అడిగిన వారందరికీ ఉపాధి పనులు
కర్నూలు(అగ్రికల్చర్) : అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ పనులు కావాలని అడిగినా పనులు కల్పించకపోతే సంబంధిత మండల అభివృద్ధి అధికారులకు(పీఓ) ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం 39 వేల మంది ఉపాధి పనులకు వస్తున్నారని, ఎంతమంది వచ్చినా పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఉపాధి పనులకు హాజరయ్యేవారికి ప్రత్యేక వేసవి అలవెన్సులు కూడా ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం ప్రకారం అలవెన్సులు ఉంటాయని తెలిపారు.
అంటే మార్చి నెలలో 75 శాతం పనిచేసినా పూర్తిగా వేతనం వస్తుందన్నారు. వికలాంగులకు ఇప్పటికే 30 శాతం అలవెన్స్ ఉందని, దీనికి వేసవి అలవెన్స్‌లు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. గతంలో 39 మండలాల్లోని 24 వేల శ్రమశక్తి సంఘాలకు షేడ్ నెట్లు ఇచ్చామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవిలో కూలీలు నీళ్లు తెచ్చుకునేందుకు రోజుకు రూ.5 ప్రకారం చెల్లిస్తామని పీడీ వివరించారు. నివాసిత ప్రాంతం నుంచి ఉపాధి పనికి వెళ్లడానికి దూరం 5 కిలోమీటర్లపైన ఉంటే రోజుకు రూ.15 చార్జీల కింద చెల్లిస్తామని, వికలాంగులకు రూ.20 ఇస్తామని తెలిపారు. గంపకు రోజుకు రూ.3 ఉంటుందని వివరించారు.
ఉపాధి పనులకు వచ్చే కూలీలకు ఇవన్నీ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా వస్తాయని పేర్కొన్నారు. కుటుంబానికి ఒక జాబ్‌కార్డు ఇచ్చామని, కుటుంబంలో ఎవరికైనా వివాహం అయి వేరు కాపురం పెట్టి ఉంటే వారికి ప్రత్యేక జాబ్ కార్డులు ఇస్తామని తెలిపారు. పని దినాలను 100 నుంచి 150కి ప్రభుత్వం పెంచిందన్నారు. ఇప్పటికే 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్న కుటుంబాలు మరో 50 రోజులు ఉపాధి పనులు చేయవచ్చని వివరించారు. పనికి వచ్చేవారికి తగిన వేతనం లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధి పనులు కల్పించకపోతే 70955 33220కు ఫోన్ చేయవచ్చని వివరించారు.