మల్లన్నసాగర్ పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు నిర్మాణం ఆగదు
రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
ముత్తారం : మల్లన్నసాగర్ నిర్మాణం సాఫీగా జరిగితే తమకు రాజకీయ సన్యాసమే శరణ్యమని భావించి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జలాశయం నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ సమీపంలోని మానేరునదిపై వంతనె నిర్మాణానికి ఆయన రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధూసూధనాచారి, ఎమ్మెల్యే పుట్ట మధుతో గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని పెంచడం, భూసేకరణపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే కన్నుకుట్టిన ప్రతిపక్ష నాయకులు రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్లి జీవో 123ను రద్దు చేయించారని ఆరోపించారు. భూసేకరణలో నిర్వాసితులకు నష్టం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. పరిహారం చెల్లింపుల్లో అన్ని రకాలుగా న్యాయం చేయడం కోసమే ప్రభుత్వం జీవో 123 విడుదల చేసిందన్నారు. జీవో 123 రద్దుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.