బాల్యవివాహాల కేసులు ప్రతి ఏడాది పైపైకి
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిరోధక చట్టం(పీసీఎంఏ)-2006 ప్రకారం 2013-15 మధ్య కాలంలో ఓవరాల్గా 795 కేసులు నమోదు అయ్యాయి. బాల్య వివాహాలకు సంబంధించి 2013, 2014, 2015లలో వరుసగా 222, 280, 293 కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎస్సీఆర్బీ) వెల్లడించింది. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి క్రిష్ణ రాజ్ ఈ వివరాలను తెలిపారు. బాలికలను బరువుగా భావించే ఆలోచన తీరుతోనే బాల్య వివాహాలు జరగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
నిరక్షరాస్యత, పేదరికం, సమాజంలో మహిళలపై చిన్నచూపు, సామాజిక నేపథ్యం, సంస్కృతితో సహా బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే సమస్యలలపై అవగాహన లేకపోవడంతోనే బాలికలకు వివాహాలు చేస్తున్నారని చెప్పారు. కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాత్రమే ఈ సమస్య పరిష్కారం కాదని, ఇందుకు మీడియా సహకారం ఎంతైనా అవసరమన్నారు. తరచూ సభలు, కార్యక్రమాలు లాంటివి నిర్వహిస్తూ సాధ్యమైనంత వరకూ బాల్య వివాహాలను అరికట్టే చర్యలు చేపట్టాలని మహిళా మంత్రి క్రిష్ణ రాజ్ పిలుపునిచ్చారు.