దరఖాస్తుల వెల్లువ
నెల్లూరు(క్రైమ్): నూతన ఆబ్కారీ సంవత్సరం(2014-15)లో మద్యం దుకాణాల లెసైన్సులు పొందేందుకు వ్యాపారులు పోటెత్తారు. దరఖాస్తు దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో వేలాది మంది తరలివచ్చారు. నెల్లూరు భక్తవత్సలనగర్లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ ప్రాంగణం ఉదయం నుంచి మద్యం వ్యాపారులతో కిక్కిరిసింది. దుకాణాలను దక్కించుకునేందుకు మహిళలు సైతం పురుషులతో పోటీపడ్డారు. అధికారులు ముందుగా ప్రకటించినట్లుగా మధ్యాహ్నం 3 గంటలకే కార్యాలయ గేట్లను మూసేశారు. అప్పటికే కార్యాలయ ఆవరణలో ఉన్న సుమారు 1,500 మందికి పైగా వ్యాపారులు దరఖాస్తుల సమర్పణకు బారులుదీరారు.
నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చిన వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు లోనికి అనుమతించలేదు. అయితే కొందరిని లోనికి పంపించడం వివాదానికి తెరలేపింది. శుక్రవారం రాత్రి 10.30గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 328మద్యం దుకాణాలకు సుమారు 3,500 దరఖాస్తులు దాఖలైనట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. 20మద్యం దుకాణాలకు దరఖాస్తులు దాఖలు కాలేదన్నారు.
అయితే ఇంకా పలువురు వ్యాపారులు దరఖాస్తులతో క్యూలో నిలబడి ఉండడంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొత్తం మీద దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం అర్థరాత్రి వరకు కొనసాగుతోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్యమురళి, నెల్లూరు ఈఎస్ డాక్టర్ కె. శ్రీనివాస్, గూడూరు ఈఎస్ పర్యవేక్షించారు. వ్యాపారులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాల్గోనగర ఎస్ఐ డి.వెంకటేశ్వరరావు బందోబస్తు నిర్వహించారు.
ప్రభుత్వ ఖజానాకు రూ. 8.75కోట్లు
ప్రతి వ్యాపారి దరఖాస్తుతో పాటు రూ. 25వేలు ధరావత్తు ప్రభుత్వానికి చెల్లిం చారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటల వరకు దాఖలైన 3,500 దరఖాస్తుల ద్వారా ఖజానాకు సుమారు రూ. 8.75 కోట్లు జమయ్యాయి. మరింత నగదు ప్రభుత్వానికి రానుంది.
లక్కీడిప్కు ఏర్పాట్లు.
మద్యం దుకాణాల లెసైన్సులు మంజూరు చేసేందుకు లక్కీడిప్ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ పర్యవేక్షణలో జరగనుంది. కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.