'12 నుంచి ప్రాజెక్టుల యాత్ర'
హైదరాబాద్: రాయలసీమ విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన పార్టీ ప్రధాన కార్యాయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో ఉన్న 150 సీట్లలో రాయలసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 107 సీట్లు కేటాయించాల్సి ఉండగా ఈ ఏడాది 12 మందికే ప్రవేశాలు లభించాయన్నారు.
1974లో రాష్ట్రపతి ఆమోదంతో చట్టసవరణతో చేసిన జోనల్ వ్యవస్ధ ప్రకారం ఎస్వీయూ పరిధిలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి 107 సీట్లు ఇవ్వాలన్నారు. అయితే రాష్ట్రంలోని 13 జిల్లాలనూ లోకల్ ఏరియాగా అమలు చేస్తూ ప్రభుత్వం జీవో 120ని జారీ చేయడంతో సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికే రాయలసీమ అన్ని విధాలా దగాపడ్డ, వెనకబడిన కరువు పీడిత ప్రాంతమన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జోనల్ వ్యవస్ధను పాటించకపోతే అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ అంటే సాధ్యమయ్యే విషయం కాదన్నారు.