాన్, బెంగళూరులోని బసవనగుడి ఎమ్మెల్యే రవిసుబ్రహ్మణ్య ఒకరి పక్కన మరొకరు కుర్చొని ఉన్నారు. జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి చెరుకు రైతుల సమస్య పై మాట్లాడుతున్న సమయంలో ప్రభుచౌహాన్ తన సెల్‌ఫోన్‌ను తీసి అందులోని కొన్ని ఫొటోలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే సహచర ఎమ్మెల్యే అయిన రవిసుబ్రహ్మణ్యకు తన ఫోన్లోని కొన్ని ఫొటోలను చూపించడం మొదలు పెట్టారు. అయితే సభలో కెమెరాలు ఉన్నాయని ఫోన్‌ను పక్కన పెట్టాలని సూచించిన రవిసుబ్రహ్మణ్య ఫోన్ చూడకుండా పక్కకు తప్పుకున్నారు. అయినా ప్రభు చౌహాన్ మాత్రం సెల్‌ఫోన్‌లోని ఫొటోలను చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుచౌహాన్ తన సెల్ఫోన్లో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, యోగా గురువు బాబారామ్దేవ్ల ఫొటోలను చూసి ఆ తర్వాత ప్రియాంకాగాంధీ ఫొటోను తాకుతూ జూమ్ చేయడం మీడియా కంటపడింది. ఈ విషయం ప్రసారం అవుతున్న విషయం తెలుసుకున్న రవిసుబ్రహ్మణ్య మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
‘ప్రభు చౌహాన్ కూతురి పెళ్లికి నేను హాజరుకాలేక పోయాను. అందుకే ఆయన తన సెల్ఫోన్లో ఉన్న కూతురు, అల్లుడు ఫొటోలను చూపిస్తున్నారు. నేను ఇది సమయం కాదని చెప్పడంతో మిన్నకుండి పోయారు. ఆయన ఏ ఫొటోను చూశారో నాకు తెలియదు.’ అని వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత కొద్ది సేపటికి ప్రభుచౌహాన్ కూడా మీడియాతో మాట్లాడుతూ... ‘శాసనసభలోకి సెల్‌ఫోన్‌ను తీసుకువెళ్లకూడదన్న నియమాన్ని పాటించకపోవడం నేను చేసిన తప్పు. ఇందుకు క్షమాపణ కోరుతున్నా. జామర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో నా ఫోన్‌కు మెసేజ్ వచ్చినట్లు అనిపించి, మెసేజ్‌ను చదువుదామని అనుకుంటూ ఫోన్‌ను చేతిలోకి తీసుకున్నా. వివిధ ప్రముఖుల ఫొటోలతో పాటు వారు వివిధ సందర్భాల్లో చెప్పిన ప్రముఖ వాఖ్యలు కూడా అందులో ఉన్నాయి. అందులో ప్రియాంకా గాంధీ ఫొటో కూడా ఒకటి. ఆ ఫొటో పక్కనే ఉన్న వాఖ్యలు చదవడం కోసం నేను జూమ్ చేయాల్సి వచ్చింది. అంతేతప్ప నాకు మరే ఇతర ఉద్దేశం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు.’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా బుధవారం రోజే బీజేపీకు చెందిన మరో శాసనసభ్యుడు యూబీ బణకార్ (హిరేకెరూర్) తన సెల్ఫోన్లో చట్టసభలోనే క్యాండీక్రాష్ (ఓ మొబైల్ గేమ్) ఆడుతూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప కంటబడ్డారు. దీంతో మార్షల్ వచ్చి ఇది సరికాదని చెప్పడంతో సర్దుకున్నారు. అయితే ఈ విషయం అప్పటికే మీడియాలో ప్రసారం అయిపోయింది. కాగా, గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు నీలిచిత్రాలను చూస్తూ మీడియా కంటపడిన విషయం తెలిసిందే.
అమ్మాయిల ఫొటోలు చూడటం వారి సంసృతి : సీఎం సిద్ధు
శాసనసభ సమావేశంలో చౌహాన్ ప్రవర్తనపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చట్టసభల్లో అమ్మాయిల ఫొటోలను చూడటం వారి సంసృతి. ప్రియాంకాగాంధీతో సహా ఏ అమ్మాయిని కూడా అలా చూడటం సరికాదు. శాసనసభలోకి సెల్ఫోన్లను అనుమతించడం, అనుమతించకపోవడం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.’ అని పేర్కొన్నారు. కాగా, చట్టసభల్లోకి సెల్ఫోన్లను తీసుకురాకుండా కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాల్సి ఉందని టీబీ జయచంద్ర ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు.
వినూత్న నిరసన... : బుధవారం ఉదయం శాసనసభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే ప్రభుచౌహాన్ తన నియోజక వర్గంలో అనర్హత పేరుతో పేదల బీపీఎల్ కార్డులనూ రద్దు చేస్తోందని ఆరోపిస్తూ గంపలో కొన్ని బీపీఎల్ కార్డులను వేసుకుని సభలోకి ప్రవేశించారు. విషయం గమనించిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇలా చేయడం తగదని హితవు పలికారు. అప్పటికి మిన్నకుండిపోయిన ప్రభుచౌహాన్ కొంత సమయం తర్వాత రద్దయిన బీపీఎల్ కార్డులను తన దుస్తులపై పిన్నీలు, ప్లాస్టర్ సహాయంతో అతికించుకుని నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ శాసనసభలో సమస్యల ప్రస్తావన హుందాగా ఉండాలి. ఇలాగే ప్రవర్తించాలి అనుకుంటే బయటికి వెళ్లిపోండి’ అని హెచ్చరించారు.